బీజేపీ అంటే దేశభక్తి, నిబద్ధతకు ప్రతీక
కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
తాండూరు, ఆగస్టు 30: భారతీయ జనతా పార్టీ అంటే దేశభక్తి, నిబద్ధత, ప్రజాసేవకు ప్రతీక అని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఆదివారం పార్టీ జిల్లా అధ్యక్షుడు యు. రమేష్ కుమార్ బాధ్యత స్వీకారోత్సవంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా గాంధీ కుటుంబం ఒక వర్గం సంక్షేమం కోసమే పాటుపడిందని మిగతా అన్ని వర్గాలకు మొండి మొండి హస్తం చూపించిందని ఆరోపించారు.
నరేంద్ర మోడీ పాలనలో ప్రజాస్వామ్య బద్దంగా అన్ని వర్గాలకు సమానంగా సంక్షేమ పథకాలు అందిస్తూ సబ్కా సాత్ సబ్కా వికాస్ నినాదంతో పాలన సాగుతోందని అన్నారు. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం భూకబ్జాలు, అవినీతి, అక్రమాల రాజ్యమేలుతున్నాయని విమర్శించారు.
రానున్న రోజుల్లో రాష్ట్రంలో కాషాయ జెండా ఎగరడం ఖాయమని అందుకుగాను ప్రతి బిజెపి కార్యకర్త తాండూరు గడ్డపై బిజెపి జెండా ఎగురవేసేందుకు జిల్లాలో రమేష్ కుమార్ ఆధ్వర్యంలో పార్టీ అభివృద్ధికి పట్టుదలతో కృషి చేయాలని కోరారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, రాష్ట్ర నాయకులు గౌతమ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.






