4 July, 2026 | 2:33 AM

27 వేల ప్రభుత్వ పాఠశాలల కుదింపుపై ఉద్యమిస్తాం

04-07-2026 01:36 AM

పెండింగ్ రూ.7 వేల కోట్ల స్కాలర్షిప్లను విడుదల చేయాలి

ప్రైవేట్ విద్యాసంవిస్థల ఫీజుల దోపిడీని అరికట్టాలి 

జూలై 10న రాష్ట్రవ్యాప్త విద్యాసంస్థల బంద్ను జయప్రదం చేయాలి

వామపక్ష విద్యార్థి సంఘాల నాయకులు 

భద్రాద్రి కొత్తగూడెం, జులై 3 (విజయక్రాంతి): 27వేల ప్రభుత్వ పాఠశాలలను 4వేల క్లస్టర్ ప్రభుత్వ పాఠశాలలుగా కుదింపు చేసే నిర్ణయాన్ని ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని వామపక్ష విద్యార్థి సంఘాల నాయకులు వరక అజిత్, బుర్ర వీరభద్రం, మంద నాగకృష్ణ, దుర్గం ప్రణయ్ డిమాండ్ చేశారు. జూలై 10న నిర్వహించే రాష్ట్రవ్యాప్త విద్యాసంస్థల బంద్ సన్నాహక సమావేశం శుక్రవారం స్థానిక కొత్తగూడెం పట్టణ కేంద్రంలోని శేషగిరి భవన్లో జరిగింది.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభు త్వాలు ప్రభుత్వ విద్యను నిర్వీర్యం చేస్తూ, విద్యను వ్యాపార వస్తువుగా మార్చే విధానాలను అమలు చేస్తున్నాయని మండిపడ్డారు. విద్యారంగానికి బడ్జెట్ను తగ్గించడం వల్ల విద్యార్థుల భవిష్యత్తు ప్రమాదంలో పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థల ఫీజుల దోపిడీని అరికట్టి, పాఠ్యపుస్తకాలు, యూనిఫాంల బలవంతపు అమ్మకాలను నిలిపివేయాలన్నారు.

ఖాళీగా ఉన్న అన్ని ఉపాధ్యాయ, అధ్యాపక పోస్టులను వెంటనే భర్తీ చేయాలని, రాష్ట్రంలో నూతన జాతీయ విద్యా విధానం అమలు చేయబోమని అసెంబ్లీలో తీర్మానం చేయాలని కోరారు. మధ్యాహ్న భోజన పథకానికి సరిపడా నిధులు కేటాయించాలని, ఇంటర్ విద్యార్థులకు కూడా మధ్యాహ్న భోజనం, బ్రేక్ ఫాస్ట్ అందించాలని డిమాండ్ చేశారు. విద్యాహక్కును పరిరక్షించుకోవడానికి జూలై 10న నిర్వహించే రాష్ట్రవ్యాప్త విద్యాసంస్థల బంద్ను విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, ప్రజాసంఘాలు విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. పిడిఎస్యూ కొత్తగూడెం పట్ట ణ నాయకులు హర్ష వర్ధన్, సాగర్, నవీన్, ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు ప్రేమ్ కుమార్, దిలీప్ కుమార్, విద్యాసాగర్, ఏఐఎస్‌ఎఫ్ నాయకులు సృజన్, వినయ్ పాల్గొన్నారు.