7 July, 2026 | 1:41 AM

ప్రత్యామ్నాయ పంటల వైపు మొగ్గు చూపాలి

07-07-2026 12:39 AM

రైతులకు కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ 

బిజినేపల్లి, జూలై 6: వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో రైతులు వరి సాగుకు బదులుగా తక్కువ నీటితో సాగయ్యే జొన్న, చిరుధాన్యాలు, పప్పుధాన్యాలు, నూనెగింజలు, కూరగాయల వంటి ప్రత్యామ్నాయ పంటల వైపు మొగ్గు చూపాలని నాగర్కర్నూల్ జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ సూచించారు. సోమవారం బిజినేపల్లిలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాన్ని ఆకస్మికంగా సందర్శించిన ఆయన యూరియా పంపిణీని పరిశీలించి, బ్లాక్ మార్కెట్కు తావు లేకుండా అర్హులైన రైతులకే పారదర్శకంగా ఎరువులు పంపిణీ చేయాలని అధికారులను ఆదేశించారు.

అనంతరం ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియను పరిశీలించిన కలెక్టర్, అర్హులైన ప్రతి ఒక్కరి పేరు ఓటరు జాబితాలో నమోదు అయ్యేలా చర్యలు తీసుకోవాలని, అనర్హుల పేర్లను నిబంధనల ప్రకారం తొలగించాలని సూచించారు. బీఎల్‌ఓలు ఇంటింటికీ వెళ్లి ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ, స్వీకరణ ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేసి, వివరాలను సకాలంలో ఆన్లైన్లో నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రజల సహకారంతో ఓటరు జాబితా సవరణను పారదర్శకంగా పూర్తి చేయాలని కలెక్టర్ సూచించారు.