ఉప్పొంగిపొర్లుతున్న వాగులు నిండుకుండల్లా చెరువులు,కుంటలు..
తాడ్వాయి, జూలై, 04( విజయ క్రాంతి): సోమవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలంలోని వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. రాత్రి ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి మండలంలోని సంతాయిపేట భీమేశ్వర వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది.శ్రీ భీమేశ్వర స్వామి ఆలయం చుట్టూ వాగు ప్రవాహం కొనసాగుతుంది. కాళోజివాడి వాగు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో కాళోజి వాడి నుంచి కామారెడ్డికి రాకపోకలు నిలిచిపోయాయి.
ఎర్ర పహాడ్ పెద్దవాగు, కన్కల్ వాగు, నందివాడ పిల్ల ఒర్రె వాగు లు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. మండలంలోని నందివాడ పెద్ద చెరువు, వాయిలి కుంట, కృష్ణాజివాడి, బ్రహ్మాజీ వాడి, చిట్యాల, సంతాయిపేట, తాడ్వాయి, దేమికలాన్,కరడుపల్లి, చందాపూర్, సంగోజువాడి, బ్రాహ్మణపల్లి గ్రామాల్లోని చెరువులు నిండుకుండల్లా మారాయి. అలుగుల నుంచి నీరు బయటకు వెళ్ళిపోతుంది గత వారం రోజుల క్రితం అసలు వర్షాలే లేవన్న రైతులకు ఒక్కసారిగా వర్షాలు కురవడంతో రైతుల్లో ఆనందం వెళ్లి విరుస్తుంది.






