26 April, 2026 | 3:45 AM

కుటుంబ రాజకీయాలు.. కొత్త సమీకరణాలు

26-04-2026 02:11 AM
  1. కీలకంగా మారనున్న కవిత తెలంగాణ రాష్ట్ర సేన
  2. తెలంగాణ రాజకీయాల్లో టర్నింగ్ పాయింట్
  3. బీసీలు, మహిళలు, యువతను ఆకర్షించడమే ప్రధానం
  4. అసంతృప్త వర్గాలకు అవకాశంగా పార్టీ
  5. కుటుంబంలో చీలిక.. తల్లిదండ్రులకు మనోవేదన

హైదరాబాద్, ఏప్రిల్ 25 (విజయక్రాంతి): కల్వకుంట్ల కవిత తెలంగాణ రాష్ట్ర సేన (టీఆర్‌ఎస్) పేరిట కొత్త పార్టీని ప్రారంభించడం తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చకు దారి తీస్తుంది. గతంలో విజయశాం తి వంటి నాయకురాలు పార్టీని ప్రారంభించి, తర్వాత కాలంలో ఆ పార్టీని టీఆర్ ఎస్‌లో విలీనం చేశారు. అయితే.. ప్రస్తుతం మరోసారి మహిళా నాయకత్వంలో కొత్త పార్టీ పురుడు పోసుకోవడం ఆసక్తికరంగా మారింది.

ముఖ్యంగా మహిళా కేంద్రిత నాయకత్వంలో స్త్రీ శక్తికి మెరుగైన అవకాశాలు లభిస్తాయనే సంకేతాలు మహిళల్లో ఆశలు రేకెత్తిస్తున్నప్పటికీ, వారికి నిజంగా ప్రాధాన్యం దక్కుతుందా.. అనే ప్రశ్న తలెత్తుతున్నది. మహిళా సాధికారతను అజెండాగా తీసుకుంటున్న ఈ ప్రయత్నం, మాటల్లో కాకుండా కార్యాచరణలో ఎలా ప్రతిబింబిస్తుందన్నదే కీలకమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రాజకీయంగా మహిళలకు టికెట్లు, కీలక పదవులు ఇవ్వడం ద్వారా మాత్రమే నిజమైన ప్రోత్సాహం కనిపిస్తుందని అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ఈ నేపథ్యంలో కవిత నాయకత్వంలో కొత్త పార్టీలో మహిళలకు ఎంత స్థానం కల్పిస్తారనేది అంశం ఆసక్తికరంగా మారింది. అయి తే.. కవిత మాజీ సీఎం కేసీఆర్ కూతురు కావడంతో ఆయన రాజకీయ అనుభవం, వ్యూహాత్మక ఆలోచన వారసత్వం ఆమెకు ప్రధాన బలంగా మారతాయని అభిప్రాయం వ్యక్తమవుతున్నది. కవిత తన పార్టీ పేరును టీఆర్‌ఎస్‌గా ప్రకటించడంతో పార్టీ గుర్తుపై కూడా ఆసక్తికరమైన చర్చ తెర పైకి వచ్చింది.

కవిత టీఆర్‌ఎస్ పార్టీ గుర్తు కూడా బీఆర్‌ఎస్ కారుకు గుర్తుకు దగ్గరగా ఉంటే క్యాడర్‌లో కొంత గందరగోళ పరిస్థితులు నెలకొనే అవకాశం ఉంది. ఈ పరిస్థితి ఎదురైతే టీఆర్‌ఎస్ పార్టీకి ఓటర్లను కనెక్ట్ కావడం కొంత సులభతరం అవుతుందని అంచనా లు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా ఇతర పార్టీల్లో టికెట్టు దక్కని నేతలు, ముఖ్యంగా యువ నాయకులే పార్టీ నిర్మాణంలో కీలకంగా మారతారు.

ప్రస్తుతం కవిత ప్రారం భించిన కొత్త పార్టీ బీఆర్‌ఎస్‌లో ఉన్న అసంతృప్త నాయకులను ఆకర్షించే ప్రయత్నం చేయవచ్చని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దీంతో కొత్త పార్టీకి ప్రారంభ దశలోనే ఒక బలమైన కేడర్ ఏర్పడే అవకాశం కనిపిస్తోంది. దీంతోపాటు తాజా ఆలోచనలతో ముందుకు రావడం టీఆర్‌ఎస్ నాయకత్వానికి కలిసి వచ్చే అం శంగా మారవచ్చు. అదనంగా ప్రారంభం నుంచి భారీగా కేడర్‌తో ప్రజల్లోకి వెళ్లడం ద్వారా వేగంగా గుర్తింపు పొందే వ్యూహం కూడా స్పష్టంగా కనిపిస్తోంది.

అయితే పార్టీ ప్రకటన సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని వర్గాలకు సం బంధించిన నాయకులు, వృత్తిదారులు, కుల సంఘాల నాయకులకు స్థానం కల్పించడంతో పార్టీ వైఖరి స్పష్టమవుతోంది. మొ త్తంగా టీఆర్‌ఎస్ పార్టీ సాధారణ రాజకీయ పార్టీ ప్రారంభం లాగా కాకుండా వ్యూహాత్మకంగా రూపుదిద్దుకుంటున్న కొత్త రాజకీయ శక్తిగా ఎదిగేందుకు అవకాశాలున్నాయని అంచనాలు వెలువడుతున్నాయి.

కీలకంగా మీడియా మేనేజ్‌మెంట్.. 

తెలంగాణ రాజకీయాల్లో మారుతున్న పరిస్థితుల మధ్య, కొత్త పార్టీ నాయకత్వం మీడియా మేనేజ్‌మెంట్‌పై ప్రత్యేక దృష్టి పెట్టినట్టు కనిపిస్తోంది. చిన్నా పెద్దా మీడి యా సంస్థలు అనే భేదం లేకుండా అన్నింటినీ సమాన దృష్టితో చూస్తోంది. అన్ని మీడియా సంస్థలను పార్టీకి సంబంధించిన ప్రకటనల ద్వారా సాఫ్ట్ కార్నర్‌లోకి తీసుకురావడం ఈ వ్యూహంలో కీలకంగా మారిం ది. ప్రారంభ దశలోనే ప్రచార బలం పెంచుకోవడం, వార్తలలో సానుకూలత సాధించ డం లక్ష్యంగా ఈ చర్యలు సాగుతున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు.

తాజా పరిణామాలతో పోల్చుకుంటే, గతంలో కనిపించిన మీడియా దూరం ఇప్పుడిప్పుడే మారుతున్నట్టు సంకేతాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా జగిత్యాల సమావేశంలో సీ విద్యాసాగర్‌రావు చేసిన వ్యాఖ్యలు పెద్ద చర్చకు దారితీ శాయి. నాలుగు పత్రికలు తప్ప మరేవి చదవను అని చెప్పడం ద్వారా మీడియాతో ఒక విధమైన దూరం ఉన్నట్టుగా భావన కలిగింది.

అయితే, ఇదే సమయంలో కొత్తగా ప్రారంభమైన టీఆర్‌ఎస్ నాయకురాలు కవిత మాత్రం పూర్తి విరుద్ధ దిశలో అడుగులు వేస్తున్నట్టు కనిపిస్తున్నారు. మీడియాను దూరంగా ఉంచడం కంటే, దగ్గర చేసుకుని ప్రచారంలో భాగస్వామ్యం చేయడం అనే వ్యూహాన్ని అమలు చేస్తున్నారు. ప్రకటనల రూపంలో మద్దతు ఇవ్వడం ద్వారా మీడియాతో సాన్నిహిత్యం పెంచే ప్రయత్నం జరు గుతోందని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

పరీక్షగా బీజేపీపై విమర్శలు 

కొత్తగా పార్టీని ప్రారంభించిన కల్వకుంట్ల కవిత కేంద్ర ప్రభుత్వంలో పటిష్టంగా ఉన్న బీజేపీపై గట్టిగా విమర్శలు చేయగలరా? అన్నది కీలకమైన పరీక్షగా మారింది. రాజకీయ ధైర్యంతో పాటు స్పష్టమైన వ్యూహం అవసరమైన ఈ విషయంలో, ప్రస్తుత పరిస్థితుల్లో నేరుగా తీవ్ర దాడులు చేయడం కొంతమేర కష్టమేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కుటుంబ రాజకీయాలు, పాత సంబంధాలు ఒకవైపు ప్రభావం చూపే అవకాశం ఉండగా, బీజేపీతో నేరుగా తలపడితే ప్రమాదం కూడా ఎక్కువగానే ఉంటుం ది.

అందుకే సానుకూలంగా, అంశాల ఆధారంగా విమర్శలు చేసే దిశగా వెళ్లే అవకాశమే ఎక్కువగా కనిపిస్తోంది. అయితే తెలంగాణలో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగాలంటే బీజేపీపై స్పష్టమైన స్టాండ్ తప్పనిసరి అన్న అభిప్రాయం వ్యక్తమవుతున్నది. ప్రజల్లో నమ్మకం పెంచుకోవాలంటే మాటల్లోనే కాకుండా చర్యల్లో కూడా స్పష్టత అవసరం. మొత్తంగా, బీజేపీపై విమర్శల విషయంలో టీఆర్‌ఎస్ పార్టీ తీసుకునే వైఖరి ఆ పార్టీ రాజకీయ భవిష్యత్‌ను నిర్ణయించే కీలక అంశంగా మారనుంది. 

బీసీలకు నిజమైన అవకాశాలుంటాయా?..

పార్టీ ప్రారంభించిన కవిత ముందున్న కీలక సవాళ్లలో బీసీ వర్గాల నాయకులను ఎంతవరకు ముందుకు తీసుకువస్తుందన్నదే ప్రధానమైనది. తెలంగాణ రాజకీయాల్లో బీసీ వర్గాలు కీలక పాత్ర పోషిస్తున్నప్పటికీ, వారికి తగిన స్థాయి ప్రాతినిధ్యం దక్కలేదన్న విమర్శలు ఎప్పటికప్పుడు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో, కొత్త వేదిక నిజంగా సామాజిక సమతుల్యతను ప్రతిబింబించాలంటే బీసీ వర్గాలకు టికెట్లు, కీలక పదవుల్లో గణనీయమైన భాగస్వామ్యం కల్పించాల్సిన అవసరం ఉందని విశ్లేషకులు సూచిస్తున్నారు.

ఇక యువ నాయకత్వం విషయానికి వస్తే, ఇది మరో కీలక అంశంగా మారింది. ఇప్పటి వరకు చాలా పార్టీల్లో యువతకు పరిమిత అవకాశాలే లభించాయి. అదే అసంతృప్తి కొత్త రాజకీయ వేదికలకు బలం అవుతోంది. ఈ పరిస్థితిని ఉపయోగించుకుని, యువ నాయకులకు టికెట్లు ఇవ్వడం, పార్టీ నిర్మాణంలో బాధ్యతలు అప్పగించడం ద్వారా కొత్త శక్తిగా ఎదగడానికి అవకాశం ఉందని భావిస్తున్నారు.

ప్రత్యేకంగా బీఆర్‌ఎస్‌లో టికెట్లు రాని వారు, ఎదగడానికి అవకాశం లేక అసంతృప్తిగా ఉన్న యువ నాయకులు ఈ పార్టీ వైపు మొగ్గు చూపే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అయితే ఇది కేవలం మాటల్లోనే కాకుండా, నిజంగా అవకాశాలు కల్పించడంలో కనిపించాలి. బీసీల కు, యువతకు స్పష్టమైన ప్రాధాన్యం, నిర్ణయాల్లో భాగస్వామ్యం కల్పిస్తేనే ఈ కొత్త రాజకీయ ప్రయత్నం విస్తృతంగా ప్రజల్లో ఆదరణ పొందే అవకాశం ఉంది. లేకపోతే ఇది కూడా మరో సాధారణ రాజకీయ వేదికగానే మిగిలిపోతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

బీసీలతోపాటు బీఆర్‌ఎస్‌లోని అసంతృప్తులను ఆకర్షించడం అంత సులభమేమీ కాదు. ప్రస్తుత రాజకీయ పరిణామాల దృష్ట్యా చాలా మంది నాయకులు వెంటనే నిర్ణయం తీసుకునే అవకాశం లేదు. అయితే వారి రాజకీయ భవిష్యత్‌పై సరైన హామీ ఇస్తే కొంత మంది కీలక నాయకులు పార్టీ మారడానికి మొగ్గుచూపుతారని విశ్లేషకులు చెబుతున్నారు. కాంగ్రెస్ పార్టీ కూడా అధికారంలో ఉన్నప్పటికీ, టికెట్లు, పదవుల విషయంలో అసంతృప్తి ఉన్న నేతలు బయటకు వచ్చే అవకాశాలున్నాయి. కొత్త పార్టీ ప్రత్యామ్నాయంగా కనిపిస్తే, వారు ఆకర్షితులు కావచ్చు. 

అటు కేసీఆర్, కేటీఆర్.. ఇటు రేవంత్‌రెడ్డిపై విమర్శలు..

కల్వకుంట్ల కవిత మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి కేటీఆర్‌పై విమర్శలు చేయడం ప్రారంభిస్తే, అది తెలంగాణ రాజకీ యాల్లో పెద్ద మార్పుకు సంకేతంగా భావించ వచ్చు. కుటుం బ అనుబంధాలను పక్కనపెట్టి నేరుగా రాజకీయంగా దాడి చేయడం ద్వారా సొంతంగా ఇమేజ్‌ను నిర్మించుకునే ప్రయత్నంగా దీనిని భావించవచ్చు. ఇలాం టి విమర్శలు కేవలం రాజకీ య వ్యూహం మాత్రమే కాకుండా, తనదైన దారిలో ముందుకు వెళ్తున్నట్టు స్పష్టం చేసే చర్యగా కూడా కనిపిస్తాయి.

ప్రత్యేకంగా బీఆర్‌ఎస్‌లో అసంతృప్తిగా ఉన్న వర్గాలకు ఇది బలమైన సందేశం ఇస్తుంది. అయితే ఈ విమర్శలు ఏ స్థాయి వరకు ఉంటాయి, భవిష్యత్‌లోనూ కొనసాగుతాయా లేక పరిమిత స్థాయిలోనే ఉంటాయా అనే అంశంపై ఇంకా స్పష్టత రావాల్సిన అవసరం ఉంది. మొత్తంగా, కేసీఆర్, కేటీఆర్‌పై విమర్శలు ప్రారంభమైతే అది కేవలం వ్యక్తిగత విమర్శలకే పరిమితం కాకుండా, తెలంగాణ రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు దారి తీసే అవకాశముంది.

అటు ప్రభుత్వంలో ఉన్న రేవంత్ రెడ్డిపై ఎంతమేర విమర్శలు చేస్తారనేది కూడా ఆసక్తికరంగానే ఉంది. ప్రత్యక్ష రాజకీయ పోటీ కారణంగా రేవంత్‌రెడ్డిపై విమర్శలు చేయడం తప్పనిసరి పరిస్థితిగా కనిపిస్తున్నప్పటికీ, ఒక స్థాయి దాటి దాడి చేస్తుందా అన్నది కీలక ప్రశ్నగా నిలుస్తోంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై విధానాల పరంగా, పాలనలోని లోపాలపై విమర్శలు చేసే అవకాశం ఎక్కువగా ఉందని విశ్లేషకులు అంటున్నారు.

అయితే వ్యక్తిగతంగా తీవ్ర విమర్శలు చేయడం కంటే, రాజకీయంగా లెక్కలు వేసుకుని పరిమిత విమర్శలతో ముందుకు వెళ్లే అవకాశమే ఎక్కువగా కనిపిస్తోంది. మరోవైపు, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేయకుండా ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగడం కూడా కష్టమే అవుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. 

కుటుంబంలో చీలిక.. తల్లిదండ్రులకు మనోవేదన

టీఆర్‌ఎస్ పార్టీని ప్రారంభించి తెలంగాణ రాజకీయాల్లో కవిత సంచలనం సృష్టించినప్పటికీ, ఈ పరిణామం ఆమె తల్లిదండ్రులకు తీరని ఆవేదన అవకాశం ఉంది. కొత్త పార్టీని ప్రారంభించడం తల్లిదండ్రులు కేసీఆర్, శోభకు ఏమాత్రం మింగుడు పడని ఆంశం. కేసీఆర్ టీఆర్‌ఎస్‌ను ప్రారంభించినప్పటి నుంచి కేటీఆర్, కవిత కలిసి కట్టుగా ఉన్నప్పటికీ, ఇప్పుడు రాజకీయంగా వారి దారులు వేరయ్యాయి.

ఈ పరిణామం కేవలం రాజకీయాలకే పరిమితం కాకుండా, కుటుంబంపైనా తీవ్ర ప్రభావం చూపే పరిస్థితి ఉంది. ఈ విషయం వారి మధ్య అత్యంత సున్నితమైన దశగా మారే అవకాశం ఉంది. ఒకవైపు తన రాజకీయ వారసత్వం, మరోవైపు తన పిల్లల మధ్య ఏర్పడే విభేదాలు మధ్య సమతుల్యత సాధించడం తల్లిదండ్రులకు కష్టసాధ్యంగా మారవచ్చు. ఈ విభేదాలు కొత్త సమీకరణాలకు దారి తీసే అవకాశమూ ఉంది.

ఒకే కుటుంబం నుంచి రెండు వేర్వేరు రాజకీయ శక్తులు రావడం వల్ల ఓటు బ్యాంక్ విభజన, కేడర్‌లో గందరగోళం, నాయకుల వైఖరిలో మార్పులు వంటి పరిణామాలు చోటుచేసుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా బీఆర్‌ఎస్ కేడర్ ఎవరిని అనుసరించాలి అన్న సందిగ్ధంలో పడే అవకాశం ఉందని విశ్లేషకులు అంటున్నారు. తెలంగాణ రాజకీయాల్లో ఒక కొత్త అధ్యాయానికి నాంది పలికే ఘట్టమైన టీఆర్‌ఎస్ ఆవిర్భావం కేసీఆర్ కుటుంబానికి మాత్రం భావోద్వేగంగా కఠిన పరీక్షగా మారే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. 

ఇతర పార్టీలకు అవకాశం.. 

తెలంగాణ రాజకీయాల్లో ఒకే కుటుంబంలో విభేదాలు తీవ్రరూ పం దాల్చితే, అది ప్రత్యర్థి పార్టీలకు లాభం చేకూర్చే అవకా శముం దని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ముఖ్యంగా ఓటు బ్యాంక్ విభజన, కేడర్‌లో గందరగోళం వంటి పరిణామాలు చోటుచేసుకుంటే, వాటిని ఇతర పార్టలు అనుకూలంగా మలచుకునే అవకాశం ఉంది. ఒకే నాయకత్వం కింద ఉన్న వర్గాలు విడిపోయి వేర్వేరు దారులు తీసుకుంటే, ఓటర్లు కూడా విభజించబడే పరిస్థితి ఉంటుం ది.

ఈ పరిస్థితిని కాంగ్రెస్ తమకు అనుకూలంగా మార్చుకుంటూ, ప్రత్యామ్నాయంగా నిలబడే అవకాశం పెరుగుతుందని విశ్లేషకులు చెబుతున్నారు. దీంతోపాటు అంతర్గత విభేదాలు బయటపడటం వల్ల ప్రత్యర్థులపై దాడి చేయడంలో కూడా బలహీనత రావచ్చు. ఈ ఖాళీని కాంగ్రెస్ సమర్థంగా వినియోగించుకుంటే, రాజకీయంగా పైచేయి సాధించే అవకాశాలు మెరుగవుతాయి. కుటుంబ రాజకీయాల్లో విభేదాలు పెరగడం కేవలం ఆ కుటుంబానికే కాదు, రాష్ట్ర రాజకీయ సమీకరణాలపై కూడా ప్రభావం చూపే అంశంగా మారి, కాంగ్రెస్‌కు పరోక్షంగా లాభం చేకూర్చే అవకాశంగా కనిపిస్తోంది. 

తాజా పరిణామాలపై అనేక సందేహాలు 

తెలంగాణ రాజకీయాల్లో తాజా పరిణామాల మధ్య కొన్ని కీలక ప్రశ్నలు చర్చనీయాంశంగా మారాయి. ముఖ్యంగా సీఎం రేవంత్‌రెడ్డి తెర వెనుక నుంచి ఇతర రాజకీయ శక్తులకు మద్దతు ఇస్తున్నా రా? అన్న అనుమానం రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నది. ప్రత్యక్షంగా కాకపోయినా, పరోక్షంగా వ్యూహాత్మక మద్దతు ఇస్తున్నారా అని సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇక మరోవైపు బీఆర్‌ఎస్ క్యాడర్ వైఖరి కూడా ఆసక్తికరంగా మారింది.

కవితను బీఆర్‌ఎస్ నుంచి సస్పెండ్ చేసిన తర్వాత బీఆర్‌ఎస్ నాయకులు కొందరు కవితను విమర్శించారు. కానీ ప్రస్తుతం బీఆర్‌ఎస్ కేడర్ కూడా కవితపై నిజంగా విమర్శలు చేయగలరా? లేక కుటుంబ అనుబంధాల కారణంగా మౌనం పాటిస్తారా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇప్పటి వరకు చూస్తే, నేరుగా దాడి చేయడంలో కొంత సంకోచం కనిపిస్తున్నట్టు విశ్లేషకులు భావిస్తున్నారు.

ఇతర పార్టీలపై దూకుడుగా స్పందించే బీఆర్‌ఎస్ శ్రేణులు కవిత విషయంలో మాత్రం వేచిచూసే ధోరణి అవలంబిస్తున్నాయా? అన్న సందేహం వ్యక్తమవుతున్నది. మొత్తంగా సీఎం రేవంత్‌రెడ్డి లోపాయికారి మద్దతు, కేడర్ మౌనం, అంతర్గత రాజకీయ లెక్కలు వంటి అంశాలు తెలంగాణ రాజకీయాల్లో కొత్త ఆసక్తికర సమీకరణాలకు దారితీసే సూచనలిస్తున్నాయి.