విద్యార్థులకు ఉచిత సైకిళ్లు అందించాలి
17-07-2026 01:51 AM
మల్దకల్, జూలై 16: జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండలంలోని బిజ్వారం గ్రామానికి చెందిన విద్యార్థులు ప్రతిరోజూ ప్రభుత్వ పాఠశాలకు నడిచి వెళ్లాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. దూరం నడవడం వల్ల అలసట, కాళ్ల నొప్పులతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు.
ప్రభుత్వం ఉచితంగా సైకిళ్లు పంపిణీ చేస్తే సమయానికి పాఠశాలకు చేరుకుని చదువుపై మరింత శ్రద్ధ పెట్టగలమని పేర్కొన్నారు. పాఠశాల వేళల్లో బిజ్వారం గ్రామానికి ప్రత్యేక బస్సు సర్వీసు ఏర్పాటు చేయడంతో పాటు, నడిచి వచ్చే విద్యార్థులకు వెంటనే సైకిళ్లు మంజూరు చేయాలని తల్లిదండ్రులు, గ్రామస్థులు, విద్యార్థులు ప్రభుత్వాన్ని కోరారు.






