గవర్నర్‌గా శివప్రతాప్ శుక్లా ప్రమాణం
- ప్రమాణస్వీకారం చేయించిన హైకోర్టు సీజే ఏకే సింగ్
- తెలుగులో ప్రమాణస్వీకారం చేసిన గవర్నర్
- హాజరైన సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి, స్పీకర్, మండలి చైర్మన్, మంత్రులు
హైదరాబాద్, మార్చి 11 (విజయక్రాంతి): రాష్ట్ర గవర్నర్‌గా శివప్రతాప్ శుక్లా ప్రమాణం చేశారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆపరేష్‌కుమార్ సింగ్ శుక్లాతో బుధవారం ఉదయం 11.30 గంటలకు లోక్‌భవన్‌లో ప్రమాణస్వీకారం చేయించారు. అంతకు ముందు వందేమాతరం, జనగనమన ఆలపించా రు. గవర్నర్‌గా శివప్రతాప్ శుక్లా తెలుగులో ప్రమాణం చేయడం విశేషం.
తెలంగాణ గవర్నర్‌గా నా బాధ్యతలను శ్రద్ధతో నిర్వహిస్తా ను.. రాజ్యాంగం, చట్టాన్ని పరిరక్షిస్తాను, తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం నిరంతరం అంకితభావంతో పని చేస్తానని దైవ సాక్షిగా’ అంటూ ప్రమాణం చేశారు. ఆ తర్వాత సీఎం రేవంత్‌రెడ్డి గవర్నర్‌కు పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్, మంత్రులు శ్రీధర్‌బాబు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, సీతక్క, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు, తుమ్మల నాగేశ్వర్‌రావు, అజారుద్దీన్, దామోదర రాజనర సింహ, వాకిటి శ్రీహరి, మాజీ గవర్నర్ బండా రు దత్తాత్రేయ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాం చందర్‌రావు, సీఎస్ రామకృష్ణారావు, డీజీపీ శివధర్‌రెడ్డి, వివిధ రాజకీయ పార్టీల నాయకులు పాల్గొన్నారు.
రాష్ట, కేంద్ర మంత్రిగా..
ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్ జిల్లా రుద్రాపూర్‌లో 1952 ఏప్రిల్ 1న శివప్రతాప్ శుక్లా జన్మించారు. అదే గ్రామంలో పాఠశాల విద్యను పూర్తి చేసి, గోరఖ్‌పూర్‌లో కాలేజీ విద్యను పూర్తిచేశారు. ఆ తర్వాత న్యాయశాస్త్రంలో డిగ్రీ పొందారు. విద్యార్థిగా ఉన్నప్పుడే ఏబీవీపీ సంస్థాగత కార్యదర్శిగా పనిచేశారు. 1983లో బీజేపీలో చేరారు. నాలుగుసార్లు ఎమ్మెల్యేగా, యూపీ రాష్ట్ర మంత్రిగా సేవలందించారు. 1989లో మొదటిసారి గోరఖ్‌పూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.
తర్వాత 1991లో రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచారు. 1993, 1996 లోనూ ఎన్నికైన శుక్లా.. కళ్యాణ్‌సింగ్, రామ్‌ప్రకాశ్ గుప్తా, రాజ్‌నాథ్‌ల ప్రభుత్వాలలో మంత్రిగా పనిచేశారు. 2016 జూన్ 10న యూపీ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన శుక్లా.. మోదీ ప్రభుత్వంలో కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రిగా పనిచేశారు. ఎనిమిదేళ్లపాటు రాజ్యసభసభ్యుడిగా ఉన్నారు. 2023 ఫిబ్రవరి 18న హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ నియమితులయ్యారు. శుక్లా ప్రస్తుతం తెలంగాణ గవర్నర్‌గా వచ్చారు.




