14-02-2026 08:09:40 PM
జాతర, రథోత్సవాలకు ఏర్పాటు చేసిన నిర్వాహకులు
ఆసిఫాబాద్,(విజయక్రాంతి): కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా వ్యాప్తంగా ఆదివారం జరగనున్న మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రముఖ శివాలయాలు సర్వాంగ సుందరంగా ముస్తాబవుతున్నాయి. శివభక్తులతో జిల్లాలోని ఆలయాలు కిటకిటలాడనున్న నేపథ్యంలో ఆలయ కమిటీలు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు.
జిల్లాలోని ఈస్గాం శివ మల్లన్న ఆలయం, వాంకిడి పురాతన శివాలయం, రెబ్బెన మండలం నంబాల గ్రామంలోని ప్రసన్న పరమేశ్వర శివాలయం, జిల్లా కేంద్రంలోని సందీప్ నగర్ శివాలయం, చిర్రకుంట గ్రామంలోని చిర్రకుంట శివ మల్లన్న ఆలయం, బూర్గుడ గ్రామంలోని శివాలయం, కాగజ్‌నగర్ పరిసర ప్రాంతాల్లోని శివాలయాలు, ఆసిఫాబాద్ మండలం అంకుసాపూర్, పెంచికల్పేట్ మండలం చేడ్వాయి, బెజ్జూర్ మండలం పాపణపేట్, తలయి గ్రామాల్లోని శివాలయాలు శివరాత్రి శోభతో ప్రత్యేకంగా అలంకరించబడుతున్నాయి. ఈ సందర్భంగా ఆయా ఆలయాల్లో శివలింగాలకు ప్రత్యేక అభిషేకాలు, మహా రుద్రాభిషేకం, లింగోద్భవ పూజలు, శివ–పార్వతుల కల్యాణం ఘనంగా నిర్వహించనున్నారు.
శనివారం రాత్రి నుండి ఆదివారం ఉదయం వరకు భజనలు, హరహర మహాదేవ నామస్మరణ, జాగరణ కార్యక్రమాలు చేపట్టేందుకు నిర్వాహకులు ఏర్పాట్లు పూర్తి చేశారు.భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆలయాల వద్ద విద్యుత్ దీపాల అలంకరణ, తాగునీరు, పారిశుధ్యం, భద్రతా ఏర్పాట్లు చేపట్టినట్లు ఆలయ కమిటీలు తెలిపారు. శివరాత్రి పర్వదినాన్ని భక్తిశ్రద్ధలతో జరుపుకునేందుకు జిల్లా అంతటా ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.