5 August, 2026 | 2:42 AM

ప్రమాదం అంచున ప్రయాణం!

05-08-2026 01:52 AM

దెబ్బతిన్న రోడ్లకు మరమ్మతులు కరువు 

మహబూబాబాద్, ఆగస్టు 4 (విజయక్రాంతి): భారీ వర్షాలకు మహబూబాబాద్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో దెబ్బతిన్న ఆర్ అండ్ బి రోడ్లకు మరమ్మతులు నిర్వహించకపోవడంతో ప్రమాదం అంచున ప్రయాణం  సాగించాల్సిన పరిస్థితి ఏర్పడిందని వాహనదారులు వాపోతున్నారు. జిల్లా వ్యాప్తంగా గత రెండేళ్లుగా అనేక చోట్ల ఆర్ అండ్ బి రహదారులు భారీ వర్షాలకు పొంగిన వరదలకు దెబ్బతిన్నాయి. కొన్నిచోట్ల రోడ్లు పెద్ద ఎత్తున వరదకు కొట్టుకుపోగా, మరి కొన్ని చోట్ల కల్వర్టులు దెబ్బతిన్నాయి.

దీనికి తోడు చాలాచోట్ల వరద రోడ్లపై పొంగి ప్రవహించడంతో రోడ్లు కోతకు గురయ్యాయి. దీనితో రోడ్లన్నీ దెబ్బతిని వాహనాల రాకపోకలకు ఇబ్బందులు కలిగిస్తున్నాయని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా అనేక రోడ్లు వరదలకు దెబ్బతిన్నప్పటికీ శాశ్వత ప్రాతిపదికన మరమ్మతు పనులు చేపట్టలేదని చెబుతున్నారు. కొన్నిచోట్ల తాత్కాలిక మరమ్మతులు నిర్వహించి, రాకపోకలు పునరుద్ధరించినప్పటికీ శాశ్వత తరహాలో పనులు చేపట్టకపోవడంతో రహదారులు సరిగా లేక ఇబ్బందులు పడాల్సి వస్తుందని చెబుతున్నారు.

కొన్నిచోట్ల రోడ్లు కోతకు గురై వాహనాల రాకపోకలకు ఇబ్బందిగా మారిందని, సైడ్  బర్ములు కొట్టుకుపోవడంతో ఎదురు ఎదురుగా వాహనాలు వస్తే ఏ మాత్రం పక్కకు జరిగినా ప్రమాదాల బారిన పడాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెబుతున్నారు. రోడ్ల మరమ్మతులకు అధికారులు ప్రభుత్వానికి నివేదిక అందించినప్పటికీ నిధులు మంజూరు కాకపోవడం వల్లే పనులు చేపట్టడం లేదని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.

జిల్లావ్యాప్తంగా చాలాచోట్ల గ్రామాల నుండి మండలానికి, మండలం నుండి జిల్లాకు, ఇతర ప్రాంతాలకు వెళ్లే ఆర్ అండ్ బి రోడ్లు దెబ్బతిని రాకపోకలకు ఇబ్బందులు కలిగిస్తున్నప్పటికీ ప్రభుత్వం నుండి నిధులు మంజూరు కాకపోవడంతో అధికారులు కూడా చేష్టలుడికి చూడాల్సిన పరిస్థితి నెలకొందని చెబుతున్నారు. దీనివల్ల ఇప్పటికే దెబ్బతిన్న రోడ్లు మరింత అద్వాన స్థితికి చేరుకుంటున్నాయని, ఇప్పటికైనా ప్రజా ప్రతినిధులు, అధికారులు స్పందించి ప్రభుత్వం నుండి నిధులు మంజూరు చేయించి దెబ్బతిన్న రోడ్లకు శాశ్వత ప్రాతిపదికన మరమతు పనులు చేపట్టి రాకపోకలకు ఇబ్బందులు లేకుండా చూడాలని కోరుతున్నారు.