29 August, 2026 | 6:14 AM

ఎకరం రూ.269 కోట్లు!

29-08-2026 12:00 AM
  1. రాయదుర్గం భూములకు రికార్డ్ ధర
  2. ‘ప్లాట్ రూ.1,447.22 కోట్ల రాబడి
  3. ఇటీవలే ‘ప్లాట్ భూముల వేలం
  4. ఎకరం రూ.264 కోట్లు పలికిన రేటు  
  5. వారం వ్యవధిలోనే వరుసగా రెండు భారీ బిడ్లు
  6. టీజీఐఐసీకి భారీగా ఆదాయం

 హైదరాబాద్, ఆగస్టు 28 (విజయక్రాంతి) : హైదరాబాద్‌లోని రాయదుర్గం ప్రాంతంలో తెలంగాణ పారిశ్రామిక మౌలిక వసతుల సంస్థ (టీజీఐఐసీ) నిర్వహించిన భూముల వేలానికి భారీ స్పందన లభించింది. 5.38 ఎకరాల విస్తీర్ణం కలిగిన ప్లాట్ ఎకరం రూ.269 కోట్లు పలకగా.. రూ.1,447.22 కోట్ల ఆదాయం సమకూరింది. ఇదే క్రమంలో గతవారం నిర్వహించిన ప్లాట్-పీ1 వేలం కూ డా అత్యంత భారీ రేటును నమోదు చేసింది. 5.25 ఎకరాల విస్తీర్ణం కలిగిన ఈ ప్లాట్ ఎకరాకు రూ.264 కోట్ల ధర పలకగా..

మొత్తం రూ.1,386 కోట్ల ఆదాయం వచ్చింది. ఇందు లో వేలం విలువలో 25 శాతం మొత్తాన్ని తొలి దశ చెల్లింపుగా ఇప్పటికే ప్రభుత్వం అం దుకుంది. తాజాగా నిర్వహించిన పీ2 వేలం ఫలితాన్ని, గత వారం పీ1 వేలం ఫలితాన్ని కలిపి చూస్తే.. కేవలం 10.63 ఎకరాల భూమి ద్వారా టీజీఐఐసీకి ఏకంగా రూ.2,833.22 కోట్ల ఆదాయం సమకూరింది. ఈ రెండు వేలాల్లో ఎకరాకు సగటున రూ.266.53 కోట్ల ధర లభించడం విశేషం.

పెట్టుబడిదారుల నమ్మకానికి నిదర్శనం

వారం రోజుల వ్యవధిలో నిర్వహించిన రెండు వేలాల్లో భారీ బిడ్లు నమోదయ్యాయి. ఎకరాకు రూ.260 కోట్లకు పైగా ధర పలకడం రాయదుర్గం ప్రాంతంపై పెట్టుబడిదారులకు ఉన్న ఆసక్తికి అద్దం పడుతోంది. రాయదుర్గం కారిడార్ ప్రముఖ డెవలపర్లు, పెట్టుబడిదారు ల్లో ఉన్న విశ్వాసాన్ని ఈ ధరల వెల్లడి స్పష్టం గా చాటుతోంది.

విస్తరిస్తున్న వ్యాపార వ్య వస్థ, మెరుగైన మౌలిక వసతులు, రవాణా అనుసంధానం, దేశంలోని ప్రముఖ వ్యాపారపెట్టుబడి కేంద్రంగా హైదరాబాద్‌కు పెరుగు తున్న ప్రాధాన్యం.. ఇవన్నీ రాయదుర్గ్  భూ ములకు భారీ డిమాండ్లకు  కారణం అయ్యాయని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఈ పరిణామం హైదరాబాద్‌ను దేశంలోనే అ త్యంత చురుకైన, ఆకర్షణీయమైన రియల్ ఎస్టేట్ మార్కెట్లలో ఒకటిగా మరోసారి నిలబెట్టిందని టీజీఐఐసీ వర్గాలు తెలిపాయి.

ప్రభుత్వ విధానాలకు ప్రశంసలు

టీజీఐఐసీ వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కే.శశాంక, మాట్లాడుతూ.. హైదరాబాద్, తెలంగాణపై పెట్టుబడిదారుల విశ్వాసానికి తాజా వేలం బలమైన నిదర్శనమన్నారు. రా యర్గం ప్రాంతం అత్యుత్తమ వ్యాపార, పెట్టుబడి గమ్యస్థానంగా కొనసాగుతున్న విషయా న్ని ఈ వేలం మరోసారి నిరూపించిందన్నా రు. వ్యూహాత్మకంగా కీలక ప్రాంతాల్లో ఉన్న భూములకు ఎంతటి డిమాండ్ ఉందో ఈ ధరలు స్పష్టం చేస్తున్నాయని చెప్పారు.

పారదర్శకమైన, పోటీతో కూడిన వేలం ప్రక్రియ ద్వారా ప్రభుత్వ భూములకు ఉన్న విలువను గరిష్ఠ స్థాయికి తీసుకెళ్లే అవకాశం ఉందని శశాంక తెలిపారు. పెట్టుబడిదారులకు అనుకూలమైన ప్రభుత్వ విధానాలు, నిరంతర మౌలిక వసతుల అభివృద్ధి ఈ విజయానికి దోహదపడ్డాయని పేర్కొన్నారు. కాగా ఈ  భూముల వేలం ప్రక్రియను ఎంఎస్టీసీ ఈ-ఆక్షన్ వేదిక ద్వారా నిర్వహించారు.