యాక్టివ్ మోడ్‌లో బీజేపీ
- రాష్ట్రంలో కాంగ్రెస్‌తో బిగ్‌ఫైట్‌కు తెరలేపుతున్న కమలం
- నితిన్ నబీన్ డైరెక్షన్‌తో యాక్టివ్ మోడ్‌లోకి తెలంగాణ బీజేపీ
- నేతలంతా ఐక్యంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరుబాట
- వివిధ రకాల ఎజెండాలతో దూకుడు పెంచిన కాషాయ పార్టీ
- నితిన్ నబీన్ టూర్‌తో రాష్ట్ర నాయకత్వంలో బిగ్ ఛేంజ్
హైదరాబాద్, సెప్టెంబర్ 2 (విజయక్రాంతి): బీజేపీ ఫుల్ యాక్టివ్ అయ్యింది. తెలంగాణ రాజకీయం కొన్ని రోజులుగా వాడివేడిగా ఉంది. బీజేపీ అనూహ్యంగా ఫుల్ ఫామ్‌లోకి రావడంతో రాష్ట్ర రాజకీయ రూపు మారిపోయింది. ఇప్పటి వరకు కాంగ్రెస్ వర్సెస్ బీఆర్‌ఎస్ అనుకున్న ఫైట్, ఇప్పుడు కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అన్నట్లుగా మారింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ డైరెక్షన్‌తో (BJP National President Nitin Nabeen) తెలంగాణ నాయకత్వం యాక్టివ్ మోడ్‌లోకి వచ్చింది.
వివిధ ఎజెండాలతో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతోంది. కాంగ్రెస్ నాయకులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. రెండు రోజులుగా కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తల మధ్య గట్టి వార్ నడుస్తోంది. రాష్ట్ర స్థాయి నుంచి జిల్లాల పార్టీ కార్యాలయాలకు, నేతల ఇంటిపై దాడుల వరకు పంచాయితీ నడుస్తోంది. నేతల ముందస్తు అరెస్టులు, పరస్పర విమర్శనాస్త్రాలు రాష్ట్ర వాతావరణాన్ని ఒక్క సారిగా హీట్ పెంచాయి.
కాంగ్రెస్సే టార్గెట్‌గా..
తెలంగాణలో నితీన్ నబిన్ టూర్ నేతల్లో బిగ్ చేంజ్‌ని తీసుకొచ్చిందనే చెప్పాలి. ఇన్నాళ్లు ఎవరికి వారు యమునా తీరే అన్నట్టుగా వ్యవహరించిన కొందరు బీజేపీ నేతలు.. ఇప్పుడు పార్టీ కార్యక్రమాల్లో కలసిమెలిసి కనిపిస్తున్నారు. అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వంలోని వైఫల్యాలను మీడియా సమావేశాల్లో ధాటిగా ఎండగడుతున్నారు. 22ఏ నిషేధిత భూముల జాబితా, ఫీజుల అంశంపై రెండు రోజుల నిరాహార దీక్ష చేపట్టడం, కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలనపై బీజేపీ ఛార్జ్ షీట్ దాఖలు చేయడం ఇందులో భాగంగానే చూడాల్సి ఉంటుంది.
అంతేకాకుండా సామాన్య ప్రజలు, విద్యార్థుల సమస్యలపై సీఎం రేవంత్ రెడ్డికి రాష్ట్ర నాయకత్వం వరుసగా బహిరంగ లేఖలు రాయడం, ఈనెల 7న ఫీజు బకాయి లడాయి పేరుతో చలో హైదరాబాద్ పేరుతో మహాధర్నా చేపట్టబోతోంది. ఫీజు రీయింబర్స్‌మెంట్ సమస్యపై బీజేపీ రాష్ట్ర చీఫ్ రెండు రోజుల దీక్షకు పిలుపునిస్తే.. రాష్ట్రంలో ఉన్న నేతలంతా ఒక్కచోట చేరిపోయి.. ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు సంధించారు.
అంతేకాకుండా పార్టీ రాష్ట్ర కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ నేతల దాడి ఘటనపై బీజేపీ నేతలంతా కన్నెర్ర జేశారు. నేతల ఐక్యత చూసి పార్టీలో ఆసక్తికర చర్చ సాగుతోంది. వచ్చే ఎన్నికల వరకు నేతలంతా ఇలాగే కలిసికట్టుగా ముందుకు సాగితే మెరుగైన ఫలితాలు వస్తాయనే ప్రచారం పార్టీ వర్గాల్లో జరుగుతోంది.
అస్సలు తగ్గొద్దన్న జాతీయ నాయకత్వం..
తెలంగాణలో అధికారంలోకి రావాలని కమలం పార్టీ ఓ దశాబ్ధకాలంగా ఎదురుచూస్తోంది. రాష్ట్రం వచ్చాక రెండు సార్లు ఎన్నికల్లో అధికారం కోసం ప్రయత్నించినా కాషాయ పార్టీకి గట్టి ఎదురుదెబ్బే తగిలింది. అయితే గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు వరకు రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్‌ను గద్దె దింపడంలో కాంగ్రెస్ సక్సెస్ అయ్యింది. ఉన్నపళంగా కాంగ్రెస్ పవర్‌లోకి రావడంతో.. రాష్ట్రంలో బీఆర్‌ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్టుగా ఫైట్ జరిగేది.
ఈ నేపథ్యంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితీన్ నబీన్ కొత్తగా బాధ్యతలు చేపట్టడం.. రాష్ట్ర నాయకత్వంతో భేటీ కావడం, తెలంగాణకు రావడం నేతలకు క్లాస్ తీసుకోవడం చేశారు. ఇన్నాళ్లు ఎడమొహం -పెడమొహంగా ఉన్న తెలంగాణ లీడర్లు నితిన్ నబీన్ యాక్షన్, డైరెక్షన్‌తో ఏకమైనట్టుగా కనిపిస్తోంది. రాంచందర్ రావు, మహేశ్వర్ రెడ్డి, కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఈటల రాజేందర్, డీకే అరుణ, రఘునందన్ రావు, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, లక్ష్మణ్, అర్వింద్ కుమార్‌తోపాటు ఇతర నేతలంతా కలిసి కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు.
ప్రతిపక్ష స్థానాన్ని బీజేపీ పూర్తిగా ఆక్రమించి క్రమంగా అధికారంలోకి వచ్చేందుకు పావులు కదుపుతోంది. నితిన్ నబీన్ లాంటి యువ నాయకుడు రావడం, కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై అస్సలు వెనక్కి తగ్గొద్దని ఇటీవల రాంచందర్ రావుకు ఏకంగా ఫోన్ చేసి చెప్పడం రాష్ట్ర నాయకత్వానికి పూర్తి స్వేచ్ఛ, భరోసా ఇచ్చారు. రాష్ట్రంలోని పరిస్థితులు చూస్తే 2029 ఎన్నికలే టార్గెట్‌గా కమలనాథులు పావులు కదుపుతున్నట్లు స్పష్టమవుతోంది.






