16 March, 2026 | 3:15 AM

మున్నేటి ఇసుక డంపులు!

16-03-2026 12:00 AM

వందల కొద్ది లోడ్ల తవ్వకాలు

ఏటిని జల్లెడ పడుతున్న అక్రమార్కులు 

లక్షలకొద్ది డబ్బులు అధికార పార్టీ కిందిస్థాయి నాయకులు జేబుల్లోనికి 

నిద్రమబ్బులో అధికారుల యంత్రాంగం

ఖమ్మం, మార్చి 15 (విజయక్రాంతి): మున్నేటిని ఇసుక అక్రమార్కులు జల్లెడ పడుతున్నారు. పదుల కొద్ది ట్రాక్టర్లతో ఇసుకను తరలిస్తున్నారు. తెల్లవారుజామున మొదలయ్యే ఈ ప్రక్రియ సాయంత్రం వరకు సాగుతోంది. రోజంతా ఏటిని తవ్వుతూ వందల లోడ్ల ఇసుకను డంప్ చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు.

ఈ సొమ్మంతా అధికార పార్టీ కిందిస్థాయి నాయకుల జేబుల్లోకి వెళ్తున్నాయన్న విమర్శలున్నాయి. ప్రకాష్ నగర్ చెక్ డ్యాము, సుందరయ్య నగర్ శివారు మధ్య సమీపంలో సాగుతున్న ఈ వ్యవహారం బహిరంగ రహస్యమే. అయినా అధికారుల కంటికి కనిపించడం లేదు. అధికారులు ఇప్పటికైనా మొద్దు నిద్ర వీడి అక్రమార్కుల భరతం పడితే బాగుంటుందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

తెల్లవారుజాము నుంచే..

ప్రకాష్ నగర్ చెక్ డాం సమీపంలో ప్రస్తుతం రిటైనింగ్ వాల్ పనులు నడుస్తున్నాయి. ఓ వైపు అధికార యంత్రాంగం తమ పని తాము, చేసుకు పోతుంటే.. అక్రమార్కులు మరో వైపు తమదైన శైలిలో ఇసుకను తోడేస్తున్నారు. సుందరయ్య నగర్ శివారులో ఓ ప్రైవేట్ వెంచర్ చివర నుంచి ఏటి మధ్యలోనికి ట్రాక్టర్ దారి చేశారు. ఈ దారి గుండా నిత్యం ట్రాక్టర్లతో ఇసుకను తరలిస్తున్నారు. ఇలా తరలించిన మట్టిని ఆ ప్రైవేట్ వెంచర్ లోని ఖాళీ స్థలం ఎక్కడ కనిపిస్తే అక్కడ డంపు చేస్తున్నారు. ప్రస్తుతం దాదాపు 200 ట్రాక్టర్ల లోడ్ ఇసుకను డంపు చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అధికార పార్టీ అందిస్తున్న ‘డబుల్ బెడ్ రూమ్’ ఇళ్ల పథకం వల్ల ఇక్కడ ఓ చిన్న సైజు కాలనీలాగా తయారైంది.

ప్రజలకొద్దీ ఇళ్ల నిర్మాణాలకు ఊపందుకున్నాయి. ఇక ఈ కాలనీలకు రోడ్లు కూడా మంజూరు అయ్యే పరిస్థితి ఉంది. ఇసుక అవసరం అటు ఇళ్ల లబ్ధిదారులకు, ఇటు రోడ్డు నిర్మాణానికి ఉపయోగపడనుంది. వీటిని అవకాశంగా మలుచుకున్న అక్రమార్కులు ఇసుకను తోడి అమ్ముకునే పనిలో పడ్డారన్న అభిప్రాయం వినిపిస్తోంది. ఇలా చేయాలి అంటే కాస్త కూసో రాజకీయ పలుకుబడి ఉండాలి. ఈ లెక్కన ఈ ఇసుక అక్రమ తవ్వకాల వెనుక కచ్చితంగా అధికార పార్టీ కింది స్థాయి నాయకుల హస్తం ఉందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

అధికారులు నిద్ర నటిస్తున్నారా..?

ప్రకాష్ నగర్ చెక్ డాం సమీపంలో మున్నేటి రిటైనింగ్ పనులు ఉధృతంగా నడుస్తున్నాయి. వీటిని పర్యవేక్షించేందుకు అధికారులు ఉండి తీరాలి. పనులు నడుస్తున్నా, ఇసుక డంప్ భారీగా పొగుపడింది. దీంతో అధికారుల వ్యవహార శైలి పై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రిటైనింగ్ వాల్ పనులు అధికారుల పర్యవేక్షణ లేకుండానే సాగుతోందా? లేక అధికారులు ఉన్నా అక్రమ ఇసుక రవాణా సాగుతోందా? అలా జరుగుతుంటే అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదు? అనే ప్రశ్నలు వ్యక్తం అవుతున్నాయి.

ఇసుక అక్రమ రవాణా డంపు వ్యవహారం కార్పోరేటర్ స్థాయి నాయకురాలి భర్త కనుసనల్లో జరుగుతోందని, ఆయనకు అధికారులకు మధ్య లావాదేవీలు భారీగానే జరుగుతుండడంతో అధికారులు అటువైపు కనీసం కన్నెత్తి చూడకుండా, మొద్దు నిద్ర నటిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికైనా ఉన్నత స్థాయి అధికారులు ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకొని ఇసుక అక్రమ రవాణాను నిలిపివేయాలని, మున్నేటిని ఇసుక తోడకాల నుంచి కాపాడాలని స్థానికులు కోరుతున్నారు.