25 February, 2026 | 8:41 PM

ఇటుక బట్టీ ప్రమాదం – డ్రైవర్ మృతి కేసులో యజమాని నిర్లక్ష్యం బట్టబయలు

25-02-2026 06:45 PM

నిందితుడు రిమాండ్‌కు తరలింపు – ట్రాక్టర్, మొబైల్ స్వాధీనం

చివ్వెంల,(విజయక్రాంతి): చివ్వెంల పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ట్రాక్టర్ ప్రమాదంలో డ్రైవర్ మృతి చెందిన ఘటనలో యజమాని నిర్లక్ష్యం కారణమని పోలీసు విచారణలో వెల్లడైంది. పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ఈ నెల 23వ తేదీ ఉదయం సుమారు 11:00 గంటల సమయంలో వల్లభాపురం గ్రామం శివారులో లోగిలి హోటల్ సమీపంలోని శ్రీ శ్రీనివాస్ లైట్ వైట్ రెడ్ బ్రిక్స్ ఇటుక బట్టీలో పనిచేస్తున్న డ్రైవర్ పల్లపు రాజు ట్రాక్టర్ (AP 15 AG 5094) తో మట్టిని తొక్కిస్తుండగా వాహనం అదుపుతప్పి పూర్తిగా ఓవర్‌టర్న్ అయింది.

ట్రాక్టర్ డ్రైవర్‌పై పడటంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు దురాజ్ పల్లి గ్రామం నివాసి కాగా, తండ్రి తిరపయ్య వయస్సు 40 సంవత్సరాలు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులకు, ఇటుక బట్టీ యజమాని చల్లా నాగరాజు ట్రాక్టర్‌ను సరైన విధంగా నిర్వహించకపోవడం, రిజిస్ట్రేషన్ గడువు ముగిసినా రెన్యువల్ చేయకపోవడం, ఇన్సూరెన్స్ లేకుండా వినియోగించడం వంటి నిర్లక్ష్యాలు వెలుగులోకి వచ్చాయి. ట్రాక్టర్ యజమాని అయిన అతని తండ్రి ఏడుకొండలు కూడా బాధ్యతారాహిత్యంగా వ్యవహరించినట్లు పోలీసులు తెలిపారు.

ట్రాక్టర్‌కు తరచూ రిపేర్లు వస్తున్నాయని తెలిసినా వాటిని పట్టించుకోకపోవడంతో పాటు, ప్రమాదం జరిగిన రోజున ఎక్కువ ఆర్డర్లు ఉన్నాయని డ్రైవర్‌ను ప్రమాదకర పరిస్థితుల్లో పనికి పిలిపించడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకున్నట్లు విచారణలో తేలింది. ప్రమాదంలో ఉపయోగించిన John Deere కంపెనీకి చెందిన ట్రాక్టర్ (AP 15 AG 5094)ను, అలాగే నిందితుడి వద్ద ఉన్న Redmi 5G మొబైల్ ఫోన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితుడిని రిమాండ్ నిమిత్తం కోర్టులో హాజరుపరిచారు. ఈ కేసు దర్యాప్తులో రూరల్ సీఐ G. రాజశేఖర్, చివ్వెంల ఎస్‌ఐ మాహేశ్వర్ మరియు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.