8 April, 2026 | 1:57 AM

రెండు విడతల్లో జనగణన!

08-04-2026 12:01 AM
  1. స్వరాష్ట్రంలో తొలిసారిగా..
  2. డిజిటల్ విధానంలో సర్వే
  3. సిబ్బందికి ప్రత్యేక శిక్షణ
  4. సెల్ఫ్ ఎన్యూమరేషన్కు అవకాశం

నారాయణఖేడ్, ఏప్రిల్ 7: ప్రణాళికల రూపకల్పన, సంక్షేమ పథకాల అమలులో కీలకమైన జనగణన నిర్వహణకు కేంద్ర ప్రభుత్వం సంకల్పించింది. రెండు విడతల్లో ఈ ప్రక్రియ చేపట్టేలా ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు జిల్లా యంత్రాంగం సన్నద్ధమవుతుంది. తొలిసారిగా డిజిటల్ విధానంలో చేపడుతున్న సర్వేకు కసరత్తు ముమ్మరం చేసింది. తొలి విడతలో భాగంగా మే 11 నుంచి జూన్ 9 వరకు ఇండ్ల గుర్తింపు జాబితా సిద్ధం చేయనున్నారు.

వచ్చే ఏడాది ఫిబ్రవరిలో రెండో దశలో జనగణన చేపట్టనున్నారు. సర్వే ప్రక్రియలో పాల్గొనే అధికారులు, సిబ్బందికి దశల వారీగా శిక్షణ ఇస్తున్నారు. చార్జీ అధికారులైన తహసీల్దార్లు, డిప్యూటీ తహసీల్దార్లు, మున్సిపల్ కమిషనర్లకు, మ్యాపుల తయారీకి సంబంధించిన టెక్నికల్ అసిస్టెంట్లకు ఇప్పటికే శిక్షణ పూర్తికాగా, ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్లకు శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

800 మందికి ఒక ఎన్యూమరేటర్...

సంగారెడ్డి జిల్లాలో 11 మున్సిపాలిటీతో పాటు 647 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. వీటి పరిధిలోని ఇళ్లను గుర్తించేందుకు ఎన్యూమరే టర్లు, సూపర్వైజర్లు విధులు నిర్వహించనున్నారు. 800 ఇళ్లకు ఒకరు చొప్పున సుమారు 1300 పైచిలుకు మంది ఎన్యూమ రేట్లరను, అలాగే ఆరుగురు ఎన్యూమరేటర్లకు ఒక సూపర్వైజర్ చొప్పున  నియమించారు. అదనపు సిబ్బందితో కలిపి సుమారుగా 1600 మందిని అందుబాటులో ఉంచినట్లు సమాచారం.

వీరికి ఈ నెల 18 నుంచి మే 5 వరకు మండలాల వారీగా ఫీల్ ట్రైనర్లు శిక్షణ ఇవ్వనున్నారు. అనంతరం వీరంతా క్షేత్రస్థాయిలో ఇళ్ల జాబితాను, కుటుంబాల సమాచారాన్ని సేకరించి ప్రత్యేక యాప్ హెచ్‌ఎల్వో నమోదు చేయనున్నారు. కాగా ఈ ప్రక్రియలో కీలకపాత్ర పోషించనున్న చార్జీ ఆఫీసర్, తహసీల్దార్లకు గత నెల 12, 13, 14 తేదీల్లో మూడు రోజుల పాటు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. మ్యాపుల తయారీకి సంబంధించి టెక్ని కల్ ఆసిస్టెంట్లకు గత నెల 20 నుంచి మూడు రోజుల పాటు శిక్షణ అందించారు. 28, 29, 30 తేదీల్లో ఫీల్ ట్రైనర్లకు శిక్షణ పూర్తి చేశారు.

మే 11 నుంచి తొలిదశ..

జనగణన తొలిదశలో భాగంగా వచ్చే మే 11నుంచి జూన్ 9 వరకు ఎన్యూమరేటర్లు గ్రామాలు, వార్డుల్లో క్షేత్రస్థాయికి వెళ్లనున్నారు. వాటి పరిధిలో ఎన్ని గృహాలు ఉన్నాయో గుర్తించి, ప్రాంతాల వారీగా పటాలను రూపొందించనున్నారు. స్వరాష్ట్రంలో తొలిసారిగా నిర్వహించనున్న జనగణనకు శాటిలైట్ అనుసంధానంతో రూపొందించిన సాంకేతికత వినియోగిస్తున్నారు. స్మార్ట్ ఫోన్లో డౌన్లోడ్ చేసుకున్న హెచ్‌ఎల్వో యాప్లో సమాచారం నిక్షిప్తం చేయనున్నారు. ప్రజలు ఈ యాప్ ద్వారా లాగిన్ అయి కేంద్రం నిర్దేశించిన 33 అంశాలతో స్వయంగా వివరాలు నమోదు చేసుకునే అవకాశాన్ని కేంద్రం కల్పించింది. ఈ అంశాలను ఎన్యూమరేటర్లు తిరిగి పరిశీలిస్తారు. 2027 ఫిబ్రవరి నుంచి రెండో దశలో జనగణన సర్వే చేపట్టనున్నారు.