బెలవాడి మల్లమ్మగా..
కన్నడ స్టార్ రిషబ్ శెట్టి ప్రధాన పాత్రలో నటిస్తున్న ప్రతిష్టాత్మక పాన్-ఇండియా మూవీ ‘ది ప్రైడ్ ఆఫ్ భారత్: ఛత్రపతి శివాజీ మహారాజ్’. మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ జీవిత చరిత్ర ఆధారంగా రాబోతున్న ఈ చిత్రాన్ని సందీప్ సింగ్ ఎంతో ప్రతిష్టాత్మకంగా రెండు భాగాలుగా తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నారు.
లెజెండ్ స్టూడియోస్, ఇమ్మరో బ్యానర్‌పై ఈ మూవీని సందీప్ సింగ్ నిర్మిస్తున్నారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ పాత్రలో రిషబ్ శెట్టి నటిస్తుండగా.. అర్జున్ రాంపాల్, వివేక్ ఒబెరాయ్ కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు. అయితే, ఈ భారీ చిత్రంలో బాలీవుడ్ నటి భూమి పెడ్నేకర్ కీలక పాత్రలో నటిస్తోంది. ఈ మేరకు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. భూమి పెడ్నేకర్ ఇందులో.. ధైర్యసాహసాలకు మారుపేరైన వీరనారి ‘బెలవాడి మల్లమ్మ’ పాత్రను పోషించనున్నట్టు వెల్లడించింది.
ఇక ఈ చిత్రంలో భాగమవ్వడంపై భూమి పెడ్నేకర్ సంతోషం వ్యక్తం చేస్తూ.. “గొప్ప మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ జీవిత ఆధారంగా రూపుదిద్దుకుంటున్న ఈ భారీ సినిమాలో భాగం కావడం నాకు దక్కిన గౌరవం. కర్ణాటకకు చెందిన వీరనారి బెలవాడి మల్లమ్మ పాత్రను తెరపై పోషించే అవకాశం రావడం అదృష్టం. నేను ‘కాంతార’ సినిమాకు పెద్ద ఫ్యాన్స్.. అందులో రిషబ్ శెట్టి నటన నన్ను ఎంతగానో ఆకట్టుకుంది. అందుకే దర్శకుడు సందీప్ కథ చెప్పిన వెంటనే ఆ పాత్రకు ఓకే చెప్పేశా. ఇప్పటివరకు నేను చేసిన పాత్రలకు ఇది పూర్తిగా భిన్నమైనది. ఇందులో నన్ను ఒక కొత్త కోణంలో చూపించబోతున్నందుకు మేకర్స్‌కు కృతజ్ఞతలు” అని చెప్పుకొచ్చింది.






