24 August, 2026 | 9:51 PM

మల్లారెడ్డి మృతి రైతాంగ ఉద్యమాలకు తీరని లోటు

24-08-2026 06:23 PM

ఆసిఫాబాద్ (విజయక్రాంతి): సీపీఎం రాష్ట్ర సీనియర్ నాయకులు, ఆల్ ఇండియా కిసాన్ సభ జాతీయ మాజీ ఉపాధ్యక్షులు కామ్రేడ్ సారంపల్లి మల్లారెడ్డి మృతి రైతాంగ ఉద్యమాలకు, వ్యవసాయ రంగానికి, సీపీఎం పార్టీకి తీరని లోటని సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కోట శ్రీనివాస్, దుర్గం దినకర్ అన్నారు. సోమవారం పార్టీ కార్యాలయంలో మల్లారెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... వ్యవసాయ రంగం, ప్రాజెక్టులు, భూ సంస్కరణలపై మల్లారెడ్డికి అపారమైన అవగాహన ఉందన్నారు. ఉమ్మడి వరంగల్, ఆదిలాబాద్ జిల్లాల్లో కమ్యూనిస్టు ఉద్యమ విస్తరణకు ఆయన కృషి చేశారని గుర్తుచేశారు. తుమ్మిడిహెట్టి వద్ద ప్రాణహిత ప్రాజెక్టు నిర్మాణానికి ఆయన కృషి చేశారని తెలిపారు.

కుమురం భీం, వట్టివాగు, జగన్నాథ్‌పూర్ ప్రాజెక్టులను సందర్శించి ప్రభుత్వానికి పలు సూచనలు చేశారని పేర్కొన్నారు. మల్లారెడ్డి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు అశోక్, దుర్గం నిఖిల్, రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు జాడి తిరుపతి, తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం మండల నాయకుడు కనక సోము తదితరులు పాల్గొన్నారు.