చిన్నారిపై దారుణానికి కఠిన శిక్ష విధించాలి
రజక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు రాంగారి శ్రీధర్
గజ్వేల్,(విజయక్రాంతి): ఖమ్మం జిల్లాలో ఓ 12 ఏళ్ల చిన్నారిపై జరిగిన అమానుష ఘటన సభ్య సమాజం తలదించుకునేలా చేసిందని తెలంగాణ రజక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు రాంగారి శ్రీధర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా నిందితులపై చట్టపరంగా అత్యంత కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని, పోలీసు అధికారులను కోరారు. ఖమ్మం జిల్లా తల్లంపాడు గ్రామానికి చెందిన ఓ దంపతుల 12 ఏళ్ల కుమార్తె వేసవి సెలవుల సందర్భంగా ఖమ్మం నగరంలోని రాపర్తి నగర్‌లో నివసిస్తున్న తన తాత, అమ్మమ్మల వద్దకు వచ్చింది.
అదే అపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్న వ్యక్తి చిన్నారిపై లైంగిక దాడికి పాల్పడి, ఘటనను దాచిపెట్టే ప్రయత్నంలో చిన్నారిని అపార్ట్‌మెంట్ పైభాగం నుంచి కిందకు తోసివేయడంతో ఆమె తీవ్ర గాయాలపాలై ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలిపారు. చిన్నారి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నందున ఆమెకు మెరుగైన వైద్య సేవలు అందించాలని కోరారు. ఈ దారుణ ఘటనకు బాధ్యులైన నిందితుడిపై వేగవంతమైన విచారణ జరిపి కఠిన శిక్ష విధించాలని రాంగారి శ్రీధర్ డిమాండ్ చేశారు. మహిళలు, చిన్నారుల భద్రతకు ప్రభుత్వం మరింత పటిష్ట చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు.






