31 July, 2026 | 2:24 AM

ఇంధన భద్రతకు ప్రాధాన్యం

31-07-2026 01:29 AM

చమురు శుద్ధికేంద్రాలు నిలిచిపోకుండా చూడాలి

యాసంగిలో ఎరువుల కొరత ఉండొద్దు

ప్రధాని నరేంద్ర మోదీ

సీసీఎస్ సమావేశంలో ఆదేశాలు

న్యూఢిల్లీ, జూలై ౩౦: పశ్చిమాసియాలో క్రమక్రమంగా ఉద్రిక్తతలు పెరుగుతున్నందున దేశ అవసరాలకు తగినట్టు ఇంధనం సేకరించాలని, ఇంధన భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని ప్రధాని నరేంద్ర మోదీ ఆదేశించారు. ఢిల్లీ పార్లమెంట్‌లోని ప్రధాని కార్యాలయంలో గురువారం నిర్వహించిన కేంద్ర మంత్రివర్గ భద్రతా కమిటీ (సీసీఎస్) అత్యున్నత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. హోర్ముజ్ నుంచి నౌకాయానం కష్టతరమైనప్పటికీ, ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ఇంధనం సేకరించాలని సూచించారు.

దేశీయంగా చమురు శుద్ధి కర్మాగారాల్లో ఉత్పత్తి నిలిచిపోకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అనంతరం కేబినెట్ కార్యదర్శి టి.వి. సోమనాథన్ దేశ ఇంధన భద్రతకు తీసుకుంటున్న చర్యలను వివరించారు. తర్వాత యాసంగిలో రైతాంగానికి ఎరువుల కొరత లేకుండా చూడాలని ప్రధాని సూచించారు. అలాగే, పశ్చిమాసియాలో భారత నావికుల భద్రతపైనా ప్రధాని చర్చించారు. ఒమన్ జలాల్లో చిక్కుకున్న లేదా విధులు నిర్వర్తిస్తున్న నావికులకు, వారి కుటుంబాలకు తక్షణ సమాచారం, అత్యవసర సాయం అందించేందుకు ప్రత్యేకమైన వ్యవస్థ ఏర్పాటు చేయాలని ప్రధాని సూచించారు. విదేశాంగ, నౌకాయాన మంత్రిత్వ శాఖలు నిరంతరం సమన్వయంతో వ్యవహరిస్తూ పర్యవేక్షించాలని ఆదేశించారు.

బాహ్య సంక్షోభాల వల్ల ఉత్పన్నమయ్యే ఇబ్బందులను అధిగమించేందుకు సౌర శక్తి సహా ఇతర పునరుత్పాదక ఇంధన వనరుల ఉత్పత్తిని వేగవంతం చేసి, ఇంధన స్వయంసమృద్ధి దిశగా అడుగులు వేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా, రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్, ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పాల్గొన్నారు.

70 శాతం పులులు భారత్‌లోనే

దేశ సహజ వనరులను, జీవవైవిధ్యాన్ని కాపాడటంలో పులుల సంరక్షణ కీలకపాత్ర పోషిస్తోందని, ఇది పర్యావరణ వ్యవస్థ, మన ఉమ్మడి భవిష్యత్తుతో ముడిపడి ఉందని ప్రధాని నరేంద్రమోదీ స్పష్టం చేశారు. గురువారం ఈ మేరకు ఆయన ‘ఎక్స్’ ద్వారా స్పందించారు. ప్రపంచంలో పులుల సంఖ్యలో 70 శాతం భారత్‌లో ఉండటం దేశానికి, ప్రతీ ఒక్కరికీ గర్వకారణమన్నారు. అంతర్జాతీయ పులుల దినోత్సవం 2026 సందర్భంగా పులుల సంరక్షణపై దేశ ప్రజలు, వన్యప్రాణి ప్రేమికులకు శుభాకాంక్షలు తెలిపారు.

ప్రపంచ పులుల సంరక్షణలో భారత్ కీలక పాత్ర పోషిస్తుందన్నారు. వన్యప్రాణుల మధ్య ఘర్షణలు తగ్గించేందుకు మనదేశం నిరంతరం సాగిస్తున్న కృషి తీరు అభినందనీయమన్నారు. ఓ వైపు దేశ సుస్థిర అభివృద్ధిని ప్రోత్సహిస్తూనే, ప్రభుత్వం పులుల శాస్త్రీయ పరిరక్షణపై దృష్టి సారించిందన్నారు.

వన్యప్రాణుల సంరక్షణలో అటవీశాఖ సిబ్బంది, శాస్త్రవేత్తలు అంకితభావంతో చేస్తున్న కృషిని కొనియాడారు. పులుల సంఖ్య వేగంగా క్షీణిస్తుండడంతో వాటి సంఖ్యను ఇనుమడింప చేయాలనే సంకల్పంతో ప్రపంచదేశాలు 2010లో రష్యాలోని సెయింట్ పీటర్స్ బర్గ్‌లో టైగర్ సమ్మిట్ స్థాపించారు. ఇందులో 13దేశాలు పులుల సంఖ్యను 2022 వరకు రెట్టింపు చేయాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారు. 2010 నాటికి ప్రపంచవ్యాప్తంగా 3,200 పులులు మాత్రమే ఉండగా, ఇటీవలి అంచనాల ప్రకారం వాటి సంఖ్య 5,711కు పెరిగింది. అత్యధికంగా భారత్‌లోనే 3,682 పులులు (70శాతం) ఉండటం విశేషం.