“అరైవ్ అలైవ్” సందేశంతో రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమం
చివ్వెంల,(విజయక్రాంతి): రోడ్డు ప్రమాదాలను నివారించి ప్రజల ప్రాణాలను రక్షించడం లక్ష్యంగా చివ్వెంల మండలంలో రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. స్థానిక ఎస్ఐ కనకరత్నం ఆధ్వర్యంలో నేషనల్ హైవే–365 బీబీ వద్ద ఈ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా పోలీసులు, స్థానిక ప్రజలు, యువకులు కలిసి “అరైవ్ అలైవ్” (Arrive Alive) అనే నినాదంతో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించి బ్యానర్ ప్రదర్శించారు.
ట్రాఫిక్ నియమాలు ప్రతి వాహనదారుడు తప్పనిసరిగా పాటించాలని, ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించడం, నాలుగు చక్రాల వాహనదారులు సీట్‌బెల్ట్ వినియోగించడం, అతివేగం మరియు నిర్లక్ష్య డ్రైవింగ్‌కు దూరంగా ఉండాలని ఎస్ఐ కనకరత్నం సూచించారు. రోడ్డు ప్రమాదాలు ప్రధానంగా అవగాహన లోపం, నిర్లక్ష్యం మరియు ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించడం వల్లే జరుగుతున్నాయని ఆయన తెలిపారు.
చిన్నపాటి జాగ్రత్తలు పాటించడం ద్వారా అనేక ప్రమాదాలను నివారించవచ్చని, ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వాహనాలు నడపాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, గ్రామస్థులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొని రోడ్డు భద్రతపై అవగాహన పొందడంతో పాటు భద్రతా నియమాలను పాటించేందుకు ప్రతిజ్ఞ చేశారు. ప్రజల ప్రాణ భద్రతే లక్ష్యంగా ఇటువంటి కార్యక్రమాలు కొనసాగుతాయని పోలీసులు తెలిపారు.




