9 July, 2026 | 5:24 AM

తుంగతుర్తి కాంగ్రెస్‌లో విభేదాలు

09-07-2026 12:42 AM
  1. మండల అధ్యక్షుల నియామకంతో వివాదం
  2. బీఆర్‌ఎస్ నుంచి వచ్చిన వారికే ఎమ్మెల్యే సామేలు ప్రాధన్యాం
  3. పాత కాంగ్రెస్ నాయకుల తీవ్ర అసంతృప్తి 
  4. నియామకాలు రద్దు చేయాలని డిమాండ్
  5. ఫిర్యాదు చేసేందుకు గాంధీభవన్‌కు బయలుదేరిన నేతలు
  6. వాహనాల్లో వెళ్తుండగా అడ్డుకున్న మరో వర్గం 
  7. అర్వపల్లిలో పార్టీకి చెందిన ఇరు వర్గాల బాహాబాహి
  8. రాళ్లు, కర్రలతో పరస్పర దాడులు
  9. ధ్వంసమైన పోలీసు వాహనాలు
  10. పరిస్థితిని అదుపు చేసేందుకు లాఠీచార్జ్

సూర్యాపేట, జూలై 8 (విజయక్రాంతి): సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు ఒక్కసారిగా రచ్చకెక్కాయి. కాంగ్రెస్ పార్టీకి చెందిన రెండు వర్గాలు అర్వపల్లి మండల కేంద్రంలో బుధవారం రోడ్డుపైకి వచ్చి బాహాబాహికి దిగాయి. ఒకరిపై ఒకరు రాళ్లు, కర్రలతో దాడులు చేసుకోవడమే కాకుండా, పరిస్థితిని అదుపు చేయడానికి వచ్చిన పోలీసుల వాహనాలను ధ్వంసం చేశారు.

ఈ ఘర్షణకు అసలు కారణం ఇటీవల పీసీసీ ప్రకటించిన తుంగతుర్తి నియోజకవర్గంలోని మండలాల అధ్యక్షుల నియామకమే. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి వచ్చిన ప్రస్తుత ఎమ్మెల్యే మందుల సామేలు తన ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ, తనతో పాటు వలస వచ్చిన వారికే కీలక పదవులు కట్టబెట్టారని పాత కాంగ్రెస్ నాయకులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.

ఎన్నో ఏళ్లుగా పార్టీకి అండగా నిలుస్తూ జెండాలు మోసి, కేసులు ఎదుర్కొన్న సీనియర్లను కాదని, కనీస ప్రాథమిక సభ్యత్వం కూడా లేని వలస నేతలకు 9 మండలాల అధ్యక్ష పదవులు ఇవ్వడం ఏమిటని పాత నాయకత్వం తిరుగుబాటు బావుటా ఎగురవేసింది. 

గాంధీభవన్‌కు వాహనాలను అడ్డుకోవడంతోనే..

కొత్తగా వచ్చిన వారికే మండల అధ్యక్ష పదవులు కట్టబెట్టడాన్ని నిరసిస్తూ, ఆ నియామక ఉత్తర్వులను రద్దు చేయాలని కోరుతూ నియోజకవర్గంలోని పాత కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఛలో గాంధీభవన్‌కు పిలుపునిచ్చారు. బుధవారం పలువురు వివిధ వాహనాల్లో హైదరాబాద్‌లో గాంధీభవన్‌కు బయలుదేరారు. అయితే, వారి వాహనాలు అర్వపల్లి చౌరస్తాకు చేరుకోగానే ఎమ్మెల్యే మందుల సామేలు వర్గీయులు అడ్డుకున్నారు.

ఆ సమయంలో ఇరువర్గాల మధ్య మాటకు మాట పెరిగి భౌతిక దాడులకు దారితీసింది. తదుపరి రోడ్డుపైనే ఇరువర్గాలు కర్రలు, రాళ్లతో దాడులకు దిగడంతో అర్వపల్లి చౌరస్తా రణరంగాన్ని తలపించింది. ఈ ఘటన భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి వర్గానికి, ఎమ్మెల్యే మందుల సామేలు వర్గానికి మద్య ఉన్న ఆధిపత్య పోరు కారణంగానే జరిగిందని అందరికి అర్థం అయ్యేలా చేసింది. అయితే ఈ ఘటనలో పలువురు కార్యకర్తలతో పాటు, పోలీసులకు గాయాలైనట్టు తెలుస్తుంది.

అర్వపల్లి పోలీసులు అక్కడికి చేరుకుని ఘర్షణ పడుతున్న ఇరువర్గాలను శాంతింపజేసే ప్రయత్నం చేశారు. అయినా పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో పోలీసులు లాఠీఛార్జ్ చేసి ఇరువర్గాలను చెదరగొట్టారు. ఈ ఉద్రిక్త వాతావరణంలో కొందరు ఆందోళనకారులు పోలీసుల వాహనాలపై రాళ్లు రువ్వడంతో వాటి అద్దాలు పగిలి వాహనాలు ధ్వంసమయ్యాయి.

మండల కేంద్రంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అలాగే ప్రభుత్వ ఆస్తులను, పోలీసు వాహనాలను ధ్వంసం చేసిన వారిని గుర్తించేందుకు వీడియో పుటేజీలను పోలీస్ అధికారులు పరిశీలిస్తున్నారు.