26 April, 2026 | 4:01 AM

కవిత కొత్త పార్టీ టీఆర్‌ఎస్

26-04-2026 02:21 AM

రెండేళ్లలో అధికారంలోకి వచ్చేది మేమే

Telangana Rastra Sena

  1. రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ మాదే 
  2. ప్రజలకు అమ్మనై పాలన అందిస్తా 
  3. కాంగ్రెస్‌ను గద్దె దించేందుకే ‘పాంచజన్యం’ పూరిస్తున్నాం 
  4. ఉచిత విద్య, ఉచిత వైద్యం, వ్యవసాయం, ఉపాధి, సామాజిక న్యాయమే ఇరుసుగా పనిచేస్తాం 
  5. రాష్ట్రానికి ఇప్పుడు ప్రాణం పెట్టి పనిచేసే పార్టీ కావాలి 
  6. అందుకే.. తెలంగాణ రాష్ట్ర సేన పార్టీ ఆవిర్భావం: కల్వకుంట్ల కవిత 
  7. మునీరాబాద్ వేదికగా పార్టీ ప్రకటన 

* బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌పై కవిత తీవ్రమైన విమర్శలు

కేసీఆర్ చుట్టూ గుంటనక్కలు, తోడేళ్ల్లు చేరాయి. వాటి చేతిలో కేసీఆర్ బందీ అయ్యారు. ఆయన ఇప్పుడు ప్రజల కేసీఆర్ కాదు. ఆత్మలేని ఒక మరబొమ్మ. ప్రజలు కష్టాల్లో ఉన్నా సార్ బయటకు రావడం లేదు. కాళేశ్వరం ఎత్తిపోతల పనుల్లో అవినీతి జరుగుతుందని చెప్తే, ఆ అవినీతి చేసిన పందికొక్కులనే కేసీఆర్ ఇప్పుడు పక్కన పెట్టుకున్నారు.

 * సీఎం రేవంత్‌పై ఘాటు వ్యాఖ్యలు

సీఎం రేవంత్ కర్కోటకుడు. నియంత. వెలుగుమట్లలో అన్ని అనుమతులు ఉన్నప్పటికీ పేదల ఇండ్లు కూల్చేశారు. ఇల్లు కోల్పోయిన బాధలో ఒక గర్భిణికి గర్భస్రావమైంది. ఆ విషయాన్ని చెబుతూ ఓ తండ్రి పడిన ఆవేదన ఇప్పటికీ నా కళ్లముందు మెదులుతున్నది. ఓ దుర్మార్గుడు నాగర్‌కర్నూల్ రెండు నెలల చిన్నారిని కాళ్లతో తొక్కి చంపితే ఇప్పటికీ కేసు పెట్టలేదు. కోదాడలో ఓ యువకుడిని లాకప్ డెత్ చేస్తే ఇప్పటికీ బాధ్యులపై చర్యలు లేవు.

* బీజేపీపై విమర్శనాస్త్రాలు

రాష్ట్రంలో సామాజిక న్యాయాన్ని ఖతం చేయడమే బీజేపీ సింగిల్ ఎజెండా. అందుకే మహిళ బిల్లును, కుల గణన, బీసీ బిల్లును తొక్కి పెట్టింది. ఆ పార్టీ నేతలకు అసలు తెలంగాణ రావడమే ఇష్టం లేదు. ఉమ్మడి ఆంధ్రా విభజనను ఒక నేత తల్లిని చంపి బిడ్డను వేరు చేశారని అంటే, మరో తలకాయ లేని ఎంపీ తేజస్వి సూర్య తెలంగాణ ఏర్పాటును ఇండియా, పాకిస్థాన్ విభజనతో పోల్చాడు.                   

హైదరాబాద్, ఏప్రిల్ 25 (విజయక్రాంతి): తెలంగాణ రాజకీయ యవనికపై కొత్త పార్టీ ఆవిర్భవించింది.. బీఆర్‌ఎస్ నుంచి బహిష్కృతురాలైన తెలంగాణ జాగృతి నాయకురాలు కల్వకుంట్ల కవిత శనివారం కొత్త పార్టీని ప్రకటించారు. మేడ్చల్ జిల్లా మునీరాబాద్‌లోని ప్రొఫెసర్ జయశంకర్ ప్రాంగణం (అద్వయ కన్వెన్షన్)లో అట్టహాసంగా.. భారీ సంఖ్యలో తరలివచ్చిన అభిమానుల కోలాహలం మధ్య జరిగిన కార్యక్రమంలో తమ పార్టీ పేరు  ‘తెలంగాణ రాష్ట్ర సేన’ (టీఆర్‌ఎస్) అని వెల్ల డించారు.

ఈ సందర్భంగా కవిత వాక్పటిమతో ప్రసంగిస్తూ.. కర్కోటక, రాక్షస రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని తరిమేసేందుకు టీఆర్‌ఎస్ పాంచజన్యాన్ని పూరిస్తున్నానని అన్నారు. ఉచిత విద్య, ఉచిత వైద్యం, వ్యవసాయం, ఉపాధి, సామాజిక న్యాయం అనే పంచ సూత్రాలే ఇరుసుగా తమ పార్టీ పని చేస్తుందన్నారు. రాష్ట్రంలో ఇప్పుడు ప్రధాన ప్రతి పక్షంగా ఈ ఐదు రంగాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఉద్యమిస్తామని.. రెండున్నరేళ్ల తర్వాత అధికారంలోకి వచ్చి ఆయా సమస్యలకు పరిష్కారం చూపిస్తానని తెలిపారు.

అమ్మనై తెలంగాణ ప్రజలకు పరిపాలన అందిస్తానని చెప్పారు. తన కోసం తరలివచ్చిన ప్రతిఒక్కరికీ కవిత కృతజ్ఞతలు తెలియజేశారు. ఉద్యమకాలంలో ప్రజల కోసం పరితపించిన కేసీఆర్ ఇప్పుడు గుంటనక్కలు, తోడేళ్ల చేతిలో బందీఅయ్యారని.. ఆయన మన కేసీఆర్ కాదు, మరబొమ్మ అన్నారు. తెలంగాణకు ఏదైనా జరిగితే ప్రాణం పెట్టి పనిచేసే పార్టీ కావాలని, అందుకోసమే తాను టీఆర్‌ఎస్ పార్టీని ఏర్పాటు చేస్తున్నానని తెలిపారు.

రేవంత్‌రెడ్డి కర్కోటకుడు.. నియంత

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఒక కర్కోటకుడని, నియంత అంటూ కవిత మండిపడ్డారు. ఖమ్మం సమీపంలోని వెలుగుమట్లలో అన్నిరకాల అనుమతులు ఉన్నా, పేదల ఇళ్లను అన్యాయంగా కూల్చివేశారని పేర్కొన్నారు. ఎన్నో కుటుంబాలకు వీధిన పడ్డాయని గుర్తుచేశారు. ఇల్లు కోల్పోయిన బాధలో ఒక గర్భిణికి గర్భస్రావమైందని, ఆ విషయాన్ని చెబుతూ ఓ తండ్రి చెందిన ఆవేదన ఇప్పటికీ తన కళ్లముందు మెదులుతుందని చెప్పారు.

ఓ దుర్మార్గుడు నాగర్‌కర్నూల్ రెండు నెలల చిన్నారిని కాళ్లతో తన్ని చంపితే ఇప్పటికీ కూడా కేసు పెట్టలేదని గుర్తుచేశారు. గురుకులాల్లో విషం పెట్టి విద్యార్థు లను చంపుతుంటే ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదని నిలదీశారు. కోదాడలో కర్ల రాజేష్ అనే యువకుడిని లాకప్ డెత్ చేస్తే ఇప్పటికీ, బాధ్యులపై చర్యలు లేవని వాపోయారు. అందుకే ముఖ్యమంత్రిని కర్కోటక, నియంత ముఖ్యమంత్రి అంటున్నానని స్పష్టం చేశారు.

రాష్ట్రంలో ఇప్పుడు న్న మూడు ప్రధాన పార్టీలు కుటుంబ పాలన, అవినీతి, బంధుప్రీతితో నిండిపోయాయని ఆరోపించారు. ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీని ప్రధాని చేయటం కాంగ్రెస్ ముందున్న అజెండా అని పేర్కొన్నారు. పెద్ద సార్ (కేసీఆర్) ఫాంహౌస్ లో ఉండి, చిన్న సార్ (కేటీఆర్)ను సీఎం చేయాలన్నది బీఆర్‌ఎస్ ముందున్న అజెండా అని అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో సామాజిక న్యాయాన్ని ఖతం చేయడమే బీజేపీ సింగిల్ అజెండా అని కవిత అన్నారు. ఆ మూడు పార్టీల వైఖరిపై అలుపెరగని పోరాటం చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని వివరించారు.

అమ్మగా పరిపాలన అందిస్తా..

తెలంగాణలో 3.50 కోట్ల మంది ప్రజలకు అమ్మనై పరిపాలన అందిస్తానని కవిత వెల్లడించారు. అమ్మతనంతో పాలన ఇస్తేనే బిడ్డల కష్టం తెలుస్తుందని అభిప్రాయపడ్డారు. తెలంగాణలో ఏళ్ల తరబడి నడిచిన భూస్వామ్య వ్యవస్థపై ఎందరో మహానుభవులు పోరాడితేనే సమానత్వం వచ్చిందని, మలిదశలో కేసీఆర్‌తోపాటు ఉద్యమకారులు పోరాడితే కొత్త రాష్ట్రం వచ్చిందని గుర్తుచేశారు.

ఇప్పుడు తాము రాజకీయ శక్తితో పాటు ప్రజా పోరాటాలను మిళితం చేసి సామాజిక తెలంగాణ సాధిస్తామని వెల్లడించారు. తల్లి ఎప్పటికీ జేబు చూడదని, కడుపు మాత్రమే చూస్తుందని కవిత పేర్కొన్నారు. తమ పార్టీ మున్ముందు రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ఎదుగుతుందని, మరో రెండేళ్లలో తమ పార్టీనే రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. 

దారితప్పిన తెలంగాణ రథ చక్రం..

తెలంగాణ సాధించుకున్న తర్వాత, ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఆధ్వర్యంలో రాష్ట్ర రథ చక్రం దారి తప్పిందని కవిత దుయ్యబట్టారు. తెలంగాణ ప్రజల ఆశలు, ఆర్తిని అర్థం చేసుకోవటంలో బీఆర్‌ఎస్ పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. సామాజిక తెలంగాణ రథ చక్రం పూర్తిగా విరిగి ముక్కలైందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఏ కలలతో తెలంగాణ తెచ్చుకున్నామో అవి నిజం కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ వస్తే బానిస సంకెళ్లు పోతాయని భావిస్తే, రైతులకు బేడీలు వేశారని మండిపడ్డారు.

ఇసుక దందా మీద ప్రేమతో దళితుల మీద లాఠీలు విరిగాయని గత బీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. ఫోన్ ట్యాపింగ్‌కు పాల్పడడం ఎంతటి దారణమో ప్రజలు అర్థం చేసుకోవాలని సూచిం చారు. స్వయంగా తానే వ్యక్తిగత స్వేచ్ఛ లేకుండా బతకాల్సి వచ్చిందని వాపోయా రు. నాడు తెలంగాణ కోసం ఆస్తులు అమ్ముకున్న వాళ్లంతా, ఇప్పుడు ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు. ఉద్యమకారులు, అమరవీరుల కుటుంబాలకు అన్యా యం జరిగిందని ఆరోపించారు.

ఉద్యమకారులు ఒక హోదా మాత్రమే కోరుకున్నారని, పదేళ్లు అధికారంలో ఉండి కూడా బీఆర్‌ఎస్ ప్రభుత్వం కనీసం వారికి నామినేటేడ్ పోస్టులు కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. ఉద్యమ సమయంలో అవహేళన చేసి లాఠీలతో కొట్టిం చిన వాళ్లే, మళ్లీ బీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చాక పెత్తనం చెలాయించారని మండిపడ్డారు. నాడు పరిపాలన చేసిన కుటుంబం లో తాను కూడా భాగమేనని అందుకు క్షమాపణ మాత్రమే చెబితే సరిపోదని అభిప్రాయపడ్డారు.

సామాజిక తెలంగాణలో కోసం కష్టపడి పనిచేయాల్సి ఉంటుందని, తమ పనితీరు ఎలా ఉంటుం దో మున్ముందు ప్రజలు చూస్తారని తెలిపారు. ప్రజలకు మంచి చేయాలంటే రాజకీ య అధికారం కావాల్సి ఉంటుందని అభిప్రాయపడ్డారు. రాజ్యాంగ పరంగా ప్రజా ఉద్యమాలను మిళితం చేసి రాజకీయాలు చేస్తామని వెల్లడించారు. ఏ పార్టీకై నా ఆత్మ నేపథ్యం ఉండాల, బీఆర్‌ఎస్ దాన్ని కోల్పోయిందని చెప్పారు. బీఆర్‌ఎస్ ఆత్మను కోల్పోయినందుకే తెలంగాణ రాష్ట్ర సేన వచ్చిందన్నారు.  

ఆత్మలేని మరబొమ్మ కేసీఆర్..

తన తండ్రి, బీఆర్‌ఎస్ కేసీఆర్‌పై కూడా కవిత తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఉద్యమకారుడైన కేసీఆర్ వేరు అని, నేటి కేసీఆర్ వేరని ఆమె అభిప్రాయపడ్డారు. నాటి కేసీఆర్ చేనేత కార్మికులు చనిపోతే భిక్షాటన చేసి సాయం చేశారని గుర్తుచేశారు. కానీ మారిన, మర మనిషి కేసీఆర్ ఇప్పుడు ప్రజలు కష్టా ల్లో ఉన్నా, ఎందుకు బయటకు రావడం లేదని ప్రశ్నించారు. వెలుగుమట్లలో, హైడ్రా పేరుతో సర్కార్ ఇండ్లు కూల్చేస్తుంటే ‘అయ్యా కేసీఆర్’ అని ప్రజలు పిలుస్తుంటే బయటకు రాకపోవడం దారుణమని పేర్కొన్నారు.

నాడు ఒక సింగరేణి కార్మికుడు చనిపోతే వెళ్లి పరామర్శించిన ఆయన, నేడు చేవెళ్లలో బస్సు ప్రమాదంలో చాలామంది చనిపోయినా పట్టించుకోలేదని విమర్శించారు. అధికారం వచ్చిన తర్వాత ప్రేమ, మమకారం పోయిందా.. అంటూ కేసీఆర్‌ను ప్రశ్నించారు. అవినీతి చేస్తే కొడుకునైనా, కూతురినైనా సరే వదలనని కేసీఆర్ గతంలో చెప్పారని గుర్తుచేశారు. కానీ.. తాను కాళేశ్వరం ఎత్తిపోతలలో అవినీతి జరుగుతుం దని చెబితే, ఆ అవినీతి చేసిన పందికొక్కులను పక్కన పెట్టుకొని తననే పార్టీ నుంచి సస్పెండ్ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.

గుంటనక్కలు, తోడేళ్ల చేతుల్లో కేసీఆర్ బందీ అయ్యారన్నారు. ఆర్డీఎస్ ద్వారా నీళ్ల కోసం నాడు పాదయాత్ర చేసిన కేసీఆర్, అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ డిమాండ్‌ను ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నించారు. కేంద్రంతో గొడవ పెట్టుకోకపోయింటే పాలమూరు--రంగారెడ్డి పూర్తయ్యేదని అభిప్రా యపడ్డారు. బీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చి న పదేళ్లలో నీళ్ల కోసం రూ.లక్షా 89 వేల కోట్లు ఖర్చు చేసి 14 లక్షల ఎకరాలకు మాత్ర మే నీళ్లిచ్చారని చెప్పారు.

రాష్ట్రంలో ఏదో సాధించినట్లు పంజాబ్, గుజరాత్, బీహార్ వెళ్లి జాతీయ పార్టీ పెట్టాలని చూశారని కేసీఆర్‌ను ఎద్దేవా చేశారు. పైగా ప్రజలే తప్పు చేశారన్నట్లుగా కేసీఆర్ రాజకీయ పరిణతి కోల్పోయి మాట్లాడుతున్నారని మండి పడ్డారు. తాను ఎన్ని మాట్లాడిన సరే బీఆర్‌ఎస్ నేతలకు సమాధానం చెప్పటం చేతకావటం లేదని ఎద్దేవాచేశారు. ఇప్పుడు కూడా వారు సమాధానం చెప్పకపోతే ప్రజ లే బయటకు లాగి సమాధానం చెప్పేలా చేస్తారని హెచ్చరించారు.

భారీగా తరలివచ్చిన కార్యకర్తలు..

పార్టీ ఆవిర్భావ సభకు తెలంగాణ నలుమూలల నుంచి జాగృతి కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. మొత్తం 1,500 బస్సులు, 2 వేలకు పైగా ఇతర వాహనాల్లో మునీరాబాద్ కు చేరుకున్నారు. సుమారు 40 వేల మంది కార్యకర్తలు తరలిరావడంతో సభా ప్రాంగణం జనంతో కిక్కిరిసిపోయింది. సభ అనంతరం కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. పార్టీ ప్రకటన అనంతరం క్యాడర్‌తో కలిసి కవిత భారీ ర్యాలీగా హైదరాబాద్ కు తిరిగివచ్చారు.

పాంచజన్యం పేరుతో ఐదు హామీలు..

సభ వేదికగా కవిత తెలంగాణ రాష్ట్ర సేన అజెండాను కవిత వివరించారు. పాంచజన్యం పేరుతో ఐదు అంశాలపై హామీ ఇచ్చారు. తమ పార్టీ ఉచిత విద్య, ఉచిత వైద్యం, రైతు సంక్షేమం, ఉపాధి, సామాజిక న్యాయం అనే అంశాలపై దృష్టి పెడుతుందని స్పష్టం చేశారు. కేజీ నుంచి పీజీ వరకు ప్రైవేట్, కార్పొరేట్ స్కూళ్లలో చదివిన కూడా ప్రజలపై రూపాయి భారం పడనివ్వమని వివరించారు. ఎంత పెద్ద ఆరోగ్య సమస్యకైనా కార్పొరేట్ వైద్యం చేయించుకున్న సరే, ప్రజలకు ఆ వైద్యాన్ని ఉచితంగానే అందించే బాధ్యత తనదని వెల్లడించారు.

రైతు సంక్షేమం అంటే రైతుకు గౌరవం వచ్చేలా కృషి చేయటమేనని అభిప్రాయపడ్డారు. తాము రైతులమని గర్వంగా చెప్పుకొనేలా తమ పార్టీ కార్యాచరణ ఉంటుందని వివరించారు. 24 గంటల ఉచిత కరెంట్, యూరి యా సహా రైతు సంక్షేమానికి చేయాల్సివన్నీ చేస్తామని హామీ ఇచ్చారు. రైతును రాజు చేయటమే లక్ష్యమని వివరించారు. ఉపాధి విషయంలోనూ తమకు స్పష్టమైన విజన్ ఉందని చెప్పారు.

యువతకు ఉపాధి అంటే కేవలం ఉద్యోగం మాత్రమే కాదని, వారి వద్ద మంచి వ్యాపార ఆలోచన ఉంటే, వారికి తమ ప్రభుత్వంలో రూ.2 లక్షల నుంచి రూ.20 కోట్ల వరకు రుణం అందించి, వారిని ప్రోత్సహిస్తామని హామీ ఇచ్చారు. అదే విధంగా తాము అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలోనే ఒకటే నోటిఫికేషన్‌లో 4 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని స్పష్టం చేశారు. తెలంగాణ ఉద్యమకారులు తమ యవ్వనాన్ని ఉద్యమంలో కోల్పోయారని, వారి కోసం 2 జూన్ 2014వ తేదీని కటాఫ్ తేదీగా నిర్ణయిస్తూ, లక్ష సూపర్ న్యూమరీ ఉద్యోగాలు కల్పిస్తామని అభయమిచ్చారు.

సామాజిక న్యాయం కోసం చిత్తశుద్ధితో పనిచేస్తామనివ వివరించారు. హిందీలో తియ్య గా మాట్లాడి బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌లు మైనార్టీలను మోసం చేశాయని దుయ్యబ ట్టారు. మైనార్టీలతో పాటు అన్ని వర్గాలకు రాజకీయ అధికారం కోసం తమ పార్టీ పోరాటం చేస్తుందని వెల్లడించారు. మహిళ భద్రతకు ప్రాధాన్యం ఇవ్వటంతో పాటు చిరు ఉద్యోగులు, వ్యాపారులు, కాంట్రాక్టర్లను కడుపు లో పెట్టుకొని చూసుకుంటామని హామీ ఇచ్చారు. 

సామాజిక న్యాయానికి బద్ద వ్యతిరేకి బీజేపీ..

బీజేపీ అంటేనే సామాజిక న్యాయానికి బద్ద వ్యతిరేకి అంటూ కవిత ఘాటు విమర్శలు చేశారు. ఆ పార్టీ పెద్దలకు అసలు తెలంగాణ ఏర్పాటే ఇష్టం లేదని అభిప్రాయ పడ్డారు. ఒకరు తల్లిని చంపి బిడ్డను వేరు చేశారని అంటే, మరొక తలకాయ లేని ఎంపీ తెలంగాణ ఏర్పాటును ఇండియా, పాకిస్తాన్ విభజనతో పోల్చడని గుర్తు చేశారు. తెలంగాణను అవమా నించేలా మాట్లాడిన సరే ఇక్కడి బానిస ఎంపీలు నోరు మెదపటం లేదని దు య్యబట్టారు. తెలంగాణకు ఒక్క పైసా ఇవ్వకపోయినా కేంద్రాన్ని ప్రశ్నించటం లేదని మండిపడ్డారు.

రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధంగా, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తెలంగాణకు చెందిన ఏడు మండలాలను ఆంధ్రాలో కలిపిందని గుర్తుచేశారు. పోలవరం కారణంగా భద్రాచలం వద్ద ఐదు గ్రామాలు మునిగిపోయే పరిస్థితి ఉందని, ఆ గ్రామాలను తెలంగాణకు తేవాలని బీజేపీ ఎంపీలకు సూచించారు. ఇదే అంశంపై జాగృతి పోరాటం చేసిందని కేంద్రానికి, ఆంధ్రా ప్రభుత్వానికి లేఖ రాసిందని గుర్తుచేశారు.

బీజేపీ ఎంపీలు 8 మంది తెలంగాణ బిడ్డలైతే రాముని గుడి మునిగిపోకుండా ఐదు గ్రామాలను తెలంగాణకు తేవాలని సవా ల్ విసిరారు. మొదటి నుంచి కూడా బీజేపీ సామాజిక న్యాయానికి బద్ద వ్యతిరేకి అని కవిత అన్నారు. మహిళ బిల్లును, కుల గణన, బీసీ బిల్లును తొక్కి పెట్టిందని తెలిపారు. పేదలకు కూడు పెట్టే ఉపాధి హామీ పథకాన్నీ లేకుండా చేసిందని వి మర్శించారు.

తెలంగాణ సాధన కోసం, సాంస్కృతిక వికాసం కోసం తెలంగాణ జాగృతి అహర్నిశలు కొట్లాడిందని గుర్తుచేశారు. రాష్ట్ర సాంస్కృతిక దీపాన్ని తా ము పదిలంగా కాపాడుకున్నారని పేర్కొన్నారు. కాళరాత్రిలో కాగడాలా రాష్ట్ర ఉద్యమానికి జాగృతి వెలుగునిచ్చిందని వివరించారు. బతుకమ్మ పండుగ ద్వారా తెలంగాణ సంస్కృతి ఇది.. అని ప్రపంచానికి జాగృతి చాటిచెప్పిందని వెల్లడించారు. 

అమర వీరులకు ఘన నివాళి..

తెలంగాణ రాష్ట్ర సేన (టీఆర్‌ఎస్) పార్టీ ఆవిర్భావ సభకు బయల్దేరే ముందు బంజారాహిల్స్‌లోని నివాసంలో కవిత, అనిల్ దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. తర్వాత, గన్ పార్క్ లోని అమర వీరుల స్థూపం వద్దకు వెళ్లి ని అమరవీరులకు నివాళులర్పించారు. అక్కడి నుంచి కార్యకర్తలు, అభిమానులతో కలిసి భారీ ర్యాలీగా మునీరాబాద్ లోని అద్వయ కన్వెన్షన్ సెంటర్ కు చేరుకున్నారు. కన్వెన్షన్ సెంటర్ ప్రధాన ద్వారం (కాళోజీ ద్వారం) వద్ద కళాకారులు, తెలంగాణ జాగృతి సభ్యులు వారికి ఘన స్వాగతం పలికారు.

పసుపు, నీలం, ఆకుపచ్చ రంగులతో పార్టీ జెండా ను రూపొందించామని కవిత తెలిపారు. సౌభాగ్యానికి ప్రతీక అయిన పసుపు, బడుగు, బలహీన వర్గాల సంపూర్ణ వికాసానికి ప్రతీక అయిన నీలం, పాడిపం టలతో అలరారే గ్రామసీమలకు, రైతన్నలకు ప్రతీకగా ఆకుపచ్చ రంగులను జెం డాలో పొందుపరిచామని వెల్లడించారు. పసుపు రంగు మధ్యలో నీలిరంగులో తెలంగాణ మ్యాప్ ముద్రిం చి, ఇంగ్లిష్ అక్షరాల్లో టీఆర్‌ఎస్ అని ముద్రించామని వివరించారు. కింద ఆకుపచ్చ రంగు పట్టీలో తెలంగాణ రాష్ట్ర సేన పేరును ప్రింట్ చేశామని తెలిపారు.