26 April, 2026 | 3:26 AM

ప్రజారోగ్యానికి అవినీతి జబ్బు!

26-04-2026 01:51 AM
  1. మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లలో పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు
  2. కాంట్రాక్టర్లు చెల్లించిన ఈఎండీలు పక్కదారి
  3. సుమారు రూ.2 వేల కోట్లు మాయం
  4. వరంగల్ సర్కిల్ కార్యాలయం కేంద్రంగా అవినీతి, అక్రమాలు
  5. లబోదిబోమంటున్న కాంట్రాక్టర్లు 

హైదరాబాద్, ఏప్రిల్ 25 (విజయక్రాంతి) : ప్రజారోగ్య విభాగం (పబ్లిక్ హెల్త్) వరంగల్ సర్కిల్ అవినీతికి కేంద్రంగా మారింది. టెండర్లలో పాల్గొనేందుకు కాంట్రాక్టర్లు చెల్లించిన ఈ ఎండీ (ఎర్నెస్ట్ మనీ డిపాజిట్)లు పక్కదారి పడుతున్నాయి. ఇందుకు ఇటీవల వెలుగు చూ సిన ఉదంతమే నిదర్శనం.

ప్రభుత్వ బ్యాంకుల్లో ఉండాల్సిన ఈఎండీల నగదు సుమారు రూ. 2 వేల కోట్ల వరకు మాయం కావడంతో కాం ట్రాక్టర్లు లబోదిబోమంటున్నారు. ఈ విషయమై సంబంధిత ఉన్నతాధికారులను ప్రశ్నిం చగా సరైన సమాధానం రావడం లేదని, ప్రత్యే క కమిటీ వేసి విచారణ చేస్తే నగదు ఎవరి ఖాతాల్లోకి వెళ్లిందో తేలుతుందని వారు అంటున్నారు.

రూ.20 కోట్ల వరకు ఈఎండీ డిపాజిట్లు

రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో రోడ్లు, డ్రెయినేజీలు, కల్వర్టులు, తాగునీటి పథకాలు.. ఇలా ఎలాంటి పనులైనా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ శాఖ ఆధ్వర్యంలో ఇంజనీరింగ్ విభా గమైన ప్రజారోగ్యం (పబ్లిక్ హెల్త్) విభాగం పరిధిలో చేపడుతుంటారు. వరంగల్ సర్కిల్ పరిధి లో ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాలు ఉన్నాయి.

వీటి పరిధిలోని మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లలో రూ.వందల కోట్లు విలువైన పనులు కొనసాగుతున్నాయి. ఈ పనులకు సంబంధించి ఒక శాతం ఈఎండీ డిపాజిట్‌ను టెండర్లు వేసేటప్పుడే సదరు కాంట్రాక్టర్లు ఎస్ ఈ కార్యాలయంలో ఉండే ప్రభు త్వ బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తాం. ఇలా వరంగల్ సర్కిల్ కార్యాలయం పరిధిలో సుమారు రూ.10 కోట్ల నుంచి రూ.20 కోట్ల వరకు ఈఎండీ డిపాజిట్లు ఉం టాయని కాంట్రాక్టర్లు అంటున్నారు.

ఔట్‌సోర్సింగ్ ఉద్యోగికి ఈఎండీల నిర్వహణ బాధ్యతలు

కాంట్రాక్టర్లు చెల్లించే ఈఎండీలపై సూపరింటెండెంట్ ఇంజనీర్ (ఎస్‌ఈ) అజమాయిషీ ఉంటుంది. ఆయన ఆధ్వర్యంలో సంబంధిత ఈఈలు, డీఈ వీటి నిర్వహణ బాధ్యతలు చూ స్తుంటారు. అయితే వరంగల్ సర్కిల్ కార్యాలయంలో ప్రభుత్వ బ్యాంకుల్లో ఉండాల్సిన ఈఎండీల్లో సుమారు రూ.2 వేల కోట్ల వరకు పక్కదారి పట్టినట్లు తెలుస్తోంది.

ఇందుకు ప్రధాన కారణం.. సర్కిల్ కార్యాలయం ఉన్నతాధికారి అనుమతితో, ఆయన కనుసన్నల్లో పనిచేసే ఓ ఔట్‌సోర్సింగ్ ఉద్యోగికి బయోమెట్రిక్ వేయడంతో పాటు, ఈఎండీల నిర్వహణ బాధ్యతలు అప్పగించినట్టు కాంట్రాక్టర్లు ఆరోపిస్తున్నారు. కాగా కొందరు అధికారులు ఔట్ సోర్సింగ్ ఉద్యోగిపై అజమాయిషీ చెలాయించి, ఈఎండీలను పక్కదారి పట్టించి.. వారివారి సొంత ఖాతాల్లోకి మళ్లించుకున్నట్లుగా ఆరోపణలు ఉన్నాయి.

అవినీతి వ్యవహారం ఇలా వెలుగుచూసింది

వివిధ పనుల కాంట్రాక్టు కోసం ఈఎండీ చెల్లించిన కాంట్రాక్టర్లకు తిరిగి ఇవ్వడంలో తీవ్రజాప్యం జరిగింది. దీంతో కొందరు కాంట్రాక్ట ర్లు చాలాకాలం పాటు పబ్లిక్ హెల్త్ ఉన్నతాధికారుల చుట్టూ తిరిగారు. వారి నుంచి సరైన సమాధానం రాకపోవడంతో ఉన్నతాధికారులపై ఒత్తిడి తీసుకువచ్చారు. ఈ క్రమంలో ఈఎండీలు మా యమైన భాగోతం బయటపడినట్టు సమాచారం.  వాస్తవానికి కాంట్రాక్టర్లు పబ్లిక్ హెల్త్ విభాగం వరంగల్ సర్కిల్ కార్యాలయంలో ఇచ్చిన ఈఎండీలను ప్రభుత్వ బ్యాం కుల్లో డిపాజిట్ చేస్తుంటారు.

తిరిగి కాంట్రాక్టర్లకు ఈఎండీలను వాపస్ చేసేటప్పుడు అదే ప్రభుత్వ బ్యాంకు నుంచి కాంట్రాక్టరుకు ఆటోమేటెడ్ ఈ విధానంలో వాపస్ చేయాల్సి ఉంటుంది. అయితే ఈఎండీలు చెల్లించిన కాంట్రాక్టర్లకు ప్రభుత్వ బ్యాంకు ఖాతా నుంచి కాకుండా.. ప్రైవేటు వ్యక్తిగత ఖా తాల నుంచి ఈఎండీ మొత్తాలను చెల్లించడం గమనార్హం.

అంటే.. ప్రభుత్వ బ్యాంకు ఖాతల్లో ఉండాల్సిన ఈఎండీ మొత్తాలను ఇతర వ్యక్తిగత ఖాతాల్లోకి మళ్లించుకుని స్వాహా చేసిన ట్టుగా కాంట్రాక్టర్లు చెబుతున్నారు. మంచిర్యాల జిల్లాకు చెందిన ఒక కాంట్రాక్టరుకు ఇలా సు మారు రూ. 15 లక్షల వరకు ఈఎండీ మొత్తా న్ని ప్రైవేటు వ్యక్తిగత ఖాతా నుంచి చెల్లించడంతో మొత్తం వ్యవహారం బయటకు వచ్చిన ట్టుగా తెలుస్తోంది. 

ఉన్నతాధికారులు ఎక్కడ?

రూ.కోట్ల ఈఎండీలు దారి మళ్లినా వరంగల్ సర్కిల్ ఉన్నతాధికారులు, అటు హైదరాబాద్‌లోని పబ్లిక్ హెల్త్, ఎంఏయూడీ ఉన్నతాధికారుల నుంచి స్పందన కరువైందని కాంట్రాక్టర్లు ఆరోపిస్తున్నారు. లోతుగా విచారణ చేస్తే, అవినీతి అక్రమా లు మరిన్ని వెలుగుచూసే అవకాశం ఉంద ని అంటున్నారు. దీనిపై వివరణ కోసం వరంగల్ సర్కిల్ ఎస్‌ఈని, హైదరాబాద్‌లోని పబ్లిక్ హెల్త్ ఈఎన్‌సీలను ఫో నులో సంప్రదించేందుకు ప్రయత్నించగా వారు అందుబాటులో లేకపోవడం గమనార్హం.