26 April, 2026 | 3:44 AM

‘ఏరోస్పేస్’లో అగ్రస్థానమే లక్ష్యం

26-04-2026 02:01 AM
  1. ఈ రంగంలో ఇప్పటికే దేశంలో తెలంగాణ మొదటి స్థానం
  2.   2047 నాటికి ప్రపంచంలో నంబర్‌వన్‌గా రాష్ట్రం
  3. విక్రమ్--1 రాకెట్ పూర్తిగా హైదరాబాద్‌లోనే డిజైన్, డెవలప్ కావడం హర్షణీయం
  4. శ్రీహరికోటకు ‘విక్రమ్--1’ రాకెట్ తరలింపును జెండా ఊపి ప్రారంభించిన సీఎం రేవంత్, మంత్రి శ్రీధర్‌బాబు
  5. త్వరలోనే భారత తొలి ప్రైవేట్ ఆర్బిటల్‌ను ప్రయోగించనున్న స్కైరూట్ సంస్థ

హైదరాబాద్, ఏప్రిల్ 25 (విజయక్రాంతి): ఏరోస్పేస్ రంగంలో ప్రపంచంలోనే తెలంగాణ అగ్రగామిగా నిలుపడమే ప్రజాప్రభుత్వ లక్ష్యమని, ఇది 2047 నాటికి రాష్ట్రం సాధిస్తుందని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ఏరోస్పేస్ రంగంలో దేశంలో తెలంగాణ మొదటి స్థానంలో ఉందని, బో యింగ్, ఎయిర్బస్, సాఫ్రాన్ వంటి ప్రపంచ స్థాయి సంస్థలు ఇప్పటికే మన రాష్ట్రంలో ఉన్నాయని గుర్తుచేశారు.

స్కైరూట్ ఏరోస్పేస్ సంస్థ హైదరాబాద్ నగరంలోనే రూపకల్పన చేసి, అభివృద్ధి చేసిన ప్రైవేటు ఆర్బిటల్ రాకెట్ విక్రమ్--1ను శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రంలోని ప్రయోగశాలకు తరలించడానికి శనివారం పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబుతో కలిపి సీఎం రేవంత్‌రెడ్డి జెండా ఊపి, ప్రారంభించారు.

ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. హైదరాబాద్ మామిడిపల్లిలోని జీఎంఆర్ ఏరోస్పేస్ ఇండస్ట్రియల్ పార్క్‌లో నెలకొల్పిన స్కైరూట్ సంస్థకు చెందిన మాక్స్-క్యూ డిజైన్ ఫెసిలిటీలో విక్రం-1 రాకెట్‌ను రూపొందించడం, భారతదేశపు మొట్టమొదటి ప్రైవేటు ఆర్బిటల్ ప్రయోగానికి స్కైరూట్ సిద్ధంగా ఉండటం హర్షణీయమని అన్నారు.

ఈ సందర్భంగా స్కైరూట్ బృందాన్ని సీఎం ప్రశంసించారు. ఈ రాకెట్‌ను స్కైరూట్ హైదరాబాద్‌లో అభివృద్ధి చేయడం ఏరోస్పేస్ రంగంలో ఈ రాష్ట్ర వృద్ధికి ఇదొక మైలురాయి అని అభివర్ణించారు. ఈ సంస్థ 2022లో తన తొలి రాకెట్‌ను ప్రయోగించిందని, అయితే, ఇంత తక్కువ సమయంలోనే ఆర్బిటల్ ప్రయోగ దశకు చేరుకోవడం అభినందనీయమన్నారు. 2047 నాటికి ఏరోస్పేస్ రంగంలో ప్రపంచ అగ్రగామిగా నిలవాలన్నది తెలంగాణ లక్ష్యమని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు.

ఏరోస్పేస్ రంగాన్ని ఒక కీలక వృద్ధి రంగంగా తమ ప్రభుత్వం పరిగణిస్తున్నట్టు వివరించారు. డిసెంబర్ 2023 నుంచి ఇంజనీరింగ్ ఎగుమతుల్లో తెలంగాణ అసాధా రణ వృద్ధి నమోదు చేసిందన్నారు. కేంద్ర ప్రభుత్వ గణాంకాల ప్రకారం, 2023-24, 2024--25 మధ్యలో దేశంలోనే ఇంజనీరింగ్ ఎగుమతుల్లో తెలంగాణ 117.9 శాతం అత్యధిక వృద్ధిని నమోదు చేసిందన్నారు. అయితే, ఈ వృద్ధికి విమాన విడిభాగాలు, రక్షణ పరికరాలే ప్రధానంగా దోహద పడ్డాయన్నారు.

ప్రపంచ విశ్వవిద్యాలయాలు, పారిశ్రామిక దిగ్గజాలతో భాగస్వామ్యాల ద్వారా ఏరోస్పేస్ రంగం అవసరాల కోసం యువతకు నైపుణ్య శిక్షణ ఇచ్చేందుకు అవసరమైన చర్యలపై తమ ప్రజాప్రభుత్వం దృష్టి సారిస్తుందన్నారు. అందుకు అవసరమైన విధానాలు, మౌలిక సదుపాయాలు, ప్రతిభతో స్కైరూట్ వంటి కంపెనీలకు మద్దతు ఇవ్వడానికి తమ ప్రభుత్వం ముందుంటుందని తెలిపారు.

యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ, అడ్వానస్డ్ టెక్నాలజీ సెంటర్లు (ఏటీసీలు) త్వరలో ఉన్నతీకరించబడనున్న పాలిటెక్నిక్ కళాశాలల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ నైపుణ్య శిక్షణలను ఆయన వివరించారు. పరిశ్రమల అవసరాలకు అనుగు ణంగా, ఏటీసీలను, పాలిటెక్నిక్ కళాశాలలు, రెండింటినీ స్కిల్స్ యూనివర్సిటీ పరిధిలోకి తీసుకొస్తామన్నారు. ఈ సంస్థల్లో శిక్షకులకు అత్యుత్తమ శిక్షణ ఇవ్వడంపైనే తాము దృష్టి కేంద్రీకరించినట్టు వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఏటీసీల్లో సిబ్బందికి టాటా టెక్నాలజీస్ ఇప్పటికే శిక్షణ అందిస్తున్నట్టు వివరించారు.

పల్లేపల్లి ఏటీసీని సందర్శించండి

ఇక హైదరాబాద్‌లోని మల్లేపల్లిలో ఉన్న ఏటీసీని సందర్శించాల్సిందిగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్కైరూట్ సంస్థను ఆహ్వానించారు. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు పాఠ్యప్రణాళికను మార్చడంలో స్కిల్స్ యూనివర్సిటీ కల్పిస్తున్న వెసులుబాటును ఆయన గుర్తుచేశారు. ఇక రాష్ట్ర పాఠశాల విద్యా వ్యవస్థలో ని లోపాలను పరిష్కరించడానికి ప్రభుత్వం చేపట్టిన ప్రణాళికల గురించి కూడా సీఎం ప్రస్తావించారు.

ప్రభుత్వ పాఠశాలల్లో ప్రతి విద్యార్థిపై సంవత్సరానికి రూ.1.08 లక్షలు ఖర్చు చేస్తున్నప్పటికీ, ఫలితాలు ఆశించిన స్థాయిలో రావడం లేదన్నారు. దీనిని పరిష్కరించడానికి తాము ఒక సమగ్ర ప్రణా ళికను రూపొందించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి బీ అజిత్‌రెడ్డి, స్కైరూట్ సహ వ్యవ స్థాపకుడు, సీఓఓ నాగభరత్ డాకా తదితరులు పాల్గొన్నారు.

యూఐఎస్‌యూతో మేము సైతం..: స్కైరూట్

 సీఎం రేవంత్‌రెడ్డి సూచనకు స్పందనగా.. స్కైరూట్ ఏరోస్పేస్ సీఈఓ, కోఫౌండర్ పవన్‌కుమార్ చందన, యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ (యూ ఐఎస్‌యూ)తో కలిసి పనిచేస్తామని తెలిపారు. స్కిల్స్ యూనివర్సిటీ ఆలోచన ప్రత్యేకమైనదని పేర్కొన్నారు. స్కిల్స్ యూనివర్సిటీ ద్వారా తమకు అవసరమైన ప్రతిభావంతులు దొరకడం సుగమం అవుతుందని పవన్‌కుమార్ అన్నారు. పరిశ్రమలుగా తాము ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య నైపుణ్యం, శిక్షణే అని ఆయన చెప్పారు. స్కిల్స్ యూనివర్సిటీతో భాగస్వామ్యం కావడం తమకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందన్నారు.