16 March, 2026 | 2:25 PM

తండాలకు ప్రగతి వెలుగులు నా లక్ష్యం

16-03-2026 01:11 PM

షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్..

షాద్‌నగర్,(విజయక్రాంతి): తండాలలో నిరాడంబరంగా జీవించే గిరిజనుల కోసం, వారి తండాల అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తానని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్(Shadnagar MLA Veerlapally Shankar ) అన్నారు. సోమవారం  ఫరూక్ నగర్ మండలం మొండోని రాయి తండాలో రేషన్ షాప్ ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రేషన్ షాప్ లేకుండా ఇక్కడి ప్రజలు పడుతున్న ఇబ్బందులు గిరిజన నేత సూర్య నాయక్ తన దృష్టికి తేవడం వల్లనే వెంటనే మంజూరు చేశానని వెల్లడించారు. ఈ అవకాశాన్ని గిరిజనులు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.

అదేవిధంగా గిరిజనులు శుభకార్యాలు నిర్వహించుకునేందుకు షాద్ నగర్ పట్టణంలో కమ్యూనిటీ భవనాన్ని నిర్మిస్తున్నట్లు వెల్లడించారు. గిరిజనులకు ఏ కష్టం వచ్చినా  వెంటనే పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. రైతు బిడ్డ ఈరోజు ముఖ్యమంత్రి అయ్యాడని, మీలాంటి ప్రతి ఒక్కరి ఆశీస్సులతో తాను కూడా ఎమ్మెల్యేగా ఉన్నానని, తండాల అభివృద్ధికి అంకితభావంతో పనిచేస్తానని వెల్లడించారు. పార్టీలకు సంబంధించి ఎలాంటి కార్యక్రమాలు జరిగినా, సేవాలాల్ జయంతి లాంటి కార్యక్రమాలు అయినా గిరిజనులతోనే ఆ కార్యక్రమాలకు ప్రత్యేక కళ వస్తుందని అన్నారు. గిరిజన మహిళల సంప్రదాయ దుస్తులు తనకు ఎంతో ఇష్టమని ఆయన అన్నారు.

గతంలో ప్రధానమంత్రి ఇందిరాగాంధీ నడుచుకుంటూ వెళుతున్న గిరిజన మహిళలను కారు ఆపి మరీ పలకరించి వారి కష్టాలు తెలుసుకొని నిరుపేదలకు పక్కా ఇల్లు కట్టి ఇవ్వాలని కార్యక్రమాన్ని ముందుకు తెచ్చారని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి గిరిజన సంక్షేమానికి కట్టుబడి ఉందని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుత ప్రభుత్వం కూడా గత ప్రభుత్వం 10 ఏళ్లలో చేయని కార్యక్రమాలను రెండేళ్లలో చేపట్టిందని అన్నారు. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పులకుప్పగా మార్చినప్పటికీ, సమస్యలు ఉన్నప్పటికీ అభివృద్ధి విషయంలో ఎలాంటి రాజీ లేకుండా పనిచేస్తామని స్పష్టం చేశారు. గిరిజన తండాలను ఆరోజైనా, ఈ రోజైనా పట్టించుకున్నది ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమేనని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు.  ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు బాలరాజ్ గౌడ్, మాజీ ఎంపీపీ బుజ్జి బాబు నాయక్, మాజీ ఎంపీటీసీ తుపాకుల శేఖర్, సర్పంచ్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.