ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలో విలీనం చేయాలి
- బహుజన కార్మిక సంఘంలోకి రాజారెడ్డి, పలువురు నేతలు
- బహుజన కార్మిక యూనియన్ ప్రధాన కార్యదర్శి యాదయ్య
ముషీరాబాద్,ఆగస్టు 4 (విజయక్రాంతి): హైదరాబాద్ బాగ్ లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో మంగళవారం బహుజన కార్మిక యూనియన్ రాష్ట్ర కమిటీ ముఖ్య నాయకుల, కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బహుజన కార్మిక యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కత్తుల యాదయ్య మాట్లాడుతూ తమ ఆహ్వానం మేరకు నేడు తమ యూనియన్ లో తెలంగాణ ఆర్టీసీ కార్మిక సమాఖ్య నుండి కొమిరెల్లి రాజిరెడ్డి సహా పలువురు నాయకులు చేరడం పట్ల వారికి స్వాగతం పలుకుతున్నామని తెలిపారు.
గతంలో తమ సంఘం నుండి ఎన్నో ఉద్యమాలు నిర్వహించి, ఒక పెద్ద యూనియన్కు ట్రేడ్ యూనియన్ నాయకత్వంతో పాటు జేఏసీని ఏర్పాటు చేసి కన్వీనర్గా ముందుకు సాగామని ఆయన గుర్తు చేశారు. అదే స్ఫూర్తితో పలువురు నాయకులు యూనియన్లో చేరడం సంతోషంగా ఉందన్నారు. ఆర్టీసీ కార్మికులకు ఎక్కడ ఇబ్బంది వచ్చినా ఎల్లవేళలా అండగా ఉంటామని స్పష్టం చేశారు. ముఖ్యంగా ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలో విలీనం చేసేంత వరకు పోరాటంలో ముందు వరుసలో నిలబడతామని, అందుకు కంకణం కట్టుకున్నామని తెలిపారు.
ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారానికి సంబంధించి భవిష్యత్ కార్యాచరణను తమ యూనియన్ రాష్ట్ర కమిటీ సమావేశం అనంతరం ప్రకటిస్తామని యాదయ్య వెల్లడించారు.జరగబోయే ఎన్నికల నేపథ్యంలో ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలో విలీనం చేయాలని కోరుతూ లేబర్ కమిషనర్ కార్యాలయంలో వినతిపత్రం ఇవ్వడానికి అన్ని యూనియన్లు సిద్ధమేనా అని ఆయన ప్రశ్నించారు. ఈ సమావేశంలో కార్మిక సంఘం అధ్యక్షుడు ముని రాములు, వర్కింగ్ ప్రెసిడెంట్ రాములు, డిప్యూటీ ప్రధాన కార్యదర్శి ఏవి రావు, ఎన్ వి చారి, వినాయక రెడ్డి, హుస్సేన్, ఎమ్మెస్ రావు, లింగస్వామి, పర్వతాలు జంగయ్య కనకయ్య తదితరులు పాల్గొన్నారు.






