పుస్తకాల పేరుతో ప్రైవేట్ స్కూళ్ల దండయాత్ర
ఫీజులు ఒకటి.. పుస్తకాల భారం మరొకటి
ఖమ్మం హెల్త్,(విజయక్రాంతి): ఖమ్మం జిల్లాలో ప్రైవేట్ పాఠశాలల అదనపు వసూళ్లు తల్లిదండ్రులకు భారంగా మారుతున్నాయి. ఫీజులతో పాటు పుస్తకాలు, నోట్‌బుక్లు, యూనిఫాంల పేరుతో వేల రూపాయలు వసూలు చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. పాఠశాలల ప్రాంగణాల్లోనే పుస్తకాల విక్రయాలు జరుపుతూ, బయట కొనకుండా ఒత్తిడి తెస్తున్నారని తల్లిదండ్రులు వాపోతున్నారు. రెండో తరగతి విద్యార్థి పుస్తకాలకే రూ.5 వేల వరకు వసూలు చేస్తున్నారని చెబుతున్నారు.
దీనికి తోడు యూనిఫాం, ఇతర విద్యా సామగ్రి పేరుతో అదనపు భారం మోపుతున్నారని ఆరోపిస్తున్నారు. మార్కెట్‌లో తక్కువ ధరకే లభించే పుస్తకాలను అధిక ధరలకు విక్రయిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. ఈ వ్యవహారంపై తల్లిదండ్రులు, ప్రజా సంఘాలు పలుమార్లు ఫిర్యాదులు చేసినా విద్యాశాఖ అధికారులు పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. నిబంధనలు ఉల్లంఘిస్తున్న పాఠశాలలపై తక్షణ చర్యలు తీసుకుని, పుస్తకాల దోపిడీకి అడ్డుకట్ట వేయాలని జిల్లా ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.






