31 August, 2026 | 1:36 AM

వంటింట్లో ధరల మంటలు!

31-08-2026 12:49 AM
  1. సామాన్యుడి బతుకు ఛిన్నాభిన్నం
  2. దేశంలోనే అత్యధికంగా తెలంగాణ ద్రవ్యోల్బణం 6.36 శాతం
  3. తలక్రిందులవుతున్న వంటింటి బడ్జెట్
  4. కళ్లప్పగించి చూస్తున్న సర్కారు

సంగారెడ్డి బ్యూరో, ఆగస్టు 30 (విజయక్రాంతి): ‘ఆదాయం పెరగలేదు.. కానీ ఖర్చు లు మాత్రం ఆకాశాన్ని అంటుతున్నాయి.. గతంలో నెలకు రూ.5 వేలతో ఇల్లు గడిచేది. ఇప్పుడు రూ.9 వేలు పెట్టినా సరుకులు సరిపోవడం లేదు. నూనె కొనాలంటేనే భయమే స్తున్నది. పిల్లల స్కూల్ ఫీజులు, ఇంటి కిరాయిలు ఒకవైపు.. వంటింటి ఖర్చులు మరో వైపు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని రైతు బజార్ల ద్వా రా రాయితీపై నిత్యావసరాలు (Essentials) అందించాలి’.. ఇది ఓ మధ్య తరగతి గృహిణి ఆవేదన.

రాష్ట్రంలో సామాన్యుడి బతుకు దినదిన గండంగా మారుతున్నది. ఒకవైపు పెరగని ఆదాయం, మరోవైపు భారీగా పెరిగిన నిత్యావసరాల ధరలు మధ్య మధ్యతరగతి జీవి వెన్ను విరుస్తున్నాయి. మార్కెట్‌కు వెళ్తే ఏ వస్తువు ముట్టుకున్నా షాక్ కొడుతున్నది.

కేంద్ర గణాంకాల శాఖ విడుదల చేసిన తాజా నివేదికల ప్రకారం దేశవ్యాప్తంగా రిటైల్ ద్రవ్యోల్బణం సగటున 4.45శాతంగా నమోదైతే, తెలంగాణలో అది ఏకంగా 6.36 శాతా నికి చేరి దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. ముఖ్యంగా ఆహార ద్రవ్యోల్బణం 5.52 శాతం దాటడంతో వంటగది బడ్జెట్ పూర్తిగా నియంత్రణ తప్పి సామాన్యుడి ఆక్రందనలు మిన్నంటుతున్నా యి. గడిచిన రెండేళ్ల కాలం గా మార్కెట్‌లో నిత్యావసరాల ధరలు పెరిగిన తీరును పరిశీలిస్తే సామాన్యుడిపై పడిన భారం ఎంతో స్పష్టమవుతున్నది. 

ఎందుకీ ధరల మంట? 

దేశంలోనే అత్యధికంగా వంటనూనెల ధరలు తెలంగాణలో నే పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్ ప్రభావంతోపాటు స్థానిక పన్నుల భారం ఇందు కు కారణమని తెలుస్తున్నది. కూరగాయలు, ఉల్లిగడ్డలు, పప్పు ధాన్యాల కోసం తెలంగాణ ఎక్కువగా ఏపీ, కర్ణాటక, మహారాష్ట్రలపై ఆధారపడుతున్నది. రవాణా చార్జీలు పెరగడం వల్ల ఇక్కడి కి వచ్చేసరికి ధరలు రెట్టింపవుతున్నా యి. మరోవైపు అకాల వర్షాలు, నిలకడలేని వాతావరణం వల్ల స్థానిక తోట లు, పంటల దిగుబడి దారుణంగా పడిపోయింది. దీంతో మార్కెట్‌కు సరుకు రాక కృత్రిమ కొరత ఏర్పడుతున్నది. 

ప్రభుత్వ తక్షణ కర్తవ్యం ఏమిటీ?

ధరల నియంత్రణకు ప్రభుత్వం కేవలం ప్రకటనలకే పరిమితం కాకుండా మూడు అంచెల్లో యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టాలని నిపుణులు సూచిస్తున్నారు. మార్కెట్‌లో కృత్రిమ కొరత సృష్టించి, ధరలు పెంచే బ్లాక్ మార్కెట్, హోర్డింగ్ వ్యాపారులపై పౌరసరఫరాల శాఖ, పోలీసులతో ప్రత్యేక టాస్క్‌ఫో ర్స్ ఏర్పాటు చేసి ఆకస్మిక తనిఖీలు చేపట్టా లి.

మధ్యవర్తుల ప్రమేయం లేకుండా నేరుగా రైతుల నుంచే కూరగాయలు, ఉల్లిగడ్డలు సేకరించి నగరాలు, పట్టణాల్లోని మొబైల్ వ్యాన్ల ద్వారా ప్రభుత్వమే సబ్సిడీ ధరలకు ప్రజలకు విక్రయించాలి. కేవలం బియ్యం మాత్రమే కాకుండా, విపరీతంగా ధరలు పెరిగిన వంటనూనె, కందిపప్పు, చక్కెరను రేషన్ కార్డుదా రులందరికీ రాయితీధరలపై తక్షణమే పంపిణీ చేయాలి.

మార్కెట్ నియంత్రణ వ్యూహాలు

నిత్యావసరాల ధరలు అకస్మాత్తుగా పెరిగినప్పుడు మార్కెట్‌ను సమతుల్యం చేయ డానికి ప్రభుత్వం ప్రత్యేక నిధిని కేటాయించాలి. ధరలు పెరిగినప్పుడు ఈ నిధితో పొ రుగు రాష్ట్రాల నుంచి సరుకును కొనుగోలు చేసి స్థానిక మార్కెట్‌లో తక్కువ ధరకు విడుదల చేయాలి.  ఇతర రాష్ట్రాల నుంచి దిగుమ తి చేసుకునే నిత్యావసర వస్తువులపై స్థానిక పన్నులను తాత్కాలికంగా తగ్గించడం ద్వారా రిటైల్ మార్కెట్‌లో ధరలు దిగివస్తాయి. 

దీర్ఘకాలిక స్వయంసమృద్ధి చర్యలు

కూరగాయలు, పప్పుధాన్యాల కోసం ఇతర రాష్ట్రాలపై ఆధారపడట్టాన్ని తగ్గించడానికి రాష్ట్రంలోనే కూరగాయల క్లస్టర్లు, పప్పు ధాన్యాల సాగును భారీగా ప్రోత్సహించాలి. పంటల దిగుబడి ఎక్కువగా ఉన్నప్పుడు అవి వృథాకాకుండా, కొరతలో వాడుకునేలా ప్రతి నియోజకవర్గ కేంద్రం లో శీతలీకరణ గిడ్డంగులను నిర్మించాలి. అప్పుడే ధరలు అకస్మాత్తుగా పెరగకుండా కాపాడుతుంది.