ప్రజలకు న్యాయం అందించడం పోలీస్ శాఖ ప్రధాన బాధ్యత
ప్రజాదివాస్ కు 15 ఫిర్యాదులు
భూపాలపల్లి టౌన్,(విజయక్రాంతి): ప్రజలకు న్యాయం అందించడం పోలీస్ శాఖ ప్రధాన బాధ్యత అని జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ అన్నారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజాదివాస్ కార్యక్రమంలో ఎస్పీ జిల్లా నలుమూలల నుంచి వచ్చిన 15 ఫిర్యాదులను స్వీకరించి పరిశీలించారు. భూ వివాదాలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక మోసాలు, ఇతర పోలీస్ సంబంధిత అంశాలపై వచ్చిన ప్రతి వినతిని ఎస్పీ ఓర్పుగా విని సంబంధిత పోలీస్ అధికారులతో నేరుగా ఫోన్‌లో మాట్లాడి తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రతి ఫిర్యాదును చట్టబద్ధంగా, పారదర్శకంగా విచారించి బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రజల సమస్యల పరిష్కారానికి పోలీస్ శాఖ ఎల్లప్పుడు అందుబాటులో ఉంటుందని ఎస్పీ పేర్కొన్నారు.






