ఎన్ని పార్టీలు వచ్చినా బీజేపీకి ఇబ్బందిలేదు
- రాష్ట్రంలో మా పార్టీకి అనుకూల పరిస్థితులు
- కేఏ పాల్ కూడా పార్టీ పెట్టారు
- గత టీఆర్‌ఎస్, బీఆర్‌ఎస్‌కి పుట్టబోయే బిడ్డపేరూ టీఆర్‌ఎస్సే
- బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు
హైదరాబాద్, ఏప్రిల్ 25 (విజయక్రాంతి): ఈరోజు రాజకీయాల్లో మార్పులు వేగంగా చోటుచేసుకుంటున్నాయని, పార్టీ లు పెట్టడం సులభమైపోయిందని, కానీ ప్ర జల కోసం నిజంగా పని చేసే పార్టీ ఏది అనేది ప్రజలు గమనిస్తున్నారని, ఎన్ని కొత్త పార్టీలు వచ్చినా బీజేపీకి ఇబ్బంది లేదని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు పేర్కొన్నారు. గతంలో కేఏ పాల్ కూడా పార్టీ పెట్టారని పరోక్షంగా కవితను ఎద్దేవా చేశారు. ప్రజల సంక్షేమాన్ని నిజాయితీగా ఆలోచించే పార్టీ బీజేపీ మాత్రమే అన్నారు.
గత 12 సంవత్సరాలుగా ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశంలో అవినీతి రహిత పాలన కొనసాగుతోందన్నారు. శనివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పండిట్ దీన్‌దయాల్ ప్రశిక్షణ అభియాన్ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. టీఆర్‌ఎస్, బీఆర్‌ఎస్ పేర్లు మారినా పాలన మారలేదని, గత టీఆర్‌ఎస్, బీఆర్‌ఎస్‌కి పుట్టబోయే బిడ్డ పేరు కూడా టీఆర్‌ఎస్సేనని విమర్శించారు. రాష్ట్ర సంపదను దోచుకున్న వారే ఇప్పుడు ప్రజల ముందుకు వస్తున్నారన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో బీజేపీకి అను కూల పరిస్థితులు నెలకొన్నాయన్నారు.
కార్యకర్తల ఐక్యత, పార్టీ సిద్ధాంతంపట్ల నిబద్ధత, కృషి.. ఈ మూడు కలిస్తే రాబోయే రోజుల్లో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమన్నా రు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ నుంచి రూ.1000 కోట్లు ఢిల్లీ కాంగ్రెస్ అధిష్టానానికి పంపిస్తామని చెబుతున్నారు. అయితే అందులో కనీసం రూ.500 కోట్లు ఉద్యోగుల సంక్షేమానికి కేటాయించాలనే ఆలోచన ఎందుకు రావ డం లేదు? అని ప్రశ్నించారు.
దేశంలోనూ, రాష్ట్రంలోనూ అవినీతి రహిత పాలన అందించగల ప్రత్యామ్నాయం బీజేపీ మాత్రమేనని చెప్పారు. రాబోయేది బీజేపీ ప్రభుత్వమే అన్న విశ్వాసంతో కార్యకర్తలు కష్టపడాలని సూచించా రు. తెలంగాణ సాధన సమయంలో పార్లమెంట్‌లో అప్పటి టీఆర్‌ఎస్ ప్రతినిధులు గైర్హాజరయ్యారని, కాంగ్రెస్ పార్టీ కూడా పూర్తిస్థాయిలో పోరాడలేదని, తెలంగాణ కోసం నిజాయితీగా పోరాడింది బీజేపీ మాత్రమే అన్నారు.
పార్టీ శిక్షణా కార్యక్రమాల్లో భాగంగా ఇప్పటికే మండల స్థాయి లో 50 వేల మందికి పైగా కార్యకర్తలు శిక్షణ పొందారు. ఈ సమావేశంలో బీజేఎల్పీ నాయకుడు మహేశ్వర్ రెడ్డి, ఎంపీ ధర్మపురి అర్వింద్, ఎమ్మెల్సీ అంజిరెడ్డి, ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి, బీజేపీ కర్ణాటక తమిళనాడు రాష్ట్రాల సహా ఇంచార్జి పొంగులేటి సుధాకర్ రెడ్డి , రాష్ట్ర సంస్థాగత ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ తివారీ, పార్టీ జిల్లా అధ్యక్షులు, ప్రభారీలు, ఇతర ముఖ్య నాయకులు, రాష్ట్ర పదాధికారులు పాల్గొన్నారు.
మహిళా సమ్మేళనాలు...
అనంతరం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా. ఎన్. గౌతం రావు సమావేశం వివరాలను వివరిస్తూ..సంస్థాగత బలోపేతంలో భాగంగా దేశవ్యాప్తంగా సభ్యత్వ నమోదు కార్యక్రమం విజయవంతంగా పూర్తయిందని, ప్రస్తుతం పార్టీ శిక్షణ కార్యక్రమాలపై దృష్టి సారించిందని తెలిపారు. తెలంగాణలో ఇప్పటికే మండల స్థాయి శిక్షణ కార్యక్రమాలు 98 శాతం పూర్తయ్యాయని, ఈ సమావేశంలో వాటిపై సమగ్ర సమీక్ష నిర్వహించినట్లు పేర్కొన్నారు.
ఈ క్రమంలోనే మే 1వ తేదీ నుంచి జిల్లా స్థాయి శిక్షణ కార్యక్రమాలను ప్రారంభించాలని నిర్ణయించామని, ఇందుకోసం ప్రతి జిల్లాకు ప్రత్యేక ంగా ఒక ప్రభారీని నియమించినట్లు వెల్లడించారు. మే 5వ తేదీ లోపు అసెంబ్లీ యూనిట్ స్థాయి వరకు మిగిలిన అన్ని శిక్షణ కార్యక్రమాలను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టు కున్నట్లు ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే వరకు బీజేపీ ప్రజల పక్షాన నిలిచి రాజీలేని పోరాటం చేస్తుందని గౌతం రావు ప్రకటించారు.
ముఖ్యంగా మహిళా రిజర్వేషన్ బిల్లును వ్యతిరేకించిన కాంగ్రెస్ పార్టీ వైఖరిపై మహిళల్లో తీవ్ర ఆగ్రహం ఉందన్నారు. వారికి అండగా నిలిచేందుకు జిల్లా , మండలాల వారీగా మహిళా సమ్మేళనాలు నిర్వహించి, అందరినీ ఒకే వేదికపైకి తీసుకువస్తామని తెలిపారు. ఇందులో భా గంగానే రాష్ట్రవ్యాప్తంగా జిల్లాలు, మండలాల వారీగా మహిళా సమ్మేళనాలు నిర్వ హించి, మహిళా రిజర్వేషన్ బిల్లు అమలు దిశగా ఉద్యమిస్తామని పిలుపునిచ్చారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు వీరేందర్ గౌడ్ , వేముల అశోక్, మీడి యా ప్యానలిస్ట్ మహేష్ పాల్గొన్నారు.






