యథేచ్ఛగా అక్రమ కట్టడాలు..!
- అనుమతులు ఒకటి.... నిర్మాణం మరొకటి
- నర్సాపూర్ మున్సిపాలిటీలో ఇష్టారాజ్యం
- నిబంధనలు గాలికి.....అక్రమ కట్టడాలకు అడ్డుకట్టేది ఎవరు?
- ‘పార్కింగ్ మాటున అక్రమ సెల్లార్లు! ...చోద్యం చూస్తున్న సంబంధిత అధికారులు
నర్సాపూర్, సెప్టెంబర్ 02: నర్సాపూర్ మున్సిపాలిటీ(Narsapur Municipality) పరిధిలో భవన నిర్మాణ నిబంధనల ఉల్లంఘనలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అనుమతులకు మించి అంతస్తులు నిర్మించడం, ఖాళీ స్థలం వదలకుండా నిర్మాణాలు చేపట్టడం, పార్కింగ్ పేరిట సెల్లార్లు నిర్మించడం, అనుమతులు లేకుండానే పనులు ప్రారంభించడం వంటి ఉల్లంఘనలు జరుగుతున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. పట్టణ ప్రణాళిక విభాగం పర్యవేక్షణ తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
అనుమతులు ఒకటి.. నిర్మాణం మరొకటి
కొంతమంది అనుమతులు లేకుండానే నిర్మాణాలు ప్రారంభిస్తుండగా, మరికొందరు అనుమతించిన అంతస్తులకు మించి నిర్మిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. నిబంధనల ప్రకారం వదలాల్సిన ఖాళీ స్థలాన్ని సైతం వదలకుండా నిర్మాణాలు చేపడుతున్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి.
పార్కింగ్ పేరిట సెల్లార్ల నిర్మాణాలు
ప్రధాన రహదారుల పక్కన నిర్మిస్తున్న కొన్ని భవనాల్లో పార్కింగ్ పేరిట నిబంధనలకు విరుద్ధంగా సెల్లార్లు నిర్మిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఫిర్యాదులు వచ్చినా నోటీసులతోనే సరిపెడుతున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నిబంధనల అమలులో అందరికీ సమానంగా వ్యవహరించాలని పట్టణవాసులు కోరుతున్నారు.
అధికారుల పర్యవేక్షణపై ప్రశ్నలు
నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు జరుగుతున్నా అధికారులు సకాలంలో కఠిన చర్యలు తీసుకోవడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. రాజకీయ ఒత్తిళ్ల కారణంగా చర్యలు తీసుకోవడంలో వెనుకడుగు వేస్తున్నారన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. ప్రత్యేక తనిఖీలు నిర్వహించి అక్రమ నిర్మాణాలను గుర్తించాలని ప్రజలు కోరుతున్నారు.
కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్
అనుమతులకు అనుగుణంగా నిర్మాణాలు జరుగుతున్నాయా, నిబంధనలు పాటిస్తున్నారా అనే అంశాలపై అధికారులు సమగ్ర తనిఖీలు నిర్వహించాలని పట్టణవాసులు కోరుతున్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
నోటీసులు జారీ చేశాం: సాయికుమార్, మున్సిపల్ కమిషనర్
నిబంధనలకు విరుద్ధంగా చేపడుతున్న సెల్లార్, పార్కింగ్ నిర్మాణాలపై ఇప్పటికే నోటీసులు జారీ చేశామని మున్సిపల్ కమిషనర్ సాయికుమార్(Municipal Commissioner Saikumar) తెలిపారు. నోటీసుల అనంతరం కూడా పనులు కొనసాగితే జిల్లా టాస్క్ఫోర్స్కు నివేదిక పంపుతామని చెప్పారు. నిబంధనలు ఉల్లంఘించిన కట్టడాలకు రెట్టింపు పన్ను విధించడంతో పాటు, అవసరమైతే ఉన్నతాధికారుల అనుమతితో కూల్చివేతలు చేపడతామని స్పష్టం చేశారు.






