17 July, 2026 | 1:13 AM

బోనం ఎత్తి న గోల్కొండ

17-07-2026 12:59 AM

జగదాంబిక అమ్మవారికి కుమ్మర్ల తొలి బోనం 

ప్రభుత్వం తరఫున బంగారు బోనం, పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్

హైదరాబాద్/జూబ్లీహిల్స్, జూలై 16 (విజయక్రాంతి) : తెలంగాణ సంస్కృతిని, సం ప్రదాయాన్ని ప్రతిబింబించే ఆషాఢ మాస బోనాలు గోల్కొండ కోటలో గురువారం ప్రారంభం అయ్యాయి. జగదాంబిక మహంకాళి అమ్మవారికి కుమ్మర్లు తొలి బోనం సమర్పించి ఉత్సవాలను ప్రారంభించారు. లంగర్ హౌస్ నుంచి పోతురాజుల విన్యాసాలు, డప్పు వాయిద్యాల మధ్య ప్రభుత్వం తరఫున మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ బంగారు బోనం, పట్టువస్త్రాలను సమర్పించారు.

బోనాలతో గోల్కొండ పరిసరాలు భక్తజన సందోహంగా మారా యి. లంగర్‌హౌస్‌లో నిర్వహించిన కార్యక్రమంలో సాంస్కృతిక శాఖ రూపొందించిన ఆషాఢ బోనాల ఉత్సవాల బుక్‌లెట్‌ను మం త్రులు ఆవిష్కరించారు. జగదాంబిక ఆలయ కమిటీకి ప్రభుత్వం తరఫున రూ.11 లక్షల చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా మం త్రులిద్దరూ ఈరగోల చేతిలో ధరించి భక్తులను ఉత్సాహపరిచారు.

మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ.. గోల్కొండ జగదాంబిక అమ్మవారి కృపతో ఎల్ నినో ప్రభావం తగ్గి, భూతల్లి శాంతించి సమృద్ధిగా వర్షాలు కురవాలని కాంక్షించారు. మంత్రి పొన్నం మాట్లాడుతూ.. గోల్కొండ బోనాలకు ఎంతో ప్రాముఖ్యత ఉందని అన్నారు. తెలంగాణ బోనాలు సంస్కృతి ఐక్యతకు ప్రతీకగా నిలుస్తాయని స్పష్టం చేశారు. 

కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు వి హనుమం తరావు, ఎమ్మెల్యే దానం నాగేందర్, మాజీ ఎంపీ మధుయాష్కిగౌడ్, తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ, దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామ య్యర్, డైరెక్టర్ హనుమంతరావు, హైదరాబాద్ కలెక్టర్ ప్రియాంక అలా, సాంస్కృతిక శాఖ డైరెక్టర్ ఏనుగు నర్సింహారెడ్డి, ఆలయ కమిటీ చైర్మన్ చంద్రశేఖర్ పాల్గొన్నారు.

ఏర్పాట్లను పరిశీలించి సజ్జనర్

హైదరాబాద్ సిటీ బ్యూరో (విజయక్రాంతి): గోల్కొండ  బోనాల ఉత్సవాల ఏ ర్పాట్లను సీపీ సజ్జనర్  పరిశీలించారు. అనంతరం జగదాంబికా మహంకాళి అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు.  

కనకాల కట్ట మైసమ్మకు తొలి బోనం 

ముషీరాబాద్(విజయక్రాంతి): ఆషాఢ మాస బోనాలను పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్ర కుమ్మరి సంఘం ఆధ్వర్యంలో గురువారం కుమ్మర్లు తొలి బోనం జాతర అంగరంగ వైభవంగా నిర్వహించారు. లోయర్ ట్యాంక్ బండ్ వద్ద ఉన్న శ్రీ కనకాల  కట్టమైసమ్మ అమ్మవారికి  తొలి బోనం సమర్పించారు.

వేడుకల్లో మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, ఎంపీ ఈటల రాజేందర్, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య, ఎమ్మెల్యేలు వీరపల్లి శంకర్, దానం నాగేందర్, కార్పొరేషన్ చైర్మెన్లు మెట్టు సాయి కుమార్, మల్ రెడ్డి రాంరెడ్డి, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ తదితరులు హాజరయ్యారు.