పచ్చని చెట్లు.. ప్రగతికి మెట్లు
- దుద్దెడలో మొక్కలు నాటిన సర్పంచ్ మిద్దె శివకుమార్
కొండపాక,(విజయక్రాంతి): పచ్చని చెట్లు ప్రగతికి మెట్లని, పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యతని దుద్దెడ గ్రామ సర్పంచ్ మిద్దె శివకుమార్ అన్నారు. దుద్దెడలో పార్వతీ పరమేశ్వర ప్రొప్రైటర్ ఇరువాల కాంతారావు ఆధ్వర్యంలో నిర్వహించిన మొక్కలు నాటే కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మొక్కలు నాటారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. విరివిగా మొక్కలు నాటి వాటిని సంరక్షించడం ద్వారా పర్యావరణ సమతుల్యతను కాపాడుకోవచ్చన్నారు.
పచ్చదనం పెరిగితే వాతావరణ మార్పుల ప్రభావం తగ్గడంతో పాటు వర్షపాతం సమృద్ధిగా ఉండేందుకు దోహదపడుతుందని తెలిపారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటి సంరక్షణ బాధ్యత తీసుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ఇరువాల కాంతారావును అభినందించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షుడు పంజ అఖిల్, పల్లె యాదగిరి, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.






