సీఎం రేవంత్‌రెడ్డి కార్మికుల పక్షపాతి
ప్రభుత్వ విప్ వేముల వీరేశం
ఆర్టీసీ కార్మికులపై బీఆర్‌ఎస్‌కు మాట్లాడే హక్కు లేదు
ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ
హైదరాబాద్, ఏప్రిల్ 25 (విజయక్రాంతి): ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కార్మికుల పక్షపాతి అని మరోసారి రుజువైందని ప్రభుత్వ విప్ వేముల వీరేశం అన్నారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలపై తమ ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందన్నారు. శనివారం వేముల సీఎల్పీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ చర్చలను సానుకూలం చేసిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్ , కార్మిక సంఘాల నాయకులకు ధన్యవాదాలు తెలిపారు.
ఆర్టీసీ డ్రైవర్ శంకర్‌గౌడ్ మరణం బాధాకరమని, ఆయన కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకుంటుందని, సీఎం రేవంత్‌రెడ్డి మానవీయ కోణంతో ఆలోచించారని వేముల తెలిపారు. ఆర్టీసీ కార్మికులను అడ్డుపెట్టుకొని రాజకీయాలు చేయాలని కొందరు చూశారని మండిపడ్డారు. గతంలో ఆర్టీసీ యూనియన్ గౌరవ అధ్యక్షుడుగా పనిచేసిన వాళ్ళు కార్మికులను తప్పుదోవ పట్టించాలని ప్రయత్నించారన్నారు.
గతంలో ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తే పట్టించుకొని వాళ్లు ఇప్పుడు మొసలికన్నీరు కారుస్తున్నారని, ఆర్టీసీ కార్మికుల పట్ల వాళ్ళు శనీశ్వరులుగా దాపురించారని విమర్శించారు. కార్మికుల గురించి మాట్లాడే హక్కు బీఆర్‌ఎస్‌కు లేదని మానకొండూరు ఎమ్మెల్యే, పీసీసీ ఎస్సీసెల్ చైర్మన్ కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. గతంలో ఆర్టీసీ కార్మికుల సమ్మె చేసి ఆత్మహత్యలు చేసుకున్నా పట్టించుకోలేదని మండిపడ్డారు. కార్మిక సంఘాలను రద్దు చేయడంతో పాటు యూనియన్ నేతలను సస్పెండ్ చేశారని గుర్తు చేశారు. తమది మానవీయ పాలన అయితే బీఆర్‌ఎస్ ది నియంతపాలన అన్నారు. బీఆర్‌ఎస్‌ను కార్మికులు ఎన్నటికీ నమ్మరని పేర్కొన్నారు






