17 July, 2026 | 1:56 AM

వానదేవుడి కరుణ కోసం గ్రామాల్లో ప్రత్యేక పూజలు

17-07-2026 01:54 AM

గద్వాలలో మహిళల బిక్షాటన.. వాన పాటలతో ప్రత్యేక ప్రార్థనలు

మల్దకల్లో శివలింగానికి అఖండ జలాభిషేకం.. 

మంచి వర్షాల కోసం రైతుల ప్రార్థనలు

గద్వాల, జూలై 16: వరుసగా వర్షాలు కురిసి పంటలు సమృద్ధిగా పండాలని ఆకాంక్షిస్తూ జోగులాంబ గద్వాల జిల్లాలోని పలు గ్రామాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. గద్వాల మండలం చేనుగొనిపల్లి గ్రామ మహిళలు సంప్రదాయ పద్ధతిలో వానదేవుడికి ప్రత్యేక పూజలు చేస్తూ వాన పాటలు పాడుతూ బిక్షాటన చేపడుతున్నారు. కర్రతో చేసిన బొమ్మను యాపాకు, పసుపు, కుంకుమ, పూలతో అలంకరించిన బుట్టలో పెట్టుకుని గద్వాల పట్టణంలోని అంగళ్లకు వెళ్లి మహిళలు బియ్యం, ధాన్యం, నగదు సేకరిస్తున్నారు.

వాటితో వారం రోజుల పాటు ప్రత్యేక పూజలు నిర్వహించి, చివరగా ఇంటి కప్పుపై ఉండే దోనిలో కప్పను కిందకు వదిలితే వానదేవుడు ప్రసన్నమై వర్షాలు కురిపిస్తాడనే విశ్వాసంతో ఈ ఆచారాన్ని కొనసాగిస్తున్నట్లు తెలిపారు. అదే సమయంలో మల్దకల్ మండలం మల్లెందొడ్డి గ్రామంలోని శివాలయంలో శివలింగానికి అఖండ జలాభిషేకం నిర్వహిస్తూ మంచి వర్షాలు కురవాలని భక్తులు ప్రార్థనలు చేస్తున్నారు. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో రైతులు, గ్రామస్తులు ప్రకృతి అనుకూలించాలని వేడుకుంటుండగా, తరతరాలుగా కొనసాగుతున్న ఈ జానపద ఆచారాలు గ్రామీణ వ్యవసాయ సంస్కృతికి, ప్రకృతిపట్ల ప్రజల విశ్వాసానికి ప్రతీకగా నిలుస్తున్నాయి.