3 September, 2026 | 2:06 AM

కాంగ్రెస్‌ను పాతాళానికి తొక్కేందుకు ప్రజలు సిద్ధం..

03-09-2026 | 12:59am
  1. రాబోయేది బీఆర్‌ఎస్ ప్రభుత్వమే
  2. వంద రోజుల హామీలు వెయ్యి రోజులైనా శూన్యం.. దొంగ హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ పార్టీ
  3. ఆనాడు దాచుకోమన్న గ్యారెంటీ కార్డులు.. ఇప్పుడెక్కడ పెట్టుకోమంటారు భట్టి గారూ?
  4. మహిళలకు స్కూటీలు లేవు కానీ.. ముగ్గురు మంత్రుల లూటీలు మాత్రం జోరుగా సాగుతున్నాయి
  5. జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రంలో కదం తొక్కిన గులాబీ దళం.. 420 అడుగుల భారీ ఫ్లెక్సీతో మహా నిరసన ర్యాలీ
  6. కాంగ్రెస్ వైఫల్యాలపై నిప్పులు చెరిగిన మాజీ ఎమ్మెల్యేలు, రాష్ట్ర నాయకులు 

భద్రాద్రి కొత్తగూడెం, సెప్టెంబర్ 2 (విజయక్రాంతి): కాంగ్రెస్ ను పాతాళానికి తొక్కేందుకు ప్రజల సిద్ధంగా ఉన్నారంటూ, రాబోయేది టిఆర్‌ఎస్ ప్రభుత్వమే 100 రోజుల్లో హామీలు వెయ్యి రోజులైనా అమలు కాలేదని, దొంగ హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ పార్టీకి ప్రజలు రాబోయే ఎన్నికల్లో తగిన బుద్ధి చెబుతారు అంటూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో టిఆర్‌ఎస్ నాయకులు మాజీ ఎమ్మెల్యేలు అన్నారు.

టిఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ పిలుపు మేరకు బుధవారం జిల్లాలోని అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో, మండల కేంద్రాల్లో బి ఆర్ ఎస్ శ్రేణులు కదం తొక్కాయి. కొత్తగూడెం నియోజకవర్గ కేంద్రంలో ఎంపీ వద్దిరాజ్య రవిచంద్ర, మాజీ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో, ఇల్లందు నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ ఆధ్వర్యంలో, అశ్వరావుపేట నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే మెచ్చ నాగేశ్వరరావు రాష్ట్ర నాయకులు ఉప్పల వెంకటరమణ ఆధ్వర్యంలో, భద్రాచలం నియోజకవర్గం కేంద్రంలోనూ , పినపాక నియోజకవర్గం మణుగూరులో గులాబీ శ్రేణులు భారీ నిరసన కార్యక్రమాలు నిర్వహించి తాసిల్దార్ కు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీలు నెరవేర్చడం లేదంటూ వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ దొంగ హామీలు, మాయమాటలతో ప్రజలను తప్పుదోవ పట్టించి అధికార పీఠమెక్కిన కాంగ్రెస్ పార్టీకి రోజులు దగ్గరపడ్డాయని, ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఆ పార్టీని పాతాళానికి తొక్కేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని బీఆర్‌ఎస్ శ్రేణులు సమరశంఖం పూరించాయి. కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన 420 మోసాలను ఎత్తిచూపుతూ 420 అడుగుల భారీ ఫ్లెక్సీని ప్రదర్శించడం ఈ నిరసనకే హైలైట్గా నిలిచింది.

మహిళలకు 2500 రూపాయలు, 4000 పెన్షన్ , రైతులకు 15 వేల పెట్టుబడి సాయం, యువతకు ఐదు లక్షల ఆర్థిక సహాయం వంటి అమలు చేయలేని దొంగ హామీలతో ప్రజలను మభ్యపెట్టి గద్దెనెక్కిన ఈ ప్రభుత్వానికి రాబోయే ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెప్పడం ఖాయమన్నారు.  ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై ఈ పోరాటం మరింత ఉద్ధృతం అవుతుందని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.