7 July, 2026 | 1:41 AM

ఏసీబీకి చిక్కిన చేర్యాల తహసీల్దార్

07-07-2026 12:40 AM
  1. నాలా కన్వర్షన్ కోసం లక్షా 10 వేలు డిమాండ్
  2. ఆఫీస్‌లోనే రూ.70వేలు తీసుకుంటూ పట్టుబడిన అధికారి

చేర్యాల, జులై 6(విజయక్రాంతి): సిద్దిపేట జిల్లా చేర్యాల మండలంలోని నాగపురి రేవన్యు గ్రామానికి చెందిన 30 గుంటల భూమిని నాలా కన్వర్షన్ కోసం రూ.లక్షా 10 వేలు డిమాండ్ చేసిన చేర్యాల తహసీల్దారు దిలీప్ నాయక్‌ను ఏసీబీ అధికారులు సోమవారం రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఏసీబీ మెదక్,సంగారెడ్డి రేంజ్ డీఎస్పీ సుదర్శన్ తెలిపిన వివరాల మేరకు చేర్యాల మండల పరిధిలోని నాగపురి గ్రామానికి చెందిన సర్వే నంబర్లు 833/బీ,833/సీ, 833/డీ,833/ఈ,834/బీ, 834/సీ 834/డీ, 834/ఈ పరిధిలోని మొత్తం 30 గుంట ల భూమికి సంబంధించిన 11 నాలా కన్వర్షన్ దరఖాస్తులలో 8 ప్రాసెస్ చేసి మిగిలిన 3 ప్రక్రియ పూర్తి చేయడానికి లక్షా పదివేల రూపాయలు డిమాండ్ చేయగా రూ 70 వేలు లంచం కోరినట్లు విచారణలో తేలిందని డీఎస్పీ తెలిపారు.

ఫిర్యాదుదారుని సహకారంతో పకడ్బందీ ప్రణాళికతో ఏసీబీ అధికారులు చేర్యాల తహసీల్దార్ కార్యాలయంలోనే రూ.70 వేల లంచం తీసుకుంటున్న సమయంలో దాడి చేసి పట్టుకొని ఆయన వద్ద నుంచి లంచం నగదును స్వాధీన పరుచుకున్నారు.విచారణ పూర్తి అయిన తరువాత తహసీల్దార్‌ను అరెస్టు చేసి హైదరాబాద్లోని ఏసీబీ ప్రత్యేక కోర్టులో హాజరుపరచనున్నట్లు అధికారులు తెలిపారు.కేసు దర్యాప్తు కొనసాగుతోందని ఏసీబీ అధికారులు తెలిపారు.ఈ దాడుల్లో ఏసీబీ సీఐ రమేష్, సీఐ వెంకటేశ్వర్లు సిబ్బంది పాల్గొన్నారు.