ఆటో మీటర్ చార్జీలు పెంచాలి
- జిల్లా ఆటోలు నగరంలోకి వద్దు పోలీసులు ఫైన్లు వేయొద్దు
- ఎంజే మార్కెట్ చౌరస్తాలో ఆటోడ్రైవర్ల భారీ ధర్నా
- ఓ ఆటోడ్రైవర్ ఆత్మహత్యాయత్నం
- నిన్న ఆర్టీసీ వాళ్లతో మాట్లాడారు.. మరి మాతో మాట్లాడరా?
- కేసీఆర్ దేవుడు.. రేవంత్‌రెడ్డిది రానురాను మా బతుకే అయితదని మరో ఆటోడ్రైవర్ భావోద్వేగం
- భారీస్థాయిలో ట్రాఫిక్ జామ్
- నిన్న ఆర్టీసీ, ఇవాళ ఆటో డ్రైవర్లు నిరసన
సికింద్రాబాద్, ఏప్రిల్ 25 (విజయక్రాంతి): జిల్లా ఆటోలు నగరంలో తిప్పవ ద్దని, ఆటో మీటర్ చార్జీలు పెంచాలని, ట్రాఫిక్ పోలీసులు ఫైన్లు వేయొద్దని డిమాండ్ చేస్తూ.. హైదరాబాద్ నగరంలో ఆటో డ్రైవర్లు శనివారం ఒక్కసారిగా రోడ్డెక్కారు. నిన్న ఆర్టీసీ డ్రైవర్ల ఆందోళనలు కొనసాగగా, నేడు ఆటో డ్రైవర్లు తమ డిమాండ్ల సాధన కోసం ఎంజే మార్కెట్ చౌరస్తాను ముట్టడించారు. ఈ నిరసన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఓ ఆటో డ్రైవర్ తనపై డీజిల్ పోసుకుని నిప్పు పెట్టుకుని ఆత్మహత్యకు యత్నించాడు.
తోటి డ్రైవర్లు, పోలీసులు వెంటనే స్పందించి, అతడిని అడ్డుకోవడంతో పెనుప్రమాదం తప్పిం ది. ‘కేసీఆర్ దేవుడు.. రేవంత్‌రెడ్డిది రానురా ను మా బతుకే అయితది’ అంటూ మరో ఆ టోడ్రైవర్ భావోద్వేగానికి గురయ్యాడు. కాం గ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఉచితబస్ పథకంతో మా పొట్ట కొట్టిందని ఆగ్రహించాడు. నిన్న ఆర్టీసీ వాళ్లతో మంత్రులు మాట్లాడారని, మరి మాతో ఎప్పుడు మాట్లాడుతారని ప్రశ్నించాడు.
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఆటోడ్రైవర్లకు ఎన్నో హామీలు ఇచ్చిందని, అధికారంలోకి వచ్చాక, వాటిని అమలు చేయడం లేదని హైదరాబాద్ ఆటోడ్రైవర్లు ఆగ్రహించారు. ‘మా పొట్టకు ఆధారం మా ఆటోలు’ అని, కాంగ్రెస్ ప్రభుత్వం తీరువల్ల తమ ఉపాధిని తీవ్రంగా కోల్పోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. సికింద్రాబాద్, హైదరాబాద్‌లో ఎక్క డ ఆగాలనో తెలియడం లేదని, రోజూ ఫైన్లు చెల్లిస్తున్నామని ఆరోపించారు.
పెట్రోల్, గ్యాస్ ధరలు ఆకాశాన్ని తాకాయని, ప్రభు త్వం ఉచిత బస్సు పథకం వల్ల మాకు ఆదా యం మాత్రం అంతంతే వస్తుందని తమ బాధలను వివరించారు. ‘మేం రోజూ 12- నుంచి 14 గంటల వరకు రోడ్డు మీద శ్రమిస్తున్నాం. ప్రమాదాల్లో చనిపోతు న్నాం. రోగాలతో రోడ్లపై పడిపోతున్నాం’ అని ఆవేదన వ్యక్తం చేశారు. అయినా ప్రభుత్వం ఇచ్చి న హామీలు ఇంకెప్పుడు అమలు చేస్తుందని ప్రశ్నించారు. ఆర్టీసీ కార్మికుల డిమాండ్లను పరిష్కరించినట్లే ‘మాతో చర్చలు జరిపి, మా డిమాండ్లను నెరవేర్చాలి’ అని అన్నారు.
హామీలను ఇప్పుడే నెరవేర్చండి.. లేకపోతే, రోడ్ల మీదే ఉంటాం.. జై తెలంగాణ! ఆటో డ్రైవర్ల ఐక్యత జిందాబాద్! మా డిమాండ్లు న్యాయమైనవి అంటూ డ్రైవర్లు చేసిన నినాదాలతో ఆ ప్రాంతం మార్మోగిపోయింది. ఆ టోడ్రైవర్లు గంటకు పైగా ఎంజే మార్కెట్ చౌరస్తాలో ధర్నా చేశారు. దీంతో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. దీం తో కోఠి, ఆబిడ్స్, నాంపల్లి, అఫ్జల్‌గంజ్ పరిసర ప్రాంతాల్లో వాహనదారులు, ప్రయా ణికులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి, ఆటోడ్రైవర్లను సముదాయించి, ధర్నాను విరమిం పజేశారు.
రేవంత్‌రెడ్డిది రానురాను మా బతుకే..
కేసీఆర్ దేవుడు.. రేవంత్‌రెడ్డిది రానురాను మా బతుకే అయితది అంటూ ఓ ఆటోడ్రైవర్ భావోద్వేగానికి గురయ్యాడు. ‘నిన్న ఆర్టీసీ వాళ్లతో మంత్రులందరూ మా ట్లాడారు.. మరి మాతో మాట్లాడరా, మా కన్నీళ్లు తుడవరా.. అని రేవంత్ ప్రభుత్వాన్ని ప్రశ్నించాడు. మీరు ఇస్తాను అన్న రూ.12 వేలు మాకొద్దు.. జిల్లాలకు సంబంధించిన ఆటోలు హైదరాబాద్ సిటీలోకి రాకుండా చేయండి’ అదేచాలని విజ్ఞప్తి చేశాడు. మా బాధ ఎవరికి చెప్పుకోవాలి.. మా దగ్గరకు వచ్చి మాట్లాడరా.. మా కన్నీళ్లు తుడవరా..? జిల్లాల ఆటోలు ఔటర్ రింగ్ రోడ్డు లోపలికి రావొద్దని మీరే చెప్పారు.
మీ పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుందో అర్థం కావడం లేదు. ఇక్కడ వేల కొద్దీ జిల్లా ఆటోలే నడుస్తున్నా యి. గతంలో బాగుండే కేసీఆర్ ఉన్నప్పడు దేవుడిలెక్క ఆదుకున్నడు. ఆయన ఆటోవాళ్లకు ఫిట్నెస్ మాఫీ చేసిండు. రూ.35 వేలు ఆటో ఫిట్నెస్ డబ్బులు కడదామని నా భార్య బంగారం తాకట్టు పెట్టి డబ్బులు తీసుకుపోతే.. కేసీఆర్ మాఫీ చేస్తున్నాడని అధికారి చెప్తే నేను చాలా సంతోషించా. కానీ రేవంత్‌రెడ్డి మమ్మల్ని రోడ్డు మీద పడేశాడని ఆవే దన వ్యక్తం చేశాడు.
రేవంత్‌రెడ్డి మీ మనవడి దగ్గర పుట్ బాట్ ఆడేందుకు టైం ఉంది. మనవడికి ఫుట్ బాల్ ఆడుకోవడానికి పార్క్ కట్టించాడు. పేదల బతుకులు చూడవా రేవంత్‌రెడ్డి. రాహుల్ గాంధీ పెద్దచోర్.. పెద్దపెద్ద మాటలు మాట్లాడుతాడు. రేవంత్‌రెడ్డిది రానురాను మా బతుకే అయితది. రోడ్లపైకి వస్తే రాళ్లతో కొడ్తరని రేవంత్‌రెడ్డికి అర్థమైంది. సర్కార్ రాగానే కంచెలు బద్దలు కొట్టాం. ప్రజాపాలనలో ఎక్కడడైనా ధర్నా చేసుకోవచ్చన్నాడు. ఇప్పుడు ధర్నా చేస్తుంటే పోలీసులు ఈడ్చుకెళ్తున్నారన్నారు అని ఆటోడ్రైవర్ ఆవేదన వ్యక్తం చేశాడు.
ఆటో డ్రైవర్ల ప్రధాన డిమాండ్లు
తమ ప్రధాన డిమాండ్లను కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. జిల్లా పర్మిషన్ ఉన్న ఆటోలతో పాటు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు నగరంలో ఆటోలు నడుపుతుండటం వల్ల స్థానిక డ్రైవర్ల జీవనోపాధి దెబ్బతింటోందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా ఆటోలకు నగరంలో అనుమతి ఇవ్వకూడదని డ్రైవర్లు స్పష్టం చేశారు. ఆటో మీటర్లపై చార్జీలను పెంచాలని, ఆటోలకు ఉచిత రిజిస్ట్రేషన్ చేయాలని, పర్మిట్ ఫీజులు మాఫీ చేయాలని, ట్రాఫిక్ పోలీసులు ఫైన్లు వేయొద్దని, ఆటోస్టాండ్లు, పార్కింగ్ సౌకర్యాలను పెంచాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం మాకు ఆటోపార్కింగ్ కోసం స్థలాలు కేటాయించాలని, ఆటో డ్రైవర్లకు పెన్షన్, బీమా స్కీమ్‌లు అమలు చేయాలని కోరారు.






