నా శ్వాస, ధ్యాస కరీంనగర్
కరీంనగర్ పార్లమెంట్ అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తున్నా:మంత్రి బండి సంజయ్
కరీంనగర్, జూలై16(విజయక్రాంతి): “తన ధ్యాస, శ్వాస అంతా కరీంనగర్ పైన ఉందని, పెద్ద ఎత్తున నిధులు తీసుకొచ్చి కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ అభివ్రుద్ది చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నానని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తెలిపారు.
అందులో భాగంగా రాజకీయాలకు అతీతంగా అందరిని కలుపుకుంటూ పార్లమెంట్ అభివ్రుద్ధికి క్రుషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. కరీంనగర్ కార్పొరేషన్ కు అర్బన్ ఛాలెంజ్ ఫండ్ కింద వచ్చిన నిధులతో త్వరలోనే గల్లీగల్లీలో సీసీ రోడ్లను నిర్మించడంతోపాటు నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దుతానని తెలిపారు.
కరీంనగర్ పర్యటనలో భాగంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ గురువారం సాయంత్రం మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ సునీల్ రావు, స్థానిక కార్పొరేటర్లతో కలిసి 36వ డివిజన్ లోని మారుతీనగర్ నైస్ ఇండియా బిల్డింగ్ వద్ద రూ.60 లక్షల (యూఐడీఎఫ్ రూ.50 లక్షలు, జనరల్ ఫండ్ రూ.10 లక్షలు) వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్డు, డ్రెయిన్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం 27వ డివిజన్ శివాజీ నగర్ లోని కరీంనగర్ డెయిరీ సమీపంలో రూ.49 లక్షల వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్డు, డ్రెయిన్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.
బండి సంజయ్ రాక సందర్భంగా ఆయా డివిజన్ల నుండి పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చి బండి సంజయ్ పై పూలు చల్లి స్వాగతం పలికారు. సంజయ్ తో సెల్పీలు దిగారు. ఈ సందర్బంగా స్థానికులను కలిసి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కరీంనగర్ కార్పొరేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదని. స్మార్ట్ సిటీ, అమ్రుత్ 1, 2, యూడీఎఫ్ పేరుతో కేంద్రం నుండి వేల కోట్ల నిధులు తీసుకొచ్చి అభివ్రుద్ధి చేసినమన్నారు. ఇటీవల అర్బన్ ఛాలెంజ్ ఫండ్ కింద 840 కోట్లు తీసుకొచ్చినం. యూడీఎఫ్ కింద మరో 30 కోట్లు రాబోతున్నాయి. కరీంనగర్ కార్పొరేషన్ రూపురేఖలే మారబోతున్నాయన్నారు.






