8 May, 2026 | 2:26 AM

డ్రగ్స్ దందాలో సాఫ్ట్ వేర్ ఉద్యోగులు

08-05-2026 01:32 AM

ఎల్బీనగర్, మే 7 : మత్తుకు బానిసగా మారి, సులభంగా అధిక మొత్తంలో డబ్బు సంపాధించాలని సాఫ్ట్ వేర్ ఉద్యోగులు డ్రగ్స్ దందా ప్రారంభించారు. విశ్వసనీయ సమాచారంతో హయత్ నగర్ ఎక్సైజ్ పరిధిలో టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించి, ముగ్గురుని అరెస్టు చేసిన ఘటన గురువారం వెలుగులోకి వచ్చింది. వీరి నుంచి 7.44 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. వివరాల్లోకి వెళ్తే... ఉద్యోగం కోల్పోయిన అంజద్ అనే సాఫ్ట్ వేర్ ఉద్యోగి డ్రగ్స్ వ్యాపారంలోకి దిగాడు.

బెంగళూరులో నుంచి డ్రగ్స్ తెప్పించేందుకు హేమంత్ అనే మరో ఐటీ ఉద్యోగి పెట్టుబడి పెట్టగా, వాటిని హరీశ్ అనే వ్యక్తి కొనుగోలు చేసేందుకు సిద్ధపడ్డాడు. సమాచారం తెలుసుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసుల బృందం వీరిని అదుపులోకి తీసుకున్నారు. బెంగళూరులో తక్కువ ధరకు కొనుగోలు చేసిన ఎండీఎంఏను హైదరాబాద్ లో అధిక ధరలకు విక్రయిస్తూ లాభాలు పొందుతున్నట్లు గుర్తించారు. పట్టుబడిన నిందితులను హయత్ నగర్ ఎక్సైజ్ స్టేషన్ కు తరలించారు. దాడుల్లో ఎస్టీఎఫ్ టీమ్ సీఐ బిక్షారెడ్డి, ఎస్త్స్ర బాలరాజు, సిబ్బంది పాల్గొన్నారు.