1 June, 2026 | 10:01 PM

ఇందిరమ్మ ఇండ్లను ప్రారంభించిన సర్పంచ్ పగడాల రమాదేవి

01-06-2026 08:55 PM

ఎస్సీ, ఎస్టీ వర్గాల ఇళ్లకు కొత్త విద్యుత్ కనెక్షన్లు జుగా స్కీమ్ క్రింద ఉచితం

దమ్మపేట,(విజయక్రాంతి): తెలంగాణ ప్రభుత్వం జూన్ 1వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభం చేస్తున్న తరుణంలో సోమవారం సాయంత్రం సర్పంచ్ అధ్వర్యంలో దమ్మపేటలో సర్పంచ్ పగడాల రమాదేవి రాంబాబు ఇందిరమ్మ ఇండ్లను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ పగడాల రమాదేవి రాంబాబు, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కక్కిరాల రమేష్, పట్టణ అధ్యక్షుడు చిన్నశెట్టి చిట్టిబాబు లకు మిఠాయిలు తినిపించి, శాలువాలతో సత్కరించారు.

ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నియోజక వర్గ నాయకులు చిన్నశెట్టి యుగంధర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో సొంతిల్లు లేని పేదలు, భూమి లేని నిరుపేదలు, నిరాశ్రయులైన కుటుంబాలకు శాశ్వత గృహాలను నిర్మించుకునేందుకు దశలవారీగా పూర్తి సబ్సిడీతో రూ. 5 లక్షలు ఆర్థిక సహాయం అందించి నిరుపేదల సొంతింటి కలను సాకారం చేస్తున్నందుకు తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డికి, అశ్వారావుపేట శాసనసభ్యులు ఎమ్మెల్యే జారె ఆదినారాయణ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

తదనంతరం మల్లారం గ్రామ శివారులో కొన్నేళ్లుగా కరెంట్ లేకుండా నివాసం ఉంటున్న సుమారు 60 కుటుంబాలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ లైన్‌కు 1 కిలోమీటర్‌ లోపు కొత్త విద్యుత్ కనెక్షన్ తీసుకునే గృహ వినియోగదారులకు ప్రభుత్వం దూరం ఆధారిత ఛార్జీలను రద్దు చేసి, నేరుగా సామర్థ్యం లోడ్ ఆధారిత ఫిక్స్‌డ్ ఛార్జీలను అందుబాటులోకి తెచ్చిన సందర్భంగా దమ్మపేట ఏ.ఇ సాయి కిరణ్ మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ వర్గాల ప్రజలకు కొత్త విద్యుత్ కనెక్షన్లు పొందేందుకు తెలంగాణ ప్రభుత్వం భారీ రాయితీలను, తక్కువ సామర్థ్యపు కనెక్షన్లకు ప్రత్యేక వెసులుబాట్లను కల్పిస్తుందని త్వరలోనే యల్.టి లైన్ లాగి, ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేసి కరెంట్ కనెక్షన్ ఇస్తామని దానికి గాను ఆధార్, కులం సర్టిఫికెట్, పంచాయతీ తరపున నివాస ధృవీకరణ సర్టిఫికెట్ ఇవ్వాల్సి ఉంటుందని తెలిపారు. దమ్మపేట మండల కేంద్రంలో విద్యుత్ లో ఓల్టేజ్ సమస్య ఉన్నదని, దాన్ని పునరుద్ధరించడానికి మూడు కొత్త ట్రాన్స్ఫార్మర్ లను ఏర్పాటు చేస్తున్నామన్నారు.