31 August, 2026 | 5:15 AM

మో‘డల్’ ఇందిరమ్మ హౌస్!

31-08-2026 01:56 AM
  1. ప్రారంభించి ఏడాదిన్నర
  2. పూర్తికాని నిర్మాణం 

మహబూబాబాద్, ఆగస్టు 30 (విజయక్రాంతి): రాష్ట్రవ్యాప్తంగా ఇందిరమ్మ గృహ నిర్మాణ పథకంలో లబ్ధిదారులు ఇందులో నిర్మించుకొని గృహప్రవేశం చేస్తున్నప్పటికీ, గృహ నిర్మాణ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన నమూనా ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా మారింది. దీనితో ప్రభుత్వ లక్ష్యం నెరవేరకుండా పోతోందనే విమర్శలు వస్తున్నాయి.

ఇందిరమ్మ గృహ నిర్మాణ పథకంలో లబ్ధిదారులు 5 లక్షల రూపాయల వ్యయంతో ఇల్లు ఎలా నిర్మించుకోవాలో ప్రత్యక్షంగా చూపించే విధంగా ప్రతి మండల కేంద్రంలో ఒక మోడల్ హౌస్ నిర్మించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ క్రమంలో ఏడాదిన్నర క్రితం మండల కేంద్రాల్లో అందుబాటులో ఉన్న ప్రభుత్వ స్థలాల్లో మోడల్ హౌస్ నిర్మాణానికి గృహ నిర్మాణ శాఖ అధికారులు చర్యలు చేపట్టారు. అయితే అనేకచోట్ల స్థలం లేకపోవడంతో గృహ నిర్మాణం చేపట్టలేదు.

మరి కొన్ని చోట్ల అసంపూర్తి నిర్మాణంతో వదిలేశారు. ఒకటి రెండు చోట్ల మాత్రమే పూర్తిస్థాయిలో నిర్మించారు. ఇదే తరహాలో మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండల పరిషత్ ఆవరణలో ఏడాదిన్నర క్రితం చేపట్టిన ఇందిరమ్మ మోడల్ హౌస్ అసంపూర్తిగా వదిలేసిన దృశ్యం ఇది. అసంపూర్తిగా వదిలేయడంతో అటు లబ్ధిదారులకు చూపించలేక.. కనీసం ఏదైనా ఉపయోగపడే విధంగాలేక ఇందిరమ్మ నమునా గృహం ఎందుకు పనికిరాకుండా మారిపోయింది.