24 August, 2026 | 8:11 PM

సామాజిక చైతన్యాన్ని పెంపొందించే సాంస్కృతిక నాటకోత్సవాలు

24-08-2026 06:21 PM

ఇల్లెందు, (విజయక్రాంతి): సామాజిక చైతన్యాన్ని పెంపొందించే ఉద్దేశంతో సింగరేణి ఇల్లందు ఏరియాలో నాలుగు రోజులపాటు సాంస్కృతిక నాటకోత్సవాలను నిర్వహించనున్నట్లు సింగరేణి ఇల్లందు ఏరియా జనరల్ మేనేజర్ వి. కృష్ణయ్య తెలిపారు. సోమవారం జనరల్ మేనేజర్ కార్యాలయంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో నాటకోత్సవాల వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా జి.ఎం. మాట్లాడుతూ.. ఆగస్టు 27 నుంచి 30వ తేదీ వరకు ప్రతిరోజూ సాయంత్రం 6:30 గంటల నుంచి రాత్రి 8:00 గంటల వరకు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.

ఆగస్టు 27న టేకులపల్లి సింగరేణి కాలనీలోని సి.ఇ.ఆర్. క్లబ్‌లో డా. బి.ఆర్. అంబేద్కర్ జీవిత చరిత్ర ఆధారంగా “సంఘం శరణం గచ్చామి” నాటకాన్ని ప్రదర్శించనున్నారు. ఆగస్టు 28న మహాత్మా జ్యోతిరావు పూలే జీవిత చరిత్ర ఆధారంగా “సత్యశోధన” నాటకాన్ని ప్రదర్శించనున్నారు. ఆగస్టు 29న ఇల్లందు జే.కే. కాలనీలోని సి.ఇ.ఆర్. క్లబ్‌లో “సంఘం శరణం గచ్చామి”, ఆగస్టు 30న ఇల్లందు ఓల్డ్ కాలనీలోని కమ్యూనిటీ హాల్‌లో “సత్యశోధన” నాటకాలను ప్రదర్శించనున్నట్లు తెలిపారు.

ఈ నాటకాల ద్వారా సామాజిక సమానత్వం, విద్య, హక్కులు, సామాజిక చైతన్యం వంటి అంశాలపై ప్రజల్లో అవగాహన కల్పించనున్నట్లు జి.ఎం. పేర్కొన్నారు. ఈ సాంస్కృతిక కార్యక్రమాలకు అధికారులు, ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు, సింగరేణి పాఠశాలల ఉపాధ్యాయులు, విద్యార్థులు, పట్టణ ప్రజలు అధిక సంఖ్యలో హాజరై కార్యక్రమాలను విజయవంతం చేయాలని జనరల్ మేనేజర్ వి. కృష్ణయ్య కోరారు.