05-02-2026 12:00:00 AM
ఎస్పీ రోహిత్ రాజు
మున్సిపాలిటీ ఎన్నికల నేపథ్యంలో పోలీస్ అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎస్పీ
భద్రాద్రి కొత్తగూడెం, ఫిబ్రవరి 4 (విజయక్రాంతి): మున్సిపల్ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా పోలీస్ శాఖ తరఫున కట్టుదిట్టమైన చర్యలను చేపడుతున్నట్లు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు తెలిపారు. ఇందులో భాగంగానే జిల్లాలోని మూడు మున్సిపాలిటీల పరిధిలో జరగనున్న ఎన్నికల నేపథ్యంలో పోలీస్ అధికారులతో ఎస్పీ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్ నందు బుధవారం సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఇతర శాఖల అధికారులతో సమన్వయం పాటిస్తూ 08 ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు, 04 స్టాటిక్ సర్వేలయన్స్ బృందాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.
కొత్తగూడెం కార్పొరేషన్, ఇల్లందు, అశ్వారావుపేట మున్సిపాలిటీలకు ఈ నెల 11వ తేదీన జరగనున్న ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. జిల్లా వ్యాప్తంగా మూడు మున్సిపాలిటీల పరిధిలో మొత్తం 101 పోలింగ్ స్థానాలలోని 288 పోలింగ్ కేంద్రాలలో ఈ నెల 11వ తేదీన పోలింగ్ జరగనుంది. ఇందులో సాధారణ పోలింగ్ కేంద్రాలు 148, సున్నితమైన పోలింగ్ కేంద్రాలు 125 మరియు 15 క్రిటికల్ పోలింగ్ కేంద్రాలను గుర్తించినట్లు తెలిపారు. మున్సిపాలిటీల వారీగా సంబంధిత అధికారులు నిష్పక్షపాతంగా వ్యవహారిస్తూ ప్రజలు ప్రశాంత వాతావరణంలో తమ ఓటు హక్కును వినియోగించుకునేలా బాధ్యతగా విధులు నిర్వర్తించాలన్నారు. ఎన్నికల పోటీలో నిలుచున్న అభ్యర్థులు తప్పనిసరిగా సంబంధిత అధికారుల వద్ద నుండి అనుమతులు పొందిన తర్వాతనే తమ ప్రచార కార్యక్రమాలను చేపట్టాలని కోరారు.
అనుమతులు లేనియెడల ఎన్నికల నియమావళి ప్రకారం అట్టి అభ్యర్థులపై కేసుల నమోదు చేయడం జరుగుతుందన్నారు. ఓటర్లను ప్రలోభపరిచే విధంగా ఎవరైనా నగదు, మద్యం, ఇతరత్రా సామాగ్రిని అక్రమ రవాణా చేస్తూ పట్టుబడితే చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. సామాన్య ప్రజానీకానికి ఇబ్బందులు కలిగించే విధంగా ప్రవర్తించే వ్యక్తులపై కూడా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో కొత్తగూడెం డిఎస్పి ఆదినారాయణ, పాల్వంచ డిఎస్పీ సతీష్ కుమార్, ఇల్లందు డిఎస్పీ వెంకన్న బాబు, ఎస్బి ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, డీసిఆర్బీ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, కొత్తగూడెం 2టౌన్ సీఐ ప్రతాప్, 1టౌన్ సీఐ కరుణాకర్, 3టౌన్ సీఐ ఇంద్రాసేనారెడ్డి, పాల్వంచ సీఐ సతీష్, ఇల్లందు సీఐ సురేష్, చుంచుపల్లి సీఐ వెంకటేశ్వర్లు మరియు ఎస్త్స్రలు, సిబ్బంది పాల్గొన్నారు.