5 August, 2026 | 2:42 AM

హరీశ్ రావుపై కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలు అవివేకం

05-08-2026 01:53 AM

గజ్వేల్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్

గజ్వేల్, ఆగస్టు 4 (విజయక్రాంతి): మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే హరీశ్ రావుపై కాంగ్రెస్ నాయకులు చేస్తున్న విమర్శలు అర్థరహితమని గజ్వేల్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్ విమర్శించారు. మంగళవారం  ఆయన మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ప్రజా సమస్యలపై నిరంతరం ప్రశ్నిస్తున్న హరీశ్ రావును వ్యక్తిగతంగా లక్ష్యంగా చేసుకుని విమర్శించడం కాంగ్రెస్ నాయకుల రాజకీయ దివాళాకోరుతనానికి నిదర్శనమన్నారు. గుడికి వెళ్లి దేవుడిని దర్శించుకోవడం ప్రతి పౌరుడికి రాజ్యాంగం కల్పించిన హక్కు అని, దానికి ఎవరి అనుమతి అవసరం లేదన్నారు.

అలాంటి విషయాన్ని వక్రీకరించి క్షుద్రపూజలతో ముడిపెట్టడం బాధ్యతారాహిత్యమన్నారు. ముఖ్యమంత్రి చేసిన ఇంజనీరింగ్ విద్యార్థులపై వ్యాఖ్యలతో ప్రజల్లో ఏర్పడిన వ్యతిరేకతను పక్కదారి పట్టించేందుకే కాంగ్రెస్ నేతలు ఈ అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారని ఆరోపించారు.  హరీశ్ రావుపై నిరాధార ఆరోపణలు చేసిన వారికి ఇప్పటికే లీగల్ నోటీసులు పంపినప్పటికీ, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మళ్లీ అదే అంశాన్ని ప్రస్తావించడం సరికాదన్నారు. అధికార పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న వ్యక్తి బాధ్యతాయుతంగా వ్యవహరించాలన్నారు. ప్రతిపక్షాలపై వ్యక్తిగత దాడులు మానుకుని ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలుపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని మాదాసు శ్రీనివాస్ హితవు పలికారు. అలాగే ప్రజల సమస్యలపై బీఆర్‌ఎస్ పార్టీ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.