భిక్కనూరులో ఆర్టీసీ బస్సు ప్రమాదం.. ప్రయాణికులు సురక్షితం
భిక్కనూర్, మే22(విజయ క్రాంతి): భిక్కనూరు మండలం బస్వాపూర్ గ్రామ శివారులోని 44వ జాతీయ రహదారిపై శుక్రవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రోడ్డుపై ఆగి ఉన్న డీసీఎం వ్యాన్ను ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఆర్టీసీ బస్సు వెనుక నుంచి ఢీకొట్టింది.
ప్రమాదం తీవ్రంగా జరిగినప్పటికీ బస్సులో ప్రయాణిస్తున్న 26 మంది ప్రయాణికులు ఎలాంటి గాయాలు లేకుండా సురక్షితంగా బయటపడ్డారు. అయితే బస్సు ముందు భాగం పూర్తిగా దెబ్బతింది. ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే జీఎంఆర్ హైవే సిబ్బంది, భిక్కనూరు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. హైవేపై ట్రాఫిక్ జామ్ కాకుండా వాహనాలను క్రమబద్ధీకరించి రాకపోకలు సజావుగా కొనసాగించేలా చర్యలు తీసుకున్నారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది






