31 August, 2026 | 2:00 AM

ప్రజల చేతికే పాలన

31-08-2026 12:51 AM
  1. వెయ్యి రోజుల్లో స్పష్టమైన మార్పు
  2. బీఆర్‌ఎస్ కుటుంబ పాలనకు ముగింపు
  3. ప్రజాస్వామ్యం పునరుద్ధరణ
  4. మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి    

హైదరాబాద్, ఆగస్టు 30 (విజయక్రాంతి): ‘తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజులు పూర్తి చేసుకోవడం రాష్ట్ర రాజకీయ చరిత్రలో మైలురాయి. ఈ వెయ్యి రోజుల్లో కేవలం ప్రభుత్వమే మారలేదు. పాలనా విధానం మారింది.  ప్రజాపాలన తీసుకువచ్చాం. ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించాం’ అని నీటి పారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్‌కుమార్ రెడ్డి పేర్కొన్నారు. పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో ఒక వ్యక్తి, కుటుంబం చేతుల్లోనే అధికారం కేంద్రీకృతమైందని..

మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, ప్రతిపక్షాలు, సామాన్యుల గొంతుకకు విలువ లేకుండా పోయిందని మంత్రి విమర్శించారు. సచివాలయాన్ని ప్రజలకు దూరం చేసి, ప్ర శ్నించే వారిని శత్రువులుగా చూసిన పరిస్థితులు ఉండేవన్నారు.

ప్రస్తుతం ప్రభుత్వం ప్రజలకు అందుబాటులో ఉందని, మంత్రులు ప్రజల మధ్యకు వెళ్తున్నారని తెలిపారు. శాసనసభలో ప్రజా సమస్యలపై చర్చలు జరుగుతున్నాయని, ప్రజావాణి, గ్రామసభలు, ప్రత్యక్ష ప్ర జా సంప్రదింపుల ద్వా రా పాలనను ప్రజల ముంగిటకు తీసుకొచ్చామని మంత్రి తెలిపారు. రాష్ట్రంలోని ప్రతి వర్గానికి ప్రభుత్వం అండగా ఉంటుందని, సంక్షేమం, అభివృద్ధికి సమ ప్రాధాన్యమి స్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు. 

కాంగ్రెస్ విజయాలను చెరిపివేయలేరు

గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం మిగిల్చిన భారీ అప్పు లు, బడ్జెట్ వెలుపలి రుణాలు, పెండింగ్ బకాయిలు, అసంపూర్తి ప్రాజెక్టులతో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ తీవ్ర ఒత్తిడిలో ఉందని మంత్రి తెలిపారు. భారీ రుణాలు, వడ్డీలు చెల్లిస్తూనే సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను కొనసాగిస్తున్నామని,పెట్టుబడులను పెంచుతున్నామని చెప్పారు. బీఆర్‌ఎస్‌కు ఆందోళనలు చేసే స్వేచ్ఛ ఉందని, ఆ స్వేచ్ఛే తెలంగాణలో ప్రజాస్వామ్యం తిరిగి వచ్చిందనడానికి నిదర్శనమన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ వెయ్యి రోజుల విజయాలను మాత్రం బీఆర్‌ఎస్ చెరిపివేయలేదని ధీమా వ్యక్తం చేశారు.