31 August, 2026 | 12:57 AM

బిరబిరా కృష్ణమ్మ.. పరుగులు

31-08-2026 12:00 AM
  1. పాలేరు జలాశయానికి చేరుకుంటున్న సాగర్ వాటర్
  2. తాగునీటి కోసం వినియోగిస్తాం : ఎన్‌ఎస్పీ సీఈ వెంకటేశ్వర్లు

కూసుమంచి, ఆగస్టు 30  (విజయ క్రాంతి): కష్టకాలంలో రైతులకు కంటితు డుపు లాంటి వార్త.. బిరబిరా కృష్ణమ్మ పరుగులీడుతుంటే అన్నట్లుగా.. నాగార్జున సాగర్ నుంచి పాలేరు జలాశయం కు కృష్ణా వాటర్ పరుగులు పెడుతూ వచ్చేస్తున్నాయి.. గత రెండు రోజుల క్రితం నాగార్జున సాగర్ (Nagarjuna Sagar) ఎడమ కాలువ నుంచి కృష్ణమ్మ నీటిని అధికారులు విడుదల చేశారు. ఆ నీరు శనివారం అర్థరాత్రి ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలోని పాలేరు జలాశయం కు చేరుకున్నాయి.

సాగర్ నుంచి 3500క్యూసెక్కుల నీటిని ఎడమకాలువకు విడుదల చేస్తున్నారు. దీంతో పాలేరు జలాశయం నీటిమట్టం గంట గంటకు పెరుగుతుంది. 23అడుగుల పూర్తి స్థాయి నీటిమట్టంకు గాను శనివారం రాత్రి వరకు 15అడుగుల వద్ద నీటిమట్టం ఉంది. ఆదివారం ఉదయం నాటికి రెండు అడుగులు పెరిగి 17 అడుగులకు చేరింది. ఇలాగే మరో మూడు రోజులు నీటి విడుదల కొనసాగితే 23అడుగులకు నీటిమట్టం చేరి నిండుకుండను తలపించే అవకాశం ఉంది. అదే జరిగితే మరో మూడు నెలల వరకు మూడు జిల్లాలకు తాగునీటికి ఎలాంటి ఢోకా లేదు. 

తాగునీటి అవసరాలు తీర్చడానికే..

ఎలినోన్ ప్రభావంతో ఈ ఏడాది వర్షాభావ పరిస్థితులు తలెత్తాయి. దీంతో ఈ ఏడాది చెప్పుకోదగిన సరైనా వర్షం ఇప్పటి వరకు కురవలేదు. వరదలు వచ్చిన దాఖలాలు లేవు. దీంతో కరువు పరిస్థితులు కండ్ల ముందే కనిపిస్తున్నాయి. అయితే కృష్ణ ప్రాంతం ఎగువ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసిన నేపథ్యంలో కృష్ణా బేసిన్ ల్లోకి భారీగా వరదలు వచ్చి చేరాయి.

దీంతో శ్రీశైలం ప్రాజెక్టు నుంచి నాగార్జున సాగర్ కు కొంత నీటిని విడుదల చేసిన అధికారులు, ఆ నీటిని పొదుపుగా తాగునీటి అవసరాల కోసం వినియోగించాలని నిర్ణయించారు. ఈ మేరకు విడతల వారిగా సాగర్ ఎడమ, కుడికాలువలకు నీటిని విడుదల చేస్తున్నారు. అందులో భాగంగానే ప్రభుత్వం ఆదేశాల మేరకు తాగునీటి అవసరాల కోసం నాగార్జున సాగర్ నుంచి నీటిని విడుదల చేశారు. 

మిషన్ భగీరథ పథకం ద్వారా తాగునీటికి..

పాలేరు జలాశయంకు సాగర్ నీరు వస్తుండగా, ఆ నీటిని చాలా జాగ్రత్తగా పొదుపుగా వినియోగించుకునేందుకు ఎన్‌ఎస్పీ అధికారులు, మిషన్ భగీరథ అధికారులు ఫ్లాన్ చేస్తున్నారు. పాలేరు జలాశయం ను ఖమ్మం, సూర్యాపేట, వరంగల్ జిల్లాలకు మిషన్ భగీరథ పథకం ద్వారా పంచాయతీలకు, గ్రామాలకు తాగునీటిని అందిస్తున్నారు.

జలాశయం లోకి వచ్చిన నీటిని జాగ్రత్తగా వాడుకోవాలని అధికారులు ఆలోచన చేస్తున్నారు. ఈ వాటర్ ను తాగునీటి అవసరాల కోసం ఉపయోగిస్తామని ఎన్‌ఎస్పీ సీఈ మంగళం వెంకటేశ్వర్లు విజయక్రాంతికి తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లోనూ సాగు పంటలకు ఉపయోగించబోమని తెల్చి చెప్పారు.

రైతులను ఊరిస్తున్న వాటర్ విడుదల..

ఒక వైపు వర్షాలు రాకా, వరదలు లేక చెరువులు, జలాశయం ఎండుముఖం పడితుంటే.. మరో వైపు రైతులు బావులు, బోర్లు, చెరువులు, కాలువల కిందా వరి పంటలను సాగు చేశారు. పాలేరు జలాశయం లోతట్టు, ఎగువ ప్రాంతాల్లో రైతులు ముమ్మరంగా వరి నాట్లు వేశారు. గత 20 రోజులుగా ఎలాంటి వర్షం కురవకపోవడంతో రైతులు నిరాశలో ఉండిపోయారు. ఈ దశలో నాగార్జున సాగర్ నుంచి పాలేరు జలాశయం కు నీటిని విడుదల చేస్తుండటం రైతులకు ఊరటనిచ్చే అంశమే. అయితే పాలేరు జలాశయం నిండటం వల్ల భూగర్భజలాలు పెరిగే అవకాశం ఉంది. 

అలాగే తాగునీటి అవసరాలకు పాలేరు పెద్ద కాలువ విడుదల చేస్తే భూగర్భ జలాలు పెరగడంతో పాటు బోర్లు, బావుల్లో నీళ్ళు పెరిగే అవకాశం ఉంది. ఫలితంగా సాగు చేసిన వరి పంటలు పండుతాయని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే అయినప్పటికి నీటిపారుదల శాఖ అధికా రులు మాత్రం రైతులకు షాక్ ఇచ్చే ప్రకటనలు చేస్తున్నారు. కేవలం మూడు జిల్లాలకు తాగునీటి అవసరాలకు మాత్రమే నీటిని విడుదల చేస్తామని చెబుతున్నారు. ఏదేమైనప్పటికీ పాలేరు జలాశయం కు కృష్ణమ్మ నీళ్ళు రావడం సంతోషకర విషయమే..