31 August, 2026 | 3:32 AM

రూ.500 కోట్ల భూమికి ఎసరు!

31-08-2026 01:17 AM

అజామాబాద్ భూములపై సీఎం రేవంత్ కన్ను

  1. రూ.87 కోట్లకే ప్రైవేట్‌కు కట్టబెట్టే యత్నం 
  2. సుప్రీంకోర్టు తీర్పునూ పట్టించుకోని ప్రభుత్వం 
  3. నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలి 
  4. ముఖ్యమంత్రికి మాజీమంత్రి హరీశ్‌రావు లేఖ

హైదరాబాద్, ఆగస్టు 30 (విజయక్రాంతి) : హైదరాబాద్ నడిబొడ్డున మరో భారీ భూ కుంభకోణానికి  కాంగ్రెస్ ప్రభుత్వం(Congress government) తెరతీసిందని, అత్యంత విలువైన ప్రభుత్వ భూమి(government land)ని ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టేందుకు ప్రయత్నిస్తోందని మాజీ మంత్రి హరీశ్ రావు(Harish Ra) ఆరో పించారు. ఆర్టీసీ క్రాస్ రోడ్స్, అజామాబాద్‌లో సుమారు రూ. 500 కోట్ల విలు వైన తెలంగాణ ఆయిల్‌ఫెడ్ భూముల(Telangana Oilfed land)ను ప్రైవేట్ వ్యక్తులకు ధారాదత్తం చేసే ప్రభుత్వ చర్యలను ఆయన తీవ్రంగా ఖండించారు.

ఈ మేరకు ఆదివారం సీఎం రేవంత్‌రెడ్డి(Revanth Reddy)కి హరీశ్‌రావు లేఖ రాశారు. దశాబ్దాలుగా ప్రభుత్వ ఆధీనంలో ఉన్న భూములను కమీషన్ల కోసం ప్రైవేటుకు అప్పగించే చర్యలను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. రేవంత్ సర్కార్ ప్రజా సంక్షేమాన్ని గాలికొదిలి, రియల్ ఎస్టేట్ ఏజె న్సీగా మారిపోయిందని మండిపడ్డారు. బహిరంగ మార్కెట్‌లో రూ. 500 కోట్లు పలికే భూమిని కేవలం రూ. 87 కోట్లకే ఓ ప్రైవేట్ వ్యక్తికి కట్టబెట్టే భారీ కుట్రకు పాల్పడుతుందని ఆరోపించారు.

రూ.87 కోట్లు చెల్లించడానికి  ఆయిల్‌ఫెడ్ సిద్ధం గా ఉన్నా, వారిని కాదని ప్రైవేట్‌కు అప్పగించడం వెనుక ఉన్న ఆంతర్యం ఏమి టి? అని ప్రశ్నించారు. మూడు దశాబ్దాలుగా ఆయిల్‌ఫెడ్ ఆధీనంలో ఉన్న 3 ఎకరాల 23 గుంటల (15,984 గజాలు) భూమిని లాక్కునే దుర్మార్గమని విమర్శించారు. 1987లో సుప్రీంకోర్టు ప్రైవేట్ సంస్థకు మొట్టికాయలు వేసి ప్రభుత్వానిదే హక్కు అని తేల్చినా.. కమీషన్ల కోసం కాంగ్రెస్ నేతలు కోర్టు తీర్పులనే తుంగలో తొక్కారని హరీశ్‌రావు మండి పడ్డారు.

పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో ఏనాడూ ప్రైవేట్ శక్తులకు తలొగ్గకుండా ప్రభుత్వ భూములు, ఇతర ఆస్తులను కాపాడామని హరీశ్ రావు గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేదల పొట్టగొట్టి పెద్దలకు పల్లీలు, బఠానీల్లా వేల కోట్ల విలువైన భూముల పందేరం చేస్తున్నారని విమర్శించారు. ఒకవైపు సామాన్యుల ఇండ్లను 22ఏ జాబితాలో పెట్టి వేధింపులు.. మరోవైపు ఖరీదైన ప్రభుత్వ భూములను కమీషన్ల కోసం కారుచౌకగా ప్రైవేట్‌కు దారాదత్తం చేస్తున్నారని మండిపడ్డారు.

ఇది ఒక్క అజామాబాద్ భూమి కథే కాదు.. కోకాపేట, రాయదుర్గం, గచ్చిబౌలిలోనూ కాంగ్రెస్ రియల్ ఎస్టేట్ దందా నడుస్తుందన్నారు.  స్వార్థం కోసం ఇష్టారాజ్యంగా ఆస్తులు అమ్ముకుంటూ పోతే.. భవిష్యత్తులో గుడికి, బడికి, చివరికి శ్మశానానికి కూడా స్థలం మిగలదని స్పష్టం చేశారు.

అక్రమ భూ కేటాయింపు నిర్ణయాన్ని తక్షణమే ఉపసంహరించుకోవడంతో పాటు సదరు భూములు ఆయిల్‌ఫెడ్‌కే దక్కేలా హక్కులు కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రజల సొత్తును ప్రైవేటు వ్యక్తులకు దోచిపెడితే బీఆర్‌ఎస్ చూస్తూ ఊరుకోదని, ప్రభుత్వ తన నిర్ణ యాన్ని వెనక్కి తీసుకోనట్లయితే బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో పోరాటం చేస్తామని హెచ్చరించారు.