15-02-2026 01:05:47 AM
* టీ20 ప్రపంచకప్ మొదలవ్వడానికి ముందు చిన్న జట్ల విషయంలో చాలా కామెంట్స్ వినిపించాయి. దాదాపు సగం జట్లు చిన్న దేశాలే కావడంతో టోర్నమెంట్ ఆసక్తిగా ఉండదంటూ చాలా మంది పెదవి విరిచారు. చిన్న జట్లకు ప్రత్యేకంగా మరో వరల్ కప్ పెట్టాలంటూ ఐసీసీకి సలహాలు కూడా ఇచ్చారు. అయితే టోర్నీ మొదలైన తర్వాత వారి అభిప్రాయం మార్చుకోక తప్పలేదు.
ఎందుకంటే చిన్న జట్లు పెద్ద జట్లకు చెమటలు పట్టిస్తున్నాయి. అసలు సిసలు ఆటతీరుతో కంగారు పెడుతున్నాయి. ఇప్పటి వరకూ జరిగిన మ్యాచ్‌లను చూస్తే ఈ విషయం అంగీకరించాల్సిందే. తాము పసికూనలు కాదు కసికూనలు అంటూ నిరూపిస్తున్నాయి.
జింబాబ్వే, నెదర్లాండ్స్, ఐర్లాండ్ , స్కాట్లాండ్, నేపాల్, ఇటలీ ఇలాంటి చిన్న జట్లు తమను తక్కువ అంచనా వేయొద్దని ఆటతోనే వార్నింగ్ ఇస్తున్నాయి. వన్డే ఫార్మాట్ తో పోలిస్తే టీ ట్వంటీల్లో సంచలనాలు నమోదవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. పైగా చిన్న జట్లలో ఎక్కువ మంది యువ ఆటగాళ్లే ఉండడంతో వారి ఫీల్డింగ్ పెద్ద జట్ల కంటే ఖచ్చితంగా మెరుగ్గానే ఉంటుంది. ఇలాంటి అడ్వాండేజ్‌లతోనే పసికూనలు చెలరేగిపోతున్నాయి.
తొలి మ్యాచ్‌లో నెదర్లాండ్స్ పాకిస్థాన్‌కు ఎలాంటి వణుకు పుట్టించిందో అందరికీ తెలుసు. దాదాపు పాక్‌ను ఓడించినంత పనిచేసింది. చివర్లో పాక్ బ్యాటర్ ఫహీమ్ సిక్సర్లతో ఆదుకోకుంటే ఖచ్చితంగా సంచలనం నమోదై ఉండేది. తర్వాత వెస్టిండీస్‌కు కూడా స్కాట్లాండ్ ఊహించని పోటీ ఇచ్చింది. ఇక టీమిండియా తొలి మ్యాచ్‌లో ఏం జరిగిందో అభిమానులు మరిచిపోలేరు. యూఎస్‌ఏపై కేవలం 77 పరుగులకే 6 వికెట్లు చేజార్చుకుని కష్టాల్లో పడింది.
సూర్యకుమార్ యాదవ్ హాఫ్ సెంచరీతో ఆదుకోకుంటే భారత్‌కు పెద్ద షాకే తగిలేది. ఇక రెండుసార్లు వరల్ ఛాంపియన్ గా నిలిచిన ఇంగ్లాండ్‌కు నేపాల్ వణుకు పుట్టించింది. అది కూడా అత్యుత్తమ బౌలర్లు ఉన్న ఇంగ్లాండ్‌పై నేపాల్ బ్యాటర్ల భారీ షాట్లు టోర్నీకే హైలెట్‌గా నిలిచాయి. ముఖ్యంగా ఆర్చర్‌ను నేపాల్ బ్యాటర్లు ఉతికారేసిన తీరు ఎవ్వరూ మరిచిపోలేరు. కాస్త అనుభవ రాహిత్యంతో వెనుకబడిన నేపాల్ ఇంకొంచెం అప్రమత్తంగా ఉండి ఉంటే పెను సంచలనం నమోదై ఉండేది.
ఇక ఇటలీ నేపాల్ జట్టుకు షాకివ్వడం, భారత్ పై నమీబియా కూడా ఆకట్టుకుంది. కీలక సమయంలో వరుస వికెట్లు తీసి టీమిండియాను కాస్త కంగారు పెట్టింది. అన్నింటికంటే ముఖ్యంగా జింబాబ్వే సంచలన ప్రదర్శనతో మెరిసింది. టైటిల్ ఫేవరెట్లలో ఒకటిగా ఉన్న ఆస్ట్రేలియాకు దిమ్మతిరిగే షాకిచ్చింది. ఎవ్వరూ ఊహించని విధంగా అద్భుతమైన ఆటతీరుతో దుమ్మురేపింది. ఏదో గాలివాట విజయంలా ఆసీస్‌ను ఓడించలేదు.
బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ అన్ని విభాగాల్లోనూ కంగారూలకు కంగారు పుట్టించింది. అసలు 8వ ఓవర్ వరకూ జింబాబ్వే వికెట్ కోల్పోలేదంటే ఏ విధంగా ఆడిందో అర్థం చేసుకోవచ్చు. నిజానికి పెద్ద టోర్నీల్లో సంచలనాలు సృష్టించడం జింబాబ్వేకు కొత్త కాదు మరీ ముఖ్యంగా ఆసీస్‌ను ఓడించిన సందర్భాలు గతంలోనూ ఉన్నాయి. ఈ సారి కూడా అదే జోష్‌తో కంగారూలకు జింబాబ్వే జట్టు చెక్ పెట్టింది.
చిన్న జట్లు ఇలా చెలరేగిపోవడానికి పలు కారణాలున్నాయి. దీనిలో మొదటిది ఆ జట్లపై పెద్దగా అంచనాలు లేకపోవడం.. ఫలితంగా ఎలాంటి ఒత్తిడి లేకుండా స్వేచ్ఛగా ఆడుతుంటాయి. ఓడినా పెద్దగా ఇబ్బందులేమీ ఉండవు. అదే గెలిస్తే మాత్రం ఒక్కసారిగా వారి క్రేజ్ పెరుగుతుంది. గత కొంతకాలంగా ఆప్ఘనిస్థాన్ ఇదే స్థాయి నుంచి ఇప్పుడు అత్యుత్తమంగా ఎదిగిన తీరే ఉదాహరణ. గతంలో చిన్న జట్లతో తప్పిస్తే మిగిలిన వాటితో సిరీస్‌లే ఆడని ఆప్ఘనిస్తాన్ ఇప్పుడు ఐసీసీ టోర్నీలకు నేరుగా అర్హత సాధిస్తోంది.
అంతేకాదు టైటిల్ ఫేవరెట్ జట్లకు షాకిస్తోంది. అందుకే ఐసీసీ టోర్నీలు జరిగినప్పుడు ఆప్ఘన్ మ్యాచ్‌లకు ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ కూడా ఉంది. గత ప్రపంచకప్‌లో ఆసీస్‌కు ఆప్ఘన్ ఇచ్చిన షాక్ ఎవ్వరూ మరిచిపోలేరు. అద్భుత ప్రదర్శనతో ఏకంగా సెమీస్‌కు దూసుకొచ్చింది. అటు అసోసియేట్ దేశాల్లో నేపాల్ ఆటతీరు ప్రత్యేకంగా చెప్పుకోవాలి. గతంతో పోలిస్తే అక్కడ క్రికెట్‌కు క్రేజ్ పెరగడం, వారి ఆటతీరు కూడా బాగా మెరుగవ్వడంతో మెగాటోర్నీలో అదరగొడుతోంది. నిజానికి అసోసియేట్ దేశాల ఆటతీరు ప్రతీ ఏడాదీ మెరుగవుతూ వస్తోంది.
అప్పుడప్పుడూ కొన్ని పెద్ద జట్లతో సిరీస్‌లు ఆడుతుండడం దీనికి ఒక కారణంగా చెప్పొచ్చు. ఇప్పుడు జరుగుతున్న టీ20 ప్రపంచకప్‌లో పెద్ద జట్లతో చిన్న జట్ల మ్యాచ్‌లు వన్‌సైడ్‌గా సాగడం లేదు. ఫలితం ఎలా ఉన్నా చివరి వరకూ పోరాడుతుండడంతో అసలు సిసలు మజాను ఫ్యాన్స్ ఆస్వాదిస్తున్నారు. మొత్తం మీద తమను తేలిగ్గా తీసుకోవద్దని చిన్న జట్లు ఆటతోనే వార్నింగ్ ఇస్తున్న వేళ రానున్న మ్యాచ్‌లలో మరికొన్ని సంచలనాలు నమోదైనా ఆశ్చర్యపోనవసరం లేదు.