17 July, 2026 | 1:30 AM

నీట్ టాపర్లుగా ఇద్దరు

17-07-2026 01:16 AM
  1.   715 మార్కులతో ఆర్యన్‌గుప్తా, ప్రన్షుల్ భన్సాల్‌కు ఫస్టుర్యాంక్
  2.  19 మంది విద్యార్థులకు 700, 1,492 మందికి 650పైగా..   
  3.  20 లక్షల మందిలో 11.21 లక్షల మంది అర్హత
  4.  నీట్ రీ-టెస్ట్ ఫలితాలు విడుదల
  5.  ఫైనల్ కీ వెబ్‌సైట్‌లో.. గంటల వ్యవధిలోనే వెల్లడించిన ఎన్టీయే 

హైదరాబాద్, జూలై 16 (విజయక్రాంతి): దేశ వ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్న నీట్ యూజీ- 2026 పునఃపరీక్షలో ఇద్దరు టాపర్లుగా నిలిచారు. 720 మార్కులకు ఆర్యన్‌గుప్తా, ప్రన్షుల్ భన్సాల్ 715 మార్కులు సాధించి, మొదటి ర్యాంక్ కొట్టారు. 19 మంది విద్యార్థులకు 700, 1,492 మందికి 650పైగా మార్కులు వచ్చాయి. మొత్తం 20 లక్షల మంది పరీక్షకు హాజరవ్వగా 11.21 లక్షల మంది అర్హత సాధించారు.

గురువారం నీట్ రీ-టెస్ట్ ఫలితాలను విడుదల చేసింది. ఫైనల్ కీ వెబ్‌సైట్ ఉంచిన కొన్ని గంటల వ్యవధిలోనే తుదిఫలితాలను ఎన్టీయే విడుదల చేసింది. జూన్ 21న మరోసారి దేశ వ్యాప్తంగా రీ-నీట్ ఎగ్జామ్ విషయం తెలిసిందే. ఈ పరీక్షకు దాదాపు 20లక్షల మందికిపైగా విద్యార్థులు హాజరయ్యారు. జూలై 13న ఓంఎఆర్‌షీట్లు విడుదల చేసి, బుధవారం వరకు (జూలై 15)అభ్యంతరాలు స్వీకరించిన ఎన్టీఏ, గురువారం ఫైనల్ కీని వెబ్‌సైట్‌లో ఉంచారు.

అయితే కొన్ని గంటల వ్యవధిలోనే తుది ఫలితాలను విడుదల చేసింది. ఇందులో 19 మంది విద్యార్థులు 720 మార్కులకు 700  సాధించారు. పంజాబ్‌కు చెందిన ఆర్యన్ గుప్తా, హరియాణాకు చెందిన ప్రన్షుల్ భన్సాల్ 715 మార్కులు సాధించి టాపర్లుగా నిలిచారు. అలాగే 1492 మంది స్టూడెంట్స్ 650పైగా మార్కులు పొందారు. 10,160 మందికి 600 మార్కులు ఆ పైన, 90,780మందికి 500 ఆపైన మార్కులు వచ్చాయి.

690 కంటే ఎక్కువ మార్కులు సాధించిన ఆ 138 మంది అభ్యర్థులలో 93 శాతానికి పైగా మొదటిసారి నీట్ పరీక్షకు హాజరైన వారు కావడం గమనార్హం. నీట్ అర్హత సాధించిన అభ్యర్థులలో 58 శాతానికి పైగా మహిళలే ఉన్నారు. అత్యధిక సంఖ్యలో అభ్యర్థులు ఉత్తీర్ణులైన రాష్ట్రంగా ఉత్తరప్రదేశ్ మరోసారి నిలిచింది. అక్కడ 1.7 లక్షల మందికి పైగా అర్హత సాధించారు. తర్వాతి స్థానాల్లో మహారాష్ట్ర (1.25 లక్షలు), రాజస్థాన్ (1.19లక్షలకు పైగా) ఉన్నాయి.

లక్షద్వీప్‌లో 43 మందే అర్హత పొందారు. 705 కంటే ఎక్కువ మార్కులు వచ్చిన మొదటి 17 మంది అభ్యర్థులు పంజాబ్, హర్యానా, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, బీహార్, తమిళనాడుతోపాటు తెలంగాణ(8 రాష్ట్రాలు)కు చెందినవారు. జనరల్ కేటగిరీలో 2.91లక్షల మంది, ఓబీసీలో 5.12లక్షల మంది, ఎస్సీలో 1.59 లక్షల మంది, ఎస్టీలో 63,716 మంది, జనరల్ ఈడబ్ల్యుసీలో 95,026 మంది, పీడబ్ల్యూ బీడీలో 3,666 మంది, పీడబ్ల్యూడీలో 303 మంది విద్యార్థులు అర్హత పొందారు.